19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఈశాన్యంపై ఏదీ శ్రద్ధ

దేశంలో ఒక మూలన విసిరేసినట్లు ఉండే, నిర్లక్ష్యానికి గురైన ఈశాన్య ప్రాంతం అభివృద్ధి పట్ల కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు విమర్శిస్తున్నారు. నిధుల పంపిణీలో అసమానతలు, ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం ఈశాన్యరాష్ట్రాలు ఎదుర్కొంటున్న మరో సమస్య.

ఈశాన్య రాష్ట్రాల కౌన్సిల్ సమావేశం

ఈశాన్య భారతం - అత్యంత కీలకమైన, సున్నితమైన దేశ సరిహద్దులో ఉన్నప్రాంతం. 'సెవన్ సిస్టర్స్' అంటూ ఏడు రాష్ట్రలుగా పాలించబడుతున్న ఈ ప్రాంతఅభివృద్ధి పట్ల ఆది నుంచి కేంద్రం అలసత్వాన్నే ప్రదర్శిస్తోంది. అరకొర కేటాయింపులు, కేటాయింపుల మేరకు నిధులు విడుదల చేయకపోవడం, ఆ నిధుల విడుదలలో కూడా అపరిమిత జాప్యం, రాజకీయ నాయకత్వం అశ్రద్ధ ఫలితంగా ఈ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. ఈ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు అనేకమార్లు ఈ విషయమై వ్యక్తం చేసిన ఆవేదన కేంద్ర పాలకులను కదలించలేకపోయింది. స్వయంగా 2004 నుంచి ప్రధానమంత్రి ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా తమకు కనీస మేలు జరగడం లేదని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మౌలిక వసతులైన రహదారులు, తాగునీరు, విద్యుత్, విద్య రంగాల్లో ఈశాన్యరాష్ట్రాలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయి. జనజీవన స్రవంతికి దూరంగా ఉన్న ఈ ప్రాంతం పట్ల అలక్ష్యం వహించడంపై 2010 ఫిబ్రవరి 10న జరిగిన 58వ ఈశాన్య రాష్ట్రాల మండలి సమావేశంలో ముఖ్యమంత్రులు కేంద్రంపై ధ్వజమెత్తారు.

సమావేశంలో ప్రసంగించిన నాగాలాండ్, అసోం, మేఘాలయ, త్రిపుర ముఖ్యంత్రులు నెఫియో రియో, తరుణ్ గగోయ్, డి.డి.లపాంగ్, మాణిక్ సర్కార్ తదితరులు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నిధులు కేటాయించాలని, కేటాయించిన నిధుల్లో కోత పెట్టకుండా సకాలంలో విడుదల చేయాలని అభ్యర్థించారు. ఈశాన్య ప్రాంత ప్రణాళికా వ్యయం రూ.1002 కోట్లు ఏ మూలకు చాలవని, ఈ మొత్తాన్ని కనీసం రూ.2000 కోట్లకు పెంచాలని, ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రత్యేకంగా రూ.1500 కోట్లు కేటాయించాలని కోరారు. లక్ష్యాలు సాధించేందుకు ప్రస్తుత కేటాయింపులు చాలవని పేర్కొన్నారు. 11వ పంచవర్ష ప్రణాళిక(2007-2012)లో నిర్దేశించిన రూ.7,394 కోట్లకు గాను తొలి మూడేళ్లలో కేవలం రూ.1848 కోట్లే కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల అనుసంధానం, ప్రత్యేక వ్యవసాయ విధానం రూపకల్పన, వ్యవసాయదారులకు గిట్టుబాటు ధరలు, విద్యారంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం తదితర అంశాలపై దృష్టి సారించాలని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ అభ్యర్థించారు.

రాష్ట్రాల వాటాలలోనూ అసమానత

నిధుల పంపిణీలో అసమానతలు, ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం ఈశాన్యరాష్ట్రాలు ఎదుర్కొంటున్న మరో సమస్య. ప్రస్తు త కేటాయింపుల విధానం సక్రమంగా లేదన్న అభిప్రాయం ఉంది. ఎనిమిదో, తొమ్మిదో పంచవర్ష ప్రణాళికల్లో మొత్తం ప్రణాళిక వ్యయంలో నాగాలండ్ కేవలం 3 శాతం నిధులు మాత్రమే పొందడం గమనార్హం. దీన్నిబట్టి అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నెఫియో రియో సమావేశలో ఎత్తిచూపారు. నిధుల పంపిణీలో సమానత్వంపై ఏకాభిప్రాయం సాధించాలని 2002 నుంచి ప్రయత్నిస్తున్నా ఇప్పటికి సాధ్యపడలేదని మేఘాలయ ముఖ్యమంత్రి డి.డి.లపాంగ్ ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో నిధులు విడుదల చేయాలని కూడా ఆయన కోరారు. నిధుల్లో ఒక్కో రాష్ట్రానికి 10 శాతం వంతున కేటాయించాలని మిగిలిన 20 శాతం నిధులను అన్ని రాష్ట్రల ఉమ్మడి ప్రయోజనాలకు వ్యయం చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఈ డిమాండును కేంద్ర నాయకత్వం పట్టించుకోలేదు.

2010 బడ్జట్

ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభ్యర్థనను దృష్టిలో పెట్టుకునే కావచ్చు ఆర్థిక మంత్రి ప్రణబ్ ఈసారి బడ్జెట్లో ఆ ప్రాంతానికి నిధుల కేటాయింపులో కొంత ఉదారంగా వ్యవహరించారు. ఈ ప్రాంత అభివృద్ధికి రూ.1760 కోట్లు కేటాయించారు. గత ఏడాది కేటాయింపుల కంటే ఇది 19 శాతం అధికం. ఈశాన్య రాష్ట్రాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఉద్దేశించిన వివిధ పథకాలకు రూ.623 కోట్లు కేటాయించారు. ప్రధాన రహదారుల నిర్మాణం, అభివృద్ధికి రూ.5 కోట్లను కేటాయించారు. ఇవి కూడా అవసరాలను పూర్తిగా తీర్చలేవు. నిధుల కేటాయింపు, సకాలంలో అవి విడుదల, ఆయా రాష్ట్రాల మధ్య సమానంగా పంపిణీ చేయడం తదితర అంశాలపై కేంద్రం దృష్టి పెట్టాల్సి ఉంది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved