19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఇక అతివలకు అవకాశాలు

33 శాతం రిజర్వేషన్లకు ఎగువసభ ఆమోదం

వచ్చేనెల్లో లోక్ సభలో బిల్లుప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

దేశ రాజకీయ చరిత్ర గతిని మలుపు తిప్పే ఒక కీలక ఘట్టం ప్రారంభమైంది. ఏళ్లతరబడి ఊరిస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్లేషన్ల బిల్లును 2010 మార్చి 9న పలు అంతరాయాల మధ్య ఎగువసభ ఆమోదించింది. దేవెగౌడ జమానాలో 1996లో రూపుదిద్దుకున్న ఈ బిల్లు పలు పురిటి నొప్పుల అనంతరం సుమారు పధ్నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆలస్యంగానైనా ఆమోదం పొందడం హర్షణీయం. దీనిని ప్రతి ఒక్కరూ సహర్షంగా స్వాగతించాలి.

వందో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎగువసభలో ఆమోదం పొందిన 108వ రాజ్యాంగ సవరణ బిల్లు మరికొద్ది రోజుల్లో లోక్ సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. పార్లమెంటులోని మెజారిటీ పార్టీలు అనుకూలంగా ఉన్నందున లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందడం అంత కష్టం కాకపోవచ్చు. దుగవసభ కూడా ఆమోదిస్తే వచ్చే ఎన్నికల నుంచి మహిళలు పెద్దసంఖ్యలో పార్లమెంటులో ప్రవేశించే అవకాశం ఉంది. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, లోక్ సభ స్పీకర్ మీరాకుమార్, సభలో విపక్ష నేత సుష్మా స్వరాజ్, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ తదితర దిగ్గజాలు చక్రం తిప్పుతున్న తరుణంలో నే మహిళా బిల్లు ఆమోదం పొందడం కాకతాళీయమే.

ఇక కాంగ్రెస్ శ్రేణులు ఈ క్రెడిట్ ను కొట్టేసేందుకు సమాయత్తమవుతున్నాయి. పార్టీ అధినేత్రి సోనియా కృషి వల్లే ఇది సాధ్యమైందని ఎప్పటిలాగా వంది మాగంధులు వినసొంపుగా ప్రచారం చేయడం గమనార్హం.

అభ్యంతరాలు కొట్టేయలేం!

నాణేనికి రెండో వైపు చూస్తే బిల్లుకు సంబంధించి ఆర్.జె.డి. అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, జనతాదళ్ (యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ బి.ఎస్.పి. అధినేత్రి మాయావతి తదితరులు లేవనెత్తిన అభ్యంతరాలను ఏకపక్షంగా కొట్టేయలేం. ఆది నుంచి దీనిని వ్యతిరేకిస్తున్న వారి వాదనను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవలసిందే.

కోటాను 20 శాతానికి తగ్గించాలని అందులో బీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలన్న యాదవ్ త్రయం వాదనలో హేతుబద్ధత లేకపోలేదు. ప్రస్తుతరూపంలో ఉన్న బిల్లు వల్ల అగ్రవర్ణాల మహిళలకు తప్ప మిగిలిన వర్గాలకు ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల మహిళలకు ఎలాంటి మేలు జరగదన్న వారి అభిప్రాయం వాస్తవమే. ఈ కోటాలో అంతర్భాంగా ఎస్సీ, ఎస్టీల సంఖ్య పెరిగి ఆ మేరకు బీసీలు నష్టపోవలసి వస్తుంది. అగ్రవర్ణాలు, దళితుల ఆధిపత్యం ఉన్నబీహార్, ఉత్తర్ ప్రదేశ్‌లలో తాజా బిల్లు వల్ల బీసీల రాజకీయ ఆధిపత్యానికి గండి పడుతుంది. అందుకే రిజర్లేషన్లను 20 శాతానికి తగ్గించాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. 20 శాతానికి తగ్గించని పక్షంలో 33 శాతం రిజర్లేషన్లలో బీసీలకు ప్రత్యేక రిజర్లేషన్లను కల్పించాలని యాదవ్ త్రయం కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎం.ఐ.ఎం. పార్టీ కూడా ఇదే వాణిని బలంగా వినిపిస్తోంది.

ముందు దీనిని ఆమోదిస్తే ఉప కోటా సంగతి తర్వాత చూస్తామన్న అధికార కాంగ్రెస్ వాదనను ఈ పార్టీలు విశ్వసించడం లేదు. ఒకసారి బిల్లు ఆమోదం పొందిన తర్వాత తమను పట్టించుకునే వారుండరని అందుకే ఇప్పుడే ఒత్తిడి తీసుకురావాలని వారు ప్రయత్నిస్తున్నారు. ఉప కోటా లేకపోతే ధనిక వర్గాల, అగ్రవర్ణాల మహిళలే అవకాశాలను తన్నుకుపోతారు. ప్రస్తుతం పార్లమెంటులో కేవలం నలుగురు బీసీ మహిళా ఎంపీలు మాత్రమే ఉన్నారు. దేశ జనాభాలో 80 శాతం గల బీసీలకు కేవలం ఒకశాతానికి కన్నా తక్కువ మంది సభ్యులు ఉండటం ఏ రకంగా సమర్థనీయం కాదు. దేశంలో సుమారు 3500 బీసీల కులాలు ఉన్నాయని అంచనా కాగా వీరిలో ఏకాంగా3470 కులాల వారికి ఇంతవరకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోవడం విచారకరం. వాస్తవాలు ఎంతగా ఉన్నప్పటికి, యాదవ్ త్రయం ఎంతగా పోరాడినప్పటికి వారి బలం పరిమితమే కావడంతో మహిళా బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడం ఖాయం.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved