23 జులై, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

నిత్య "శోభితం" మన ద్రవ్యోల్బణం!

By , సంచారి

2010 ఫిబ్రవరి 20తో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం 17.87 శాతానికి చేరుకుంది. అంతకు మునుపటి వారం ఇది 17.58 శాతంగా ఉంది. అంటే వారం రోజుల్లో ఇది 0.29శాతం పెరిగింది.ఆహార పధార్థాల ధరల పెరుగుదల "శాతం" స్వలంగానే కన్పించినా వాస్తవానికి అది సామాన్యుల నిత్యావసరాలపైఅశనిపాతం. ఈ పెరుగుదల వలన బియ్యం ధర 10%, గోధుమల ధర 10%, పప్పుధాన్యాల ధర 35%, బంగాళ దుంపల ధర 28%గత సంవత్సరం ఇదే వారంతో పోలిస్తే అధికం అయ్యాయి. నిత్యావసరాల ధరలు ఇంత పెరుగుతున్నా దీని విషయంలో కేంద్ర ప్రభుత్వం తగిన చొరవ చూపడం లేదు. పైగా భారాన్ని అంతటినీ రాష్ట్రప్రభుత్వం పైకి తోసివేస్తూ వుంది. ప్రభుత్వాల ఈ బాధ్యతారాహిత్యం ప్రజల జీవితాలను దినదినగండం-నూరేళ్ళాయుషుగా మార్చివేసింది.

రెండు రకాల సూచికలు

అయితే గత కొద్ది మాసాల క్రితం వరకు మనం ధరలకు సంబంధించిన ద్రవ్యోల్బణం విషయంలో విన్న గణాంకాలు వేరు. అప్పుడవి "ప్రతిదవ్యోల్బణాన్ని"(Deflation) సూచించాయి. మరి నేడు ఈ స్థాయిలో నిత్యావసరాల ద్రవ్యోల్బణం ఎందుకు కనబడుతోంది? కారణం ఒక్కటే. అది మనం ఏ సూచి లేదా ఇండెక్స్ ప్రకారంగా ఈ ధరలను చూస్తున్నామనేది.గతకొద్ది నెలలవరకు మన మీడియాలో అధికంగా కనపడిందీ వినపడిందీ - ఈ ఆహార ద్రవ్యోల్బణం సంఖ్యలు కాదు.

వాస్తవానికి నిత్యావసరాలకు సంబంధించిన ద్రవ్యోల్బణాన్ని రెండు రకాల సూచీలతో అంచనా వేయవచ్చును. వాటిలో ఒకటి టోకు ధరల సూచి (Wholesale Index). రెండవది చిల్లర ధరల సూచి (Retail Index). టోకు ధరల సూచి అనేది ఒక సగటు రీటేయిల్ కొనుగోలుదారుకు (వినియోగదారునికి) సరుకు చేరే సమయానికి కలిసే మధ్యదళారుల మార్జిన్లను పరిగణనలోకి తీసుకోదు.రిటేయిల్ ధరల సూచి మాత్రం వీటినికూడా పరిగణలలోనికి తీసుకుంటుంది.అలాగే, ఈ రెండు సూచీలకు మరో తేడా కూడా ఉంది. టోకు ధరల సూచి అనేది దేశంలోని అత్యధిక శాతం సామాన్యుల ప్రధాన కొనుగోళ్ళ ప్రాతిపధికన నిర్ణయించబడదు.రిటైల్ లేదా చిల్లర ధరల సూచి మాత్రం వీరు కొనుగోలు చేసే నిత్యావసరాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి ద్రవ్యోల్బణాన్ని నిర్ణయిస్తుంది.

ఫలితంగా నేటి మన దేశ టోకు ధరల సూచీలో 64% మేర వెయిటేజ్ (వాటా /ప్రాధాన్యం ) పారిశ్రామిక సరుకులదే. దీనిలో ఆహర సరుకుల వెయిటేజి కేవలం 20-22% మాత్రమే. అందుచేత మన దేశం ద్రవ్యోల్బణం అంచనాకు వినియోగుస్తున్న ప్రధాన సూచీ అయిన టోకు ధరల సూచి దేశంలో నిజ ద్రవ్యోల్బణాన్ని సూచించడం లేదు. కాబట్టే కొద్ది నెలల క్రితం వరకుగోచరించిన "ప్రతిద్రవ్యోల్బణం" అనేది కేవలం మిధ్య మాత్రమే.

ధరల పెరుగుదల ఎందుకంటే

నిజానికి గతంలో ప్రతిద్రవ్యోల్బణం స్థితిలో కూడా సామాన్యుడు వినియోగించే నిత్యావసరాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి.రెండు దశాబ్దాల నయా ఉదార వాద సంస్కరణల నేపథ్యంలో మన దేశంలో మానవీయ రంగం దారుణంగా దెబ్బతిన్నది. 2003 - 04 నాటికే 40% మంది రైతాంగం వ్యవసాయం చేయడం దండగ అనుకునే (జాతీయ నమూనా సర్వే) స్థితికి వచ్చారు. 2007-08 నాటికి దేశ వ్యాప్తంగా 1,90,000 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అధిక రుణభారం వంటి పలు సమస్యలు ఈ ఆత్మహత్యలకు మూలం. దీనితో వ్యవసాయం గిట్టుబాటుకాక దేశ జనాభాలోని సుమారు 60%మంది శ్రామిక ప్రజల ఆదాయాలు పడిపోయాయి.

ఇక మరోప్రక్కన ఆహార ధాన్యాల పంటలకు ప్రత్యామ్నాయంగా వ్యాపించిన వాణిజ్య పంటల సంస్కృతితోఆహార ధ్యాన్యాల క్రిందన సాగుబడిలో ఉన్న భూమి నిష్పత్తి బాగా తగ్గిపోయింది.2008 సెప్టెంబరు సంక్షోభంతో వాణిజ్యపంటల ఎగుమతులకు ప్రధాన లక్ష్యాలు అయిన అమెరికా యూరప్పులలో ప్రజల కొనుగోలు శక్తి (సంక్షోభం నేపద్థ్యంలో) భారీగా దెబ్బతింది . దీనితోవాణిజ్యపంటల పరిస్థితి కూడా దిగజారింది.ఏదేమైతేనేం, నేటికి వ్యవసాయం "సాయం" కావాలని అర్ధించే స్థితికి దిగజార్చబడింది.

పర్యావరణ సమస్యలు కూడా దీనికి వచ్చిచేరాయి. గత సంవత్సరం (2009)లో అనావృష్టివలన దేశంలో వ్యవసాయ ఉత్పత్తి మరింత దిగజారింది. 2009లో ఆహార ధ్యాన్యాల ఉత్పత్తి 0.2 శాతంలో ఉంది. ఆహార గింజలను కూడా వ్యాపారంగా (స్పెక్యులేషన్ గా) మార్చిన ఫ్యూచర్స్ ట్రేడింగ్ వంటివి పరిస్థితిని మరింత దారుణంగా దిగజార్చాయి. ఇక నల్లబజారు ఎప్పుడూ కాచుకునే ఉంది.వ్యవసాయ రంగం దెబ్బతినడం ఆహార సరుకుల విషయంలో స్పెక్యులేషన్ (షేర్ మార్కెట్ జూదం) నల్లబజారుల వలన కొంత నిజకొరత మరింత కృత్రిమ కొరత ఏర్పడి ఆహార పదార్హాల ధరలు మాత్రం మాంద్యంలో కూడా పెరగ సాగాయి. ఫలితమే కొద్దినెలల క్రిందటి - ప్రతిద్రవ్యోల్బణంలో కుడా -ఆహార పదార్థాల ధరలు పెరుగుతూనే వున్నాయి.

దేశ ప్రజలలోని అత్యధికులు పారిశ్రామిక ఉత్పత్తులను కొనుగోలు చేయగల స్థితిలో లేరు. అర్జున్ సేన్ గుప్తా కమిటీ నివేదిక ప్రకారం రోజుకు 20 రూపాయల లోపు ఆదాయంతో 77% మంది జీవిస్తున్న మన దేశంలో ఎవరైన ఇంతకంటే ఏమి ఆశించగలం!నిజానికి మన దేశంలో 2008 మాంధ్యం నేపథ్యంలోజరిగిన పరిణామం -పారిశ్రామిక కోనుగోళ్ళ స్థాయి తగ్గిపోవడం.ఆహార డిమాండ్‌ను ప్రజలు ఒక పరిమితి మించి కుదించుకోలేరు అనేది నిజం. దీనితో ఆ సరుకుల విషయంలో డిమాండ్ లో పెద్దగా తేడా రాదు. అందుచేత కొనుగోలు శక్తి దెబ్బతిన్న ప్రజలు పారిశ్రామిక సరుకుల కొనుగోళ్ళను తగ్గించుకోగలిగారు. వాటిడిమాండ్ పడిపోయింది. ఫలితంగా ఆ సరుకుల ధరలు తగ్గిపోయాయి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఆఫర్లు పెరిగాయి కుడా! మన దేశంలోని అత్యధికుల కొనుగోళ్ళుదరిదాపుగా ఆహార పదార్థాలకే పరిమితం అయ్యాయి. వాటి ధరలు మాత్రం పెరుగుతూనే పోయాయి.

ప్రభుత్వ విధానల లోపం వలన ఆ పెరుగుదల నేటికీ కొనసాగుతోంది.నిత్యావసరాల (ఆహార పదార్ధాల) ధరలు నింగినంటుతున్నాయి. ఈ దుస్థితినిఫిబ్రవరి 20, 2010 నాటి ఆహార ద్రవ్యోల్బణ స్థాయి అయిన 17.87 శాతం సూచిస్తుంది.నిర్లిప్తంగా వ్యవహరిస్తోన్న పాలకులు ప్రజలకి ఉచిత సలహాలను ఇస్తున్నారు. పంచదార ధరలు పెరిగాయని ప్రజలు నిలదీస్తే తినడం మానేయండి పంచదార వలన చెక్కెర వ్యాధి వస్తుందని కేంద్ర అమాత్యులే మాట్లాడటం దీనికి చిన్న ఉదాహరణ.

ఫిబ్రవరి 26న ప్రవేశ పెట్టిన 2010కేంద్ర బడ్జెట్ లోని అనాలోచిత విధానాల వలన ఆహార ధరలు మరింత పెరిగే అవకాశాలే నేడు మెండు. ఈ నేపథ్యంలో మన దేశ జనాభాలోని 77% ప్రజల నిజ ఆదాయం గత అంచనాల స్థాయి అయిన రోజువారి 20రూపాయలుగా మిగలడం కూడా గగనమే. కుదేలైన కొనుగోలు శక్తితో కటకట పడే సామాన్యుడు పాలకులను కుదేలు చేసే స్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved