19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం: మద్రాసు ప్రెసిడెన్సీ నుండి విశాలాంధ్ర దాకా

మద్రాసు ప్రెసిడెన్సీలో 40 శాతం జనసంఖ్య, 58 శాతం రాష్ట్ర విస్తీర్ణం తెలుగు వారిదే. రాష్ట్ర రాజకీయాలలో తమకు పలుకుబడి లేదని, తమిళులచేత అవహేళనకు గురౌతున్నామన్న భావన తెలుగువారిలో మెదలైంది. 1911 ఏప్రిల్ నెలలో "హిందూ" పత్రికలో ఒక రచయిత "తెలుగు ప్రజల ప్రస్తుత పరిస్థితి " అన్న విషయంపై వ్యాసాలు రాశారు. ఉద్యోగాలలో మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారికి జరుగుతున్న అన్యాయాన్ని గణాంకాలతో వివరించారు. తెలుగువారి వెనుకుబాటు తనాన్ని కూడా చర్చించారు. అప్పుడే "దేశాభిమాని" అనే పత్రిక (తెలుగు/ఇంగ్లీషు) తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి, సమైక్యతకు ఒక రాజకీయ సమ్మేళనం ఏర్పాటు కావాలని తన సంపాదకీయంలో పేర్కొంది. ఈ విధంగా ఆనాటి వార్తా పత్రికల వ్యాసాల ద్వారా, సంపాదకీయం ద్వారా తెలుగు ప్రజలలో ప్రత్యేక రాష్ట్ర వాంఛ మొదలైంది.

1911 చివరినాటికి ప్రత్యేక రాష్ట్ర చర్చ ఊపందుకుంది. ఆంధ్ర పత్రిక, కృష్ణా పత్రిక, ప్రత్యేక ఆంధ్ర స్టేట్ కోరికను బలపరిచాయి. తమిళులలో మాత్రం ఈ ప్రతిపాదనకు వ్యతిరేకత వ్యక్తమైయ్యింది. "హిందూ" వార్తాపత్రిక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర నిర్మాణాన్ని వ్యతిరేకించింది. పట్టాభి సీతారామయ్య మాత్రం ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా, దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని సూచించారు.

పొట్టి శ్రీరాములు అక్టోబరు 19, 1952లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్‌తో మద్రాసులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. 50రోజుల నిరహార దీక్ష తరువాత, మద్రాసును వదులుకొంటే ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం సాధ్యపడుతుందని ప్రధాని నెహ్రూ ప్రకటించారు. పొట్టీ శ్రీరాములు అందుకు అంగీకరించకుండా తన నిరాహార దీక్షను కొనసాగించి డిసెంబర్ 15వ తేదీన ఆత్మార్పణ చేసుకొన్నారు. ఆయన ఆత్మార్పణ తరువాత ఆంధ్ర ప్రాంత జిల్లాల్లో పెద్దయెత్తున హింసా కాండ చెలరేగింది. మద్రాసు నగరాన్ని మినహాయించి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రధాని నెహ్రూ లోక్‌సభలో ప్రకటించారు. ఆర్థికపరమైన, పాలనా పరమైన విషయాలను దృష్టిలో ఉంచుకొని విభజన ప్రక్రియలో అవసరమైన సిఫారసులు చేయడానికి జస్టిస్ కైలాసనాథ్ వాంచూ ను ప్రత్యేకాధికారిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. వాంచూ నివేదిక ప్రకారంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును 1953 మార్చి 25న నెహ్రూ ప్రకటించారు.

తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒకే రాష్ట్రంగా ఏర్పడాలనే అభిప్రాయాలు ఆంధ్రరాష్ట్ర ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి వినబడుతుండేది. 1938 లో ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య, సమైక్య తెలుగు రాష్ట్రం ఏర్పడే అవకాశాల గురించి మాట్లాడారు. 1940లో, 1942లో ఆంధ్ర నాయకులు సమైక్య తెలుగు రాష్ట్రం గురించి తమ ఆశాభావాలను వ్యక్తం చేశారు. హైదరాబాద్ సంస్థానం విమోచన తర్వాత సమైక్య తెలుగు రాష్ట్రం ఏర్పాటుకు అవకాశాలు పెరిగాయి. 1949 లో అయ్యదేవర కాళేశ్వరరావు విశాలాంధ్ర మహాసభ ఏర్పాటు చేశారు. 1951 లో కూడా కాంగ్రెస్ అఖిల భారత సమావేశాలలో ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు విశాలాంధ్ర విషయాన్ని ప్రస్తావించారు.

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతో రాయలసీమ శాసనసభ్యులు రాజధాని విషయంలో శ్రీబాగ్ ఒడంబడిక ను పాటించాలని కోరారు. ఆచార్య రంగా నాయకత్వంలోని కృషిక్ లోక్‌పార్టీ తిరుపతిని ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా చేయాలని కోరారు. కమ్యూనిష్టులు విజయవాడను రాజధానిగా చేయాలని కోరారు. చివరకు కర్నూలును ఆంధ్ర రాష్ట్ర తాత్కాలిక రాజధానిగా అందరూ ఒప్పుకున్నారు.

హైదరాబాద్ రాష్ట్రాన్ని తెలుగు, కన్నడ, మరాఠీ ప్రాంతాలుగా విడగొట్టాలన్న విషయంలో ప్రజలలోగాని, నాయకులలోగాని ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. కన్నడ ప్రాంతాలను మైసూర్ రాష్ట్రంలోను, మరాఠీ ప్రాంతాలను బొంబాయి రాష్ట్రంలోను(నేటి మహారాష్ట్రలో) విలీనం చేయాలని అందరూ ఒప్పుకున్నారు. కాని తెలంగాణా ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంతో కలిపి విశాలాంధ్ర రాష్ట్రంగా ఏర్పడాలనే విషయంలో తెలంగాణా ప్రజలలో అనుమానాలు, భయాందోళనలు వ్యక్తమయ్యాయి.

ఫజల్ ఆలీ కమీషన్ ( ఎస్.ఆర్.సి ) కూడా హైదరాబాద్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణను సమర్ధించింది. కన్నడ, మరాఠీ ప్రాంతాలను పొరుగు రాష్ట్రాలలో విలీనం చేయాలని కూడా సూచించింది. అయితే తెలంగాణా ప్రాంతం విషయంలో మాత్రం తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలని సూచించింది. ఈ కమీషన్ విశ్లేషించిన కొన్ని ముఖ్యమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాలి.

నేరుగా బ్రిటిష్ పరిపాలనలో ఉంటూ వచ్చిన ప్రాంతానికి ( బ్రిటిష్ ఇండియా ) , బ్రిటిష్ సార్వభౌమాధికారానికి లోబడి స్వతంత్ర ప్రతిపత్తిలో ఉన్న సంస్థానాలకు మధ్య చారిత్రకంగా ఏర్పడిన ఆర్ధిక, సామాజిక, విద్యాపరమైన అసమానతలు, వ్యత్యాసాలు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను కష్టతరం చేశాయి. మౌలిక సదుపాయాలైన విద్యా, ఆరోగ్యం, నీటిపారుదల, పరిశ్రమలు, రవాణా వంటి రంగాలలో సంస్థానాలు- బ్రిటిష్ ఇండియా కంటే వెనుకబడి వున్నాయి. సంస్థానాధీశులు పన్నుల రూపంలో ప్రజలపై ఎక్కువ భారాన్ని మోపేవారు. ఒకవైపు ఎటువంటి అభివృద్ధికీ నోచుకోకుండా, ఇంకొకవైపు అధిక మొత్తంలో పన్నులు చెల్లిస్తూ సంస్థానాలలోని ప్రజలు కృంగి, కృశించిపోతూ వచ్చారు. నేరుగా బ్రిటిష్ వారిచే పాలించబడిన ప్రాంతాలను, నిజాం పాలనలో సంస్థానానికి ప్రత్యక్షంగా, బ్రిటిష్ వారికి పరోక్షంగా అధిక మొత్తంలో పన్నులు చెల్లిస్తూ ఎటువంటి అభివృద్ధికీ నోచుకోని వెనుకబడిన సంస్థానాలను కలిపి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయడంవల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను ఫజల్ ఆలీ కమీషన్ తన నివేదికలో విశ్లేషించింది.

తెలంగాణా ప్రాంతంలో వ్యవసాయం ముఖ్యంగా వర్షాధారం. కాకతీయులు నిర్మించిన చెరువులే - నీటిపారుదల వ్యవస్థ. ఆ తర్వాత 20 వ శతాబ్దంలో నిర్మించిన నిజాంసాగర్, మూసీ వంటి కొన్ని నిర్మాణాలు మినహా వ్యవసాయ రంగం పూర్తిగా వర్షాధారంగా సాగుతూ వచ్చింది. కృష్ణా, గోదావరీ నదులు ఈ ప్రాంతం నుండి ప్రవహిస్తున్నా మెట్ట పంటలే ఈప్రాంత ప్రజలకు జీవనాధారం.

ఆంధ్ర ప్రాంతంలో నీటిపారుదల వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. 1841 లోనే ధవళేశ్వరం వద్ద గోదావరిపై ఆనకట్ట నిర్మాణమైంది. నదీ జలాలను వ్యవసాయానికి తరలించడం వల్ల ఆంధ్ర ప్రాంతంలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. తద్వారా వ్యవసాయ రంగంలో మిగులుబడి పెరిగింది. ఈ ఆర్ధిక మిగులుబడి పరిశ్రమలకు పెట్టుబడిగా మారింది. ఎన్నో పరిశ్రమలు అభివృద్ధి చెందాయి.

ఆర్ధికంగా, సామాజికంగా ఇంత తేడావున్న ఈ రెండు ప్రాంతాలను ఒకే రాష్ట్రంగా పునర్వ్యవస్థీకరించడం వాంఛనీయమా అనే అనుమానాన్ని ఫజల్ ఆలీ కమిషన్ వ్యక్తం చేసింది.

ఆంధ్ర స్టేట్ వారు ఎస్.ఆర్.సి ముందు తన వాదనను వినిపిస్తూ, తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నిటినీ కలిపి - అంటే ఆంధ్ర స్టేట్, తెలంగాణా రాష్ట్రాన్ని కలిపి - భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పరచాలని వాదించింది.

ఆనాడు విశాలాంధ్ర కావాలన్న వారి వాదనలు ఈ విధంగా ఉన్నాయి.

  1. తెలుగు మాట్లాడే ప్రజలు శతాబ్దాలుగా విడదీయబడ్డారు. అందరూ ఒకటైతే తెలుగు భాషా సంస్కృతులు అభివృద్ధి చెందుతాయి.
  2. ఆంధ్ర ప్రాంతానికి రాజధాని లేకపోవడం అనే సమస్య తీరుతుంది.
  3. కృష్ణ, గోదావరి నదీ జలాలను ఉపయోగించుకోవడం సుగమమౌతుంది.

తెలంగాణా ప్రాంతం ప్రజలు, నాయకులు కూడా ఎస్.ఆర్.సి ముందు - విశాలాంధ్ర ఏర్పాటువల్ల తెలంగాణాకు జరగబోయే నష్టాలను విన్నవించుకొన్నారు. విశాలాంధ్రను వ్యతిరేకిస్తున్న వాదనలను కూడా ఎస్.ఆర్.సి తన రిపోర్ట్ లో ( పేజీ 105 ) పొందుపరిచింది.

తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగానే ఉంచాలనే వాదనలు ఈ విధంగా ఉన్నాయి.

  1. తలసరి రెవిన్యూ ఆంధ్రా కన్నా తెలంగాణాలో ఎక్కువ. విశాలాంధ్ర ఏర్పడితే తెలంగాణా నిధులు ఆంధ్రా ప్రాంతానికి తరలించబడతాయి.
  2. కృష్ణా, గోదావరి నదీ జలాలలో తెలంగాణాకు ప్రత్యేక వాటా ఉండదు.
  3. ఆర్ధికంగా, విద్యాపరంగా ముందున్న కోస్తా వారితో, వెనకబడిన తెలంగాణా వారు పోటీపడలేరు. అందువల్ల క్రమంగా నష్టపోతారు. ( Exploitation కు గురవుతారు. )

***

ఆనాడే వద్దన్న ఫజల్ ఆలీ

విశాలాంధ్ర ఏర్పడాలనే వాదనలు ఎంత సమంజసంగా ఉన్నా, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికి మద్దతుగా చేసే వాదనలు సులభంగా కొట్టివేయగలిగినవి కావు అని ఫజల్ ఆలీ కమిషన్ అభిప్రాయపడింది. ప్రస్తుత ఆంధ్ర స్టేట్ ఏర్పడినప్పటి నుండి ఆర్ధిక వనరుల కొరత ఎదుర్కొంటున్నది. అయితే తెలంగాణా మాత్రం ఆర్ధిక వనరుల విషయంలో మాత్రం ఆంధ్ర స్టేట్ కంటే మెరుగైన పరిస్థితిలో ఉంది. కారణం తలసరి రెవిన్యూ ఆదాయం ఆంధ్ర స్టేట్ కంటే తెలంగాణాలో ఎక్కువ. కాబట్టి విశాలాంధ్ర ఏర్పాటువల్ల తెలంగాణాకు జరిగే లాభం ఏమీలేకపోగా నష్టం జరిగే అవకాశాలున్నాయని భావించడం జరిగింది.

తెలంగాణా ఒక పరిపాలనా యూనిట్ గా, సుస్థిరమైన రాష్ట్రంగా మనగలుగుతుందనే విశ్వాసానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా Revenue Receipts on Current Account ( కరెంటు ఖాతాలో రెవిన్యూ ఆదాయం ) ను 17 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. కృష్ణా, గోదావరి ప్రాజక్టులను చేపట్టిన తర్వాత కూడా తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ ను మిగులుబడితో తయారు చేసుకోవచ్చుననే అభిప్రాయం ప్రబలంగా ఉంది. తెలంగాణా రాష్ట్రానికి సంక్రమించే ఆర్ధిక వనరులను పూర్తిగా వినియోగించుకొనే పక్షంలో తెలంగాణాకు ఆర్ధిక సంక్షోభం ఏర్పడే పరిస్థితులు రాకపోవచ్చనే అభిప్రాయం ఎస్.ఆర్.సి వ్యక్తం చేసింది.

తెలంగాణా ప్రజలలో విశాలాంధ్ర రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకతకు ముఖ్య కారణాలలో విద్యాపరంగా వెనకబడిన తెలంగాణా ప్రజలను, విద్యాపరంగా ముందంజలో ఉన్న ఆంధ్రా ప్రాంతం వారు Exploit చేస్తారనే భయం ప్రధానమైనది. ఆంధ్ర ప్రాంతం వారు ప్రధాన భాగస్వాములవుతారు. పలువిధాలుగా ప్రయోజనం పొందుతారు. తెలంగాణాను ఒక వలస ప్రాంతంగా(కాలనీగా ) మారుస్తారన్న ప్రజల అభిప్రాయాన్ని నివేదిక వివరించింది.

విశాలాంధ్ర ఏర్పాటుకు అనుకూలమైన వాదనలను సానుకూలంగా పరిశీలిస్తూనే రెండు ప్రాంతాల ఏకీకరణ తెలంగాణా ప్రాంత ప్రజల స్వఛ్ఛందమైన మనోభావాలకు భిన్నంగా జరగకూడదని అభిప్రాయపడింది. తెలంగాణా ప్రజల భవితవ్యాన్ని వారే నిర్ణయించుకోవాలని సూచించింది.

సమైక్య మద్రాసు రాష్ట్రం నుండి ప్రత్యేక ఆంధ్ర స్టేట్ ఏర్పడటంవల్ల సంభవించిన పరిపాలనా పరమైన ఇబ్బందుల నుండి తేరుకోక ముందే తెలంగాణా ప్రాంతంతో కలిపి సమైక్య రాష్ట్రం ఏర్పాటు చేయడం రెండు ప్రాంతాలకు పాలనాపరమైన ఇబ్బందులు కలుగుతాయని అభిప్రాయపడింది. ఒకవేళ విశాలాంధ్ర ఏర్పాటైన పక్షంలో తెలంగాణాకు కల్పించవలసిన రక్షణల గురించి కూడా పరిశీలించారు. శ్రీబాగ్ ఒడంబడిక రీతిలోగాని, బ్రిటన్ లోని స్కాటిష్ డెవల్యూషన్ ( అధికారాల పంపిణీ ) పద్ధతిలో గాని తెలంగాణాకు రక్షణలు కల్పించాలని భావించింది. ఏ ఒడంబడికనైనా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో జరిగినప్పుడే ప్రయోజనకరంగా ఉంటుందని విస్పష్టంగా సూచించింది. అయితే అటువంటి ఒప్పందాలను తెలంగాణా విషయంలో సూచించడానికి సుముఖత వ్యక్తం చేయలేదు.

అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఎస్.ఆర్.సి ఒక పరిష్కారాన్ని సూచించింది.

రెండు ప్రాంతాల శ్రేయస్సు దృష్ట్యా తెలంగాణా ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి. 1961 ప్రాంతంలో జరిగే సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడే తెలంగాణా శాసనసభ మూడింట రెండు వంతుల మెజారిటీతో నిర్ణయిస్తే రెండు రాష్ట్రాలను విలీనం చేయవచ్చు. ఈ నిర్ణయం వల్ల రాబోయే 5, 6 సంవత్సరాల కాలంలో రెండు రాష్ట్రాల ( ఆంధ్ర, హైదరాబాద్ స్టేట్ ) పరిపాలనా యంత్రాంగం స్థిరీకరించబడుతుంది. రెండు రాష్ట్రాలలోని రెవిన్యూ వ్యవస్థలో సారూప్యతను సాధించే మార్గంలో సమీక్షించుకొనే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఏకీకరణవల్ల ప్రజలలో భయాందోళనలు తొలగించి ఏకాభిప్రాయాన్ని సాధించి నిజమైన సమైక్యతను సాధించవచ్చు.

ఒకవేళ తెలంగాణా ప్రజల మనోభావాలు ( సెంటిమెంట్) రెండు రాష్ట్రాల ఏకీకరణకు వ్యతిరేకంగా వ్యక్తమైన పక్షంలో తెలంగాణా రాష్ట్రం యధావిధిగానే కొనసాగుతుంది.

అయితే ఎస్.ఆర్.సి సూచనలను ఆనాటి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పెడచెవిన పెట్టాయి.

సమైక్య రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణా ప్రజల వ్యతిరేకతను, ఎస్. ఆర్. సి నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని, ఆంధ్ర స్టేట్ ప్రభుత్వం తెలంగాణా ప్రజలను సమైక్య రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పించే దిశలో ప్రయత్నాలు ప్రారంభించింది. ఉద్యోగావకాశాల విషయంలో, సత్వర అభివృద్ధి విషయంలో తెలంగాణాకు రక్షణలు కల్పించడానికి సుముఖత వ్యక్తం చేసింది. తెలంగాణా ప్రజలకు చట్టపరమైన రక్షణలు కల్పించడానికి తనంతటతానే, ఏకపక్షంగా, ఆంధ్ర స్టేట్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు ఆంధ్ర శాసనసభ ఒక తీర్మానాన్ని కూడా 25 నవంబర్ 1955 లో ఆమోదించింది. ఈ తీర్మానాన్ని ఆనాటి ఆంధ్రా ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్‍రెడ్డి ప్రవేశపెట్టారు.

ఈ తీర్మానంలో తెలంగాణా ప్రాంత అభివృద్ధి తమ ప్రత్యేక బాధ్యత అని, తెలంగాణా ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక రక్షణలు కల్పిస్తామని ప్రకటించారు. తెలంగాణా ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరంలేదని, వారికి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో జనాభాకు తగిన రీతిలో ( On Par with Population) రిజర్వేషన్‌లు కల్పిస్తామని స్పష్టం చేశారు. అంతేకాక తెలంగాణా ప్రజలను విశాల హృదయంతో చూసుకుంటామని కూడా ప్రకటించారు.

ఆనాటి ఉపముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్ది మరో అడుగు ముందుకేసి ఆంధ్రులు పెత్తనం చెలాయిస్తారనే తెలంగాణా ప్రజల భయాందోళనలు తొలగించడానికి 1 ఫిబ్రవరి, 1956 న ఆంధ్ర అసెంబ్లీలో ఇంకొక తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానంలో కూడా సమైక్య రాష్ట్రంలో నియామకాలు, ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తెలంగాణా ప్రజల భయాందోళనలను దృష్టిలో ఉంచుకొని, తెలంగాణా వాటా 1/3 ను ఎట్తి పరిస్థితులలో ముట్టుకోబోమని ప్రకటించారు.

ఈ విధమైన వాగ్దానం ముఖ్యమంత్రి ఇదివరలోనే చేశారని, వాగ్దానం వ్యక్తిగతమైనది కాదని, ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ , రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసిన వాగ్దానమని తీర్మానించారు.

తెలంగాణా నాయకులను, కేంద్ర ప్రభుత్వాన్ని సమైక్య రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పించడానికి చేసిన ప్రయత్నంలో భాగమే పై రెండు ఏకపక్ష తీర్మానాలు.

స్వాతంత్ర్య పోరాటంలో కలిసి ఉద్యమించిన జాతీయ నాయకులతో తమకున్న సాన్నిహిత్యాన్ని పురస్కరించుకుని ఆంధ్రా స్టేట్ కాంగ్రెస్ నాయకులు విశాలాంధ్ర ఏర్పాటుకు కేంద్ర నాయకులపై ఒత్తిడి చేయడం ప్రారంభించారు. 1952 సార్వత్రిక ఎన్నికల తర్వాత హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి,డా|| మర్రి చెన్నారెడ్డి లు సమైక్య రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే ఆంధ్రా కాంగ్రెస్ నాయకుల ఒత్తిడివల్ల, కేంద్ర నాయకుల వద్ద ఆంధ్ర నాయకులకున్న ప్రాబల్యం వల్ల తెలంగాణా కాంగ్రెస్ నాయకులపై ఒత్తిడిని అధికం చేయగలిగారు. ముఖ్యంగా ఈ ముగ్గురు నాయకులు ఒత్తిడికి లొంగడం ప్రారంభించారు. ఇంకొకవైపు ఆంధ్ర కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు నాయకత్వంలో వారికి రెండు రాష్ట్రాల అసెంబ్లీలలో ఉన్న సంఖ్యాబలం కారణంగా సమైక్య రాష్ట్రం కొరకు కేంద్రంపై విపరీతమైన ఒత్తిడి తేగలిగారు. కేంద్ర నాయకులు ఆంధ్ర స్టేట్ నాయకుల వత్తిడికి లోనై తెలంగాణాలో సమైక్య రాష్ట్రానికి విముఖత వ్యక్తమవుతున్నా పట్టించుకోకుండా, తెలంగాణాలోని ముఖ్యమైన నాయకులను విశాలాంధ్ర ఏర్పాటుకు ఒప్పించే ప్రయత్నం ముమ్మరం చేశారు.

ఆంధ్ర నాయకులు తెలంగాణా అభివృద్ధికి చేసిన వాగ్దానాలను, ప్రత్యేకంగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన రెండు తీర్మానాల ఆధారంగా, ఆనాటి కేంద్ర హోం మంత్రి గోవింద వల్లభపంత్ రెండు ప్రాంతాల నాయకులను, సమైక్య రాష్ట్ర ఏర్పాటుకై ఫిబ్రవరి 19, 1956 నాడు చర్చలకు ఆహ్వానించారు. ఈ సమావేశంలో సమైక్య రాష్ట్రం ఏర్పాటుకు తెలంగాణా నాయకులను ఒప్పించారు.

దీని పర్యవసానంగా తెలంగాణా ప్రాంత హక్కుల పరిరక్షణకు కొన్ని షరతులతో కూడిన ఒక విలీన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై రెండు ప్రాంతాలకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఫిబ్రవరి 20, 1956 నాడు సంతకాలు చేశారు. దీనినే ఇరు ప్రాంతాల నాయకుల మధ్య కుదిరిన పెద్దమనుషుల ఒప్పందం ( Gentlemen`s Agreement ) గా పేర్కొంటారు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved