23 జులై, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

కాంగ్రెస్ మిత్రభేదం!

By జి, శివ కుమార్

సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ పరిస్థితి పైకి కనపడినంత సజావుగా లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలు, ప్రభుత్వానికి నాయకత్వం వహించే కాంగ్రెస్ మధ్య సంబంధాలు రోజురోజుకు క్షీణిస్తున్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. బహిరంగంగా బయటపడనప్పటికి కాంగ్రెస్ తీరుపై మిత్రపక్షాలు లోలోపల కారాలు మిరియాలు నూరుతున్నాయి. తమను ఏదో విధంగా ప్రభుత్వం నుంచి బయటకు పంపి తమ రాష్ట్రాల్లోని ప్రత్యర్థులతో జత కట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు అవి ఆరోపిస్తున్నాయి. వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్లు ఆయా పార్టీలు అనుమానిస్తున్నాయి. తమను బయటకు పంపి తమ ప్రత్యర్థి పార్టీలను అక్కున చేర్చుకునేందుకు, రాష్ట్రాల్లో తమ పునాదులను, అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ తెరవెనుక పావులు కదుపుతున్నట్లు అవి ఆక్రోశిస్తున్నాయి. మరోవైపు సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీలు తోక జాడించినా ప్రభుత్వం పడిపోకుండా కాంగ్రెస్ ముఖ్యులు కసరత్తు చేస్తున్నారు.

యుపిఎ -2 : మారిన వైఖరి

తాజాగా జరిగిన కొన్ని సంఘటనలు యూపీఏ ప్రభుత్వంలోని లుకలుకలు తెలియజేస్తున్నాయి. తమిళనాడులోని డీఎంకే, పశ్చిమబెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్, మహారాష్ట్రలోని ఎన్సీపీతో కాంగ్రెస్ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అంతర్గతంగా అనిశ్ఛిత పరిస్థితులు నెలకొన్నాయి. సంకీర్ణంలోని పెద్దపార్టీల పరిస్థితే ఇలా ఉంటే ఇక తమ పరిస్థితేమిటని చిన్న పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. యూపీఏ ప్రభుత్వ తొలి పాలనకు, ఇప్పటి పాలనకు పూర్తి తేడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. యూపీఏ తొలి ప్రభుత్వంలో కాంగ్రెస్ బలం పరిమితమే. కేవలం 145 స్థానాలు గల కాంగ్రెస్ మిత్రులతో ఆచితూచి వ్యవహరించేది. మిత్రుల మాటలకు విలువనిచ్చేది, వాటి అభిప్రాయాలను, కోరికలను గౌరవించేది. 2009 ఎన్నికల్లో మిత్రుల బలం తగ్గింది. దీనికితోడు సొంతంగా 200 పైగా స్థానాలు సాధించడంతో కాంగ్రెస్ వైఖరిలో గణనీయమైన మార్పు వచ్చింది. ఇదే అదనుగా ఆయా రాష్ట్రాల్లో మిత్రపక్షాలను బలహీనపరచి, తాను బలోపేతమయ్యేందుకు కృషి చేస్తున్నది. సోనియా తనయుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. అందువల్లే మిత్రులతో కాంగ్రెస్ కు పొరపొచ్చాలు ఏర్పడుతున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వ మనుగడ, అస్థిత్వం ప్రశ్నార్థకం కాగలదని చెబుతున్నారు.

తార్కాణాలు

మరాటా దిగ్గజం, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ మధ్య గత కొన్నిరోజులుగా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ధరల పెరుగుదలకు ముఖ్యంగా చక్కెర ధరల పెరుగుదలకు వ్యవసాయంతో పాటు పౌరసరఫరాల శాఖకు సారథ్యం వహిస్తున్నశరద్ పవారే బాధ్యత వహించాలన్నట్లుగా పరోక్షంగా కాంగ్రెస్ వర్గాలు ప్రకటనలు చేశాయి. ఈ ప్రకటనలు పవార్ కు చిర్రెత్తించాయి. ధరలను నియంత్రించేందుకు సంబంధిత శాఖ మంత్రిగా తన పరిధిలో చేయాల్సిందంతా చేస్తున్నానని ఈ విషయం తెలసినప్పటికి కావాలనే కాంగ్రెస్ శ్రేణులు తనను ఇరుకున పెట్టేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాయని పవార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెరుగుదలకు తానొక్కడినే కాకుండా మొత్తం ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన అంటున్నారు. ఈ విషయంలో విపక్షాలు కూడా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాయి. ఇక మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చి, రాజకీయంగా తనను నిర్వీర్యం చేసేందుకు తెరవెనుక కొందరు ప్రయత్నిస్తున్నట్లు ఆయన అనుమానిస్తున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపిణీ, మంత్రి పదవుల పంపిణీ తదితర వ్యవహారాల్లో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎన్సీపీ పాత్రను పరిమితం చేసిందని అంతరంగిక సంభాషణల్లో వెల్లడిస్తున్నారు.

మమత పై తగ్గిన మమత

ఇక బెంగాల్ బెబ్బులి మమతా బెనర్జీది మరో కథ. తృణమూల్ కాంగ్రెస్ సారధి, రైల్వే శాఖ మంత్రి అయిన మమత ఆశలన్నీ వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపైనే. 2009 లోక్ సభ ఎన్నికల్లో 19 సీట్లను గెలుచుకున్న మమత మరింత ఉత్సాహంగా ఉన్నారు. రాష్ట్రంలో వామపక్షాల బలం క్రమంగా క్షీణిస్తున్నదని వారిని దెబ్బతీయడానికి ఇదే సరైన సమయం అని ఆమె భావిస్తున్నారు. అయితే సీపీఎంను ఎదుర్కొనేందుకు సొంతబలం చాలదని, కాంగ్రెస్ మద్దతు అవసరమని ఆమెకు తెలుసు. ఈ ఉద్దేశంతోనే కాంగ్రెస్ తో సఖ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా కాంగ్రెస్ మాత్రం ఉద్దేశపూర్వకంగా, కావాలనే దూరంగా ఉండటం మమతను అసహనానికి గురి చేస్తున్నది. బెంగాల్లో మమత గెలవడం కన్నా వామపక్షాలు విజయం సాధించడమే దీర్ఘకాలంలో తమకు మేలని కాంగ్రెస్ వ్యూహకర్తలు భావిస్తున్నారు. చపలచిత్తం గల మమత బెంగాల్లో పట్టు సాధిస్తే భవిష్యత్తులో తమకు పక్కలో బల్లెం కాగలదని, రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్వీర్యం అవుతుందని వారి ఆందోళన. మమత కన్నా వామపక్షాలే తక్కువ ప్రమాదకారన్నది కాంగ్రెస్ అధిష్టానం భావన. ఈ నేపథ్యంలో వామపక్షాలు మళ్లీ అధికారంలోకి రావాలంటే మమతకు బ్రేకులు వేయాలన్నది అధిష్టానం అంతరంగం. ఇటీవల రైల్వేబడ్జెట్ సమర్పణకు ముందు జరిగిన అంతరంగిక సమావేశంలో బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు, ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ మమతపై విరుచుకుపడ్డారు. రైల్వే పథకాలన్నీ బెంగాల్ కు కేటాయించడం ద్వారా క్రెడిట్ అంతా తానే కొట్టేయాలని చూస్తున్నారని, రాష్ట్రానికి కాంగ్రెస్ ఏమీ చేయడం లేదన్న బావనను ప్రజల్లో కలిగించేందుకు మమత ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో సోనియాగాంధీ, ప్రధాని, సీనియర్ మంత్రులు ఉన్నా వారెవరూ తనకు మద్దతుగా నిలబడకపోవడం మమతను ఆవేదనకు గురిచేసింది. మరోపక్క మమత దూరమైతే యూపీఏ ప్రభుత్వాన్ని ఆదుకునేందుకు వామపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ కారణంగానే కాంగ్రెస్ దుందుడుకుగా వ్యవహరిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.

తమిళనాట

ఇక తమిళనాడుది మరో కథ. ఇక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీని పటిష్టరిచే మిషతో తరచూ ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించడం ముఖ్యమంత్రి కరుణానిధికి మింగుడుపడటం లేదు. ఇటీవల ఎన్నికల సంఘం వజ్రోత్సవాల్లో పాల్గొనేందుకు నూఢిల్లీ వెళ్లిన అన్నాడీఎంకే అధినేత జయలలిత యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీని కలిశారన్న వార్త, కాంగ్రెస్ తో జత కట్టేందుకు సిద్ధమన్న సంకేతాలు జయ నుంచి వెళ్లడం తదితర సంఘటనలు డీఎంకే వర్గాల్లో గుబులు పుట్టించింది. డీఎంకేకు 18మంది ఎంపీలున్నారు. తరచూ మంత్రిపదవులు, శాఖల పేరుతో పేచీలకు దిగుతున్న డీఎంకేను వదిలించుకోవడమే మేలన్నది రాహుల్ అభిప్రాయం. నిన్నమొన్నటి దాకా శ్రీలంక తమిళుల సమస్యపై కేంద్రాన్ని చికాకు పరిచిందన్నది ఆ పార్టీపై మరో అభియోగం. డీఎంకే, కాంగ్రెస్ మైత్రి కొనసాగుతుందని పీసీసీ అధ్యక్షుడు కె.వి.తంగబాలు, డీఎంకే అధినేత కరుణానిధి ప్రకటించినప్పటికి చివరిదాకా వారు ఆ ప్రకటనకు కట్టుబడి ఉంటారన్న నమ్మకం లేదు.

ఎన్సీపీ, తృణమూల్, డీఎంకేతో పాటు సంకీర్ణంలోని చిన్నపక్షాలు కూడా ఇదే ఆందోళనతో ఉన్నాయి. అవసరమైతే ప్రభుత్వాన్ని ఆదుకునేందుకు వామపక్షాలు, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ ముందుకు వచ్చారని ఆ దన్నుతోనే కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తమ్మీద మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పరిస్థితి అందరూ అనుకున్నంత సజావుగా మాత్రం ఏమీ లేదు. ఆకస్మికంగా రాజకీయ సంక్షోభం, ఉత్పాతం తలెత్తే అవకాశం లేకపోలేదు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved