19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

చట్టసభల సమావేశాలు...కొన్ని సంగతులు

అసెంబ్లీ లేదా పార్లమెంట్ సమావేశాలు ఏటా మూడుసార్లు జరుగుతాయి. వీటిని బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలుగా పిలుస్తారు. అన్నింటికన్నా బడ్జెట్ సమావేశాలు ప్రభుత్త్వానికి అత్యంత కీలకమైనవి, ముఖ్యమైనవి. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండు, మూడు వారాల్లో ప్రారంభమై మార్చి ఆఖరు వరకు జరుగుతాయి. ఈ సమావేశాల్లోనే బడ్జెట్లు ప్రవేశపెడతారు. పార్లమెంటులో అదనంగా రైల్వేబడ్జెట్ కూడా సమర్పిస్తారు.రాష్ట్రపతి / గవర్నరు ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. రాష్ట్రాల అసెంబ్లీలను ఉద్దేశించి గవర్నర్లు, పార్లమెంటును ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. వీటిని సంయుక్త సమావేశాలని కూడా అంటారు. రాష్ట్రాల్లో అయితే అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులను, కేంద్రంలో అయితే లోక్ సభ, రాజ్యసభ సభ్యులను ఉద్దేశించి గవర్నర్లు, రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ప్రభుత్వ పాలనకు సంబంధించిన ప్రధానాంశాలు వారి ప్రసంగాల్లో ఉంటాయి. గవర్నర్లు, రాష్ట్రపతి ప్రసంగాల అనంతరం వారికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాలను ప్రవేశపెడతారు. వీటిపై సమగ్ర చర్చ అనంతరం ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. సాధారణంగా వర్షాకాల సమావేశాలు జూన్, జులైల్లో, శీతాకాల సమావేశాలు నవంబరులో జరుగుతాయి. ప్రతి సమావేశాలకు ముందు శాసనసభాపక్ష నాయకులతో స్పీకర్ సభలో చర్చింబోయే ఎజెండాను రూపొందిస్తారు. దీనినే సభావ్యవహారాల సంఘం అని అంటారు. ఇందులోని ఎజెండా మేరకు సభ జరగాలి. కానీ చాలా సందర్భాల్లో అలా జరగడం ల్లేదు. ఫలితంగా సభ విలువైన సమయం వృథా అవుతుంది.

సభానాయకుడు అంటే....

మెజారిటీ సభ్యులు గల పార్టీ నాయకుడు సభానాయకుడిగా వ్యవహరిస్తారు. ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ నాయకురాలుగా సమాచార శాఖ మంత్రి డాక్టర్ జె.గీతారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈమె మెదక్ జిల్లాకు చెందిన వారు. ముఖ్యమంత్రి రోశయ్య శాసనమండలి సభ్యుడు అయినందున గీతారెడ్డి నియామకం అనివార్యమైంది. ప్రస్తుతం లోక్ సభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. లోక్ సభ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ. పశ్చిమబెంగాల్ కు చెందిన ఈ సీనియర్ నాయకుడు కీలకమైన ఆర్థికమంత్రిత్వ శాఖకు సారధి. మన్మోహన్ మంత్రివర్గంలో అత్యంత సీనియర్. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లోక్ సభ సభ్యుడు కానందున ఈ నియామకం అవసరమైంది. మన్మోహన్ అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. మొదటి నుంచి మన్మోహన్ ఎగువసభ సభ్యుడిగానే ఉంటున్నారు.

  • స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేని సమయాల్లో ప్యానెల్ స్పీకర్లు సభను నిర్వహిస్తారు. సీనియర్ సభ్యులను ప్యానెల్ స్పీకర్లుగా స్పీకర్ నియమిస్తారు.
  • శాసనసభ సమావేశాలకు సంబంధించి ప్రజలకు తెలియజేయాల్సిన ముఖ్యమైన అంశాలు ఉన్నప్పుడు స్పీకర్ వాటిని బులెటిన్ ద్వారా తెలియజేస్తారు.

వాయిదా తీర్మానం...

సభ ప్రారంభమయ్యే గంట ముందు నోటీసిచ్చి దీనిని ప్రవేశపెట్టవచ్చు. స్పీకర్ లేదా కార్యదర్శికి ఈ మేరకు నోటీసివ్వాలి. స్పీకర్ ఇందుకు అంగీకరించినట్లయితే మిగతా అజెండాను పక్కనబెట్టి దీనిని చర్చకు చేపడతారు. ఒకసారి ఇచ్చిన అంశాన్ని మళ్లీ ఇవ్వకూడదు. చర్చను నిర్దిష్ట సమయానికే పరిమితం కావాలి. విపక్ష సభ్యులే ఎక్కువగా వాయిదా తీర్మానాలను ప్రవేశపెడతారు.

ప్రశ్నోత్తరాల సమయం...

ఇది అత్యంత కీలకమైన అంశం. ఈ అవకాశాన్ని కూడా ఎక్కువగా విపక్ష సభ్యులే వినియోగించుకుంటారు. ప్రశ్నల్లో రకరకాల ప్రశ్నలు ఉంటాయి. ముందస్తుగా సభ్యులు తమ ప్రశ్నలను తెలియజేసి ప్రభుత్వం నుంచి జవాబులు రాబట్టవచ్చు. కొన్ని ప్రశ్నలను లాటరీల ద్వారా ఎంపిక చేస్తారు. కొన్ని నక్షత్రపు మార్కు ప్రశ్నలుంటాయి. వీటికి సభలోనే మంత్రులు సమాధానాలిస్తారు. స్పీకర్ విచక్షణాధికారం మేరకు నక్షత్రపు ప్రశ్నల రూపం మార్చవచ్చు. కొన్ని లిఖితపూర్వక ప్రశ్నలు ఉంటాయి. తమ ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం లభించకుంటే అనుబంధ ప్రశ్న వేసే హక్కు సభ్యుడికి ఉంటుంది.

ఇందులో మరో ముఖ్యమైన అంశం జీరో అవర్. తక్షణ ప్రజాప్రయోజన ప్రాధాన్యం గల అంశాలపై అప్పటికప్పుడు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఈ నిబంధన కింద అవకాశం ఉంది.(సభాకార్యక్రమాలలో ప్రతిరోజు మొదటి అంశం ప్రశ్నోత్తరాల సమయం...జీరో అవర్ ప్రశ్నోత్తరాలకు ముందు వాడగలిగిన గంట సమయం.)

చర్చల సరళి...

వివిధ నిబంధనల కింద సభలో చర్చ జరుగుతుంది. అత్యవసర ప్రజాప్రాధాన్యం గల అంశాన్ని చర్చించేందుకు స్వల్పవ్యవది చర్చ కింద నోటీసు ఇవ్వాలి. ఇది అర్హమైనదని సభాపతి భావిస్తే చర్చకు అవకాశమిస్తారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగియగానే దీనిని చేపడతారు. ఆయా పార్టీల సభ్యుల సంఖ్య ఆధారంగా చర్చకు సమయాన్ని కేటయిస్తారు. అధ్యక్షుడి అనమతితో అత్యవసర ప్రాముఖ్యం కలిగిన కాల్ అటెన్షన్ మోషన్ ద్వారా చర్చించవచ్చు. దీనినే సావధాన తీర్మానం అని పిలుస్తారు. మెజారిటీ సభ్యుల మద్దతు, విశ్వాసాన్ని ప్రభుత్వం కోల్పోయిందని భావించినప్పుడు విపక్షం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తుంది. అవిశ్వాస తీర్మానంపై సమగ్ర చర్చ అనంతరం ఓటింగుకు పెడతారు. ఈ ఓటింగులో ఓడిపోయినట్లయితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది.

బిల్లులు, ఆర్డినెన్సులు...

ఏదైనా ఒక బిల్లు ప్రవేశపెట్టే ముందు ప్రభుత్వం ఆ మేరకు ముందస్తుగా నోటీసివ్వాలి. దానితో పాటు బిల్లు ప్రతిని జత చేయాలి. బిల్లును గెజిట్లో ప్రకటించాలి. చర్చ అనంతరం అవసరమైతే సెలెక్టు కమిటీకి పంపుతారు. దానిపై అభిప్రాయ సేకరణ చేస్తారు. సెలెక్టు కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత బిల్లును పరిగణనలోకి తీసుకోవాలి. తర్వాత సభాపతి అనుమతించిన మేరకు సవరణలు ప్రతిపాదించవచ్చు. చర్చ అనంతరం సభ బిల్లును ఆమోదిస్తుంది. తర్వాత గవర్నరు ఆమోదం కోసం పంపుతారు. ఆయన దానిని వెంటనే ఆమోదించవచ్చు, లేదా పునఃపరిశీలనకు పంపవచ్చు. గవర్నరు ఆమోదానంతరం బిల్లు చట్టంగా మారుతుంది.

సభ సమావేశంలో లేనప్పుడు విధాన నిర్ణయాలకు సంబంధించి ప్రభుత్వం ఆర్డినెన్సులను జారీచేస్తుంది. సభ సమావేశమైనప్పుడు ఆర్డినెన్సులను ఆమోదిస్తుంది. గవర్నర్ ఆమోదం అనంతరం అప్పుడు అది చట్టం అవుతుంది. చట్టసభకు సంబంధించి స్పీకరుకు విశేషాధికారాలు ఉన్నాయి. సభలో జరిగిన చర్చలు, ఆయన తీసుకున్న నిర్ణయాలపై ఏ న్యాయస్థానం సమీక్ష చేయజాలదు. సభ సమావేశంలో ఉన్నప్పుడు సభ్యుడిని స్పీకర్ అనుమతితోనే అరెస్టు చేయాలి. సభ్యుడి అరెస్టు, విడుదల గురించి తప్పక తెలియజేయాలి.

రాజ్యాంగ సవరణ...

ఏదైనా ఒక రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంట్ ఉభయసభల్లో రెండింట మూడొంతుల మెజారిటీ అవసరం. సాధారణంగా ఏ ప్రభుత్వానికి ఇంత భారీ మెజారిటీ ఉండదు. అందువల్ల రాజ్యాంగ సవరణ వంటి కీలక విషయాల్లో ప్రభుత్వానికి విపక్ష మద్దతు అవసరం. ఒక్కోసారి అధికార, విపక్షం కలిసినా మెజారిటీ చాలదు. అలాంటప్పుడు చిన్నాచితక ఇతర విపక్షాల మద్దతు కూడా పొందాల్సి ఉంటుంది. ప్రస్తుత(2010) మహిళా బిల్లే ఇందుకు నిదర్శనం. ఈ బిల్లు ఆమోదానికి అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ బలం చాలదు. వామపక్షాలు, ఎఐఏడీఎంకే, బిజూ జనతాదళ్, రాష్ట్రీయ లోక్ దళ్, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం వంటి పార్టీల మద్దతు కూడా అవసరం. అందువల్లే అధికార కాంగ్రెస్ వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved