19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

రాజీనామాల సమితి

ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో తొమ్మిదేళ్ల క్రితం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్)కి, రాజీనామాలకు అవినాభావ సంబంధం ఉన్నట్లు కనపడుతోంది! రాజీనామాలు, ఉప ఎన్నికలు ఆ పార్టీ చరిత్రలో భాగంగా మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేలు ఇటీవలే రాజీనామా చేశారు. ఎమ్మెల్సీలు కూడా ఇదే బాట పట్టారు. స్పీకర్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వాటిని వెంటనే ఆమోదించడంతో ఇక ఉప ఎన్నికలు అనివార్యమని తేలిపోయింది.

రాజీనామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాజీనామాల సమితిగా మారిందన్న విమర్శలు, వ్యంగ్యోక్తులు వినపడుతున్నాయి. తరచి చూస్తే, విశ్లేషిస్తే తెరాసకు రాజీనామాలకు అవినాభావ సంబంధం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజీనామాలు చేయడంలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది పార్టీ. అసలు ఆ పార్టీ ఆవిర్భావమే రాజీనామాలతో మొదలైంది. ఒకప్పుడు మెదక్ జిల్లా తెలుగుదేశంలో కీలకపాత్ర వహించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 1999 ఎన్నికల అనంతరం తనకు క్యాబినెట్ మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసనగా పార్టీకి, డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. అదే ఏడాది సెప్టెంబరు 22న సొంత నియోజకవర్గం సిద్ధిపేట నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి అసెంబ్లీకి, కరీంనగర్ నుంచి లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం కేంద్రంలోని యూపీఏ మంత్రివర్గంలో చేరారు. ఆరుగురు తెరాస శాసనసభ్యులు జూన్ 23న రాష్ట్ర మంత్రివర్గంలో చేరారు. ఎంపీగా కొనసాగేందుకు ఇష్టపడిన కేసీఆర్ సిద్ధిపేట శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో అక్కడి నుంచి జరిగిన ఉప ఎన్నికలో ఆయన మేనల్లుడు హరీశ్ రావు ఎన్నికయ్యారు. ప్రత్యేక తెలంగాణకు సంబంధించి నాటి ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డితో ఏర్పడిన విభేదాల కారణంగా తెరాసకు చెందిన ఆరుగురు మంత్రులు 2005 జులై 3న రాజీనామా చేశారు. ఇదే కారణంతో నాటి కేంద్రమంత్రులైన కేసీఆర్, ఆలె నరేంద్ర కేంద్ర మంత్రి పదవుల నుంచి 2006 ఆగస్టు 22న వైదొలగారు.

ఆగిపోలేదు...ఇంకా ఉంది

ఇంతటితోనే రాజీనామాల పర్వం ఆగిపోలేదు. కరీంనగర్ జిల్లాకు చెందిన అప్పటి రాష్ట్ర మంత్రి ఎం.సత్యనారాయణరావు సవాలుకు స్పందించి 2006 సెప్టెంబరు 12న కరీంనగర్ పార్లమెంటు సభ్యత్వానికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఫలితంగా 2007 డిసెంబరు 7న కరీంనగర్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో రెండులక్షలకు పైచిలుకు మెజారిటీతో ఘనవిజయం సాధించి పార్టీల గుండెల్లో ప్రకంపనలు సృష్టించారు. కాంగ్రెస్, తెరాసల మధ్య రాజకీయ సవాళ్ల నేపథ్యంలో 2008 మార్చి 3న కేసీఆర్ సహా పార్టీకి చెందిన అయిదుగురు ఎంపీలు, 16 మంది శాసనసభ్యులు పదవుల నుంచి వైదొలగడంతో మళ్లీ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో 2008 జూన్ 1న ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు తెరాసకు గట్టి గుణపాఠాన్ని నేర్పాయి. తమ తీర్పు ద్వారా ప్రజలు తెరాసకు బలమైన హెచ్చరికలు పంపారు.

ఈ ఎన్నికల్లో తెరాస చావుతప్పి కన్ను లొట్టబోయిన విధంగా కేవలం రెండు లోక్ సభ, పది అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావలసి వచ్చింది. స్వయంగా కేసీఆర్ కరీంనగర్‌లో 15వేల మెజారిటీతో సరిపెట్టుకోవలసి వచ్చింది. 2009 ఏప్రిల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా తెరాస రెండు పార్లమెంటు, 10 అసెంబ్లీ స్థానాలు సాధించి పేలవమైన పనితీరే కనబరిచింది. జస్టిస్ బి.ఎన్.శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలకు నిరసనగా ఏడాది తిరక్కుండానే మళ్లీ తెరాస రాజీనామాల బాట పట్టింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఫిబ్రవరిలో రాజీనామా చేయడంతో మళ్లీ ఆర్నెల్లలోగా అనివార్యంగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్, విజయశాంతి రాజీనామాలపై లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ఎటువంటి నిర్ణయం వెలువడక పోవడంతో ప్రస్తుతానికి సస్పెన్సు నెలకొంది.

ఈసారి తెరాస భవితవ్యం ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్దికాలం వేచిచూడక తప్పదు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved