19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఆర్.బి.ఐ. నిర్ణయాలు...ఖాతాదారులకు వరాలు

పొదుపు ఖాతాలపై రోజువారీ వడ్డీ,

బేస్ రేటు వడ్డీ విధానంతో బ్యాంకులకు ముకుతాడు,

ఏప్రిల్ 1 నుంచి అమలు

బ్యాంకు ఖాతాదారులకు మేలుచేకూరే రెండు నిర్ణయాలు రిజర్వుబ్యాంకు తీసుకుంది. ఇవి ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయాలు అమలైతే ఇప్పటివరకు పరోక్షంగా ఖాతాదారులను దోపిడీ చేస్తున్నబ్యాంకులకు ముకుతాడు పడుతుంది. రిజర్వుబ్యాంకు నిర్ణయాలపై బ్యాంకింగ్ వర్గాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సేవింగ్సు ఖాతాల నిల్వలపై వడ్డీ లెక్కగట్టే విధానంలో భారీ మార్పులు తీసుకురావాలని, రుణాల మంజూరుపై ఏకరీతి వడ్డీ విధానం ఉండాలని రిజర్వుబ్యాంకు నిర్ణయించింది. ప్రస్తుత విధానం వల్ల బ్యాంకులకు భారీగా ప్రయోజనాలు సమకూరుతున్నాయి. ప్రస్తుతం పొదుపు ఖాతాల నిల్వలపై నామమాత్ర వడ్డీ లభిస్తుంది. ప్రతినెలలో తొలి పదిరోజులను వదిలిపెట్టి 11వ తేదీ నుంచి నెలాఖరులోగా ఏ రోజున అతి తక్కువ మొత్తం ఉందో దానిపై 0.29 శాతం వడ్డీని బ్యాంకులు చెల్లిస్తున్నాయి. ఈ మొత్తాన్ని ప్రతి మూడునెలలకు ఒకసారి పొదుపుఖాతాలో జమ చేస్తున్నారు. దీనివల్ల ఖాతాదారులకు కలిగే ప్రయోజనం దాదాపు శూన్యమని చెప్పవచ్చు. ఇలా వచ్చే వడ్డీ అతి తక్కువ మొత్తం. ఏప్రిల్ 1 నుంచి ఈ విధానం మారాలని ఆర్.బి.ఐ. బ్యాంకులను ఆదేశించింది. పొదుపు ఖాతాలోని నిల్వపై ఏరోజుకారోజు లెక్కగట్టి 0.0095 శాతం వడ్డీ చెల్లించాలని ఆర్.బి.ఐ. ఆదేశించింది. ఉదాహరణకు పొదుపుఖాతాలో ఒకరోజు యాభై వేలుంటే దానిపైన వడ్డీ ఇవ్వాలి. మరుసటి రోజు అందులోనుంచి పాతికవేలు విత్ డ్రా చేస్తే మిగిలిన పాతికవేలపైన వడ్డీ చెల్లించాలి. రోజువారీ వడ్డీ విధానం వల్ల తమపై అధికభారం పడుతుందంటూ బ్యాంకులు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం ఏడాదికిస్తున్న 3.5 శాతం వడ్డీని 2.5 శాతానికి తగ్గించాలని కోరుతున్నాయి.

బేస్ రేటుతో బహుమేలు...

రిజర్వుబ్యాంకు మరో నిర్ణయం బేస్ రేటు వడ్డీ విధానం కూడా కచ్చితంగా ఖాతదారులకు ప్రయోజనం కలిగించేదే. ప్రస్తుతం బ్యాంకులు అవలంబిస్తున్న వడ్డీ విధానంలో ఏకరూపత లేదు. ఒక్కో రుణానికి ఒక్కో వడ్డీ, ఒక్కో ఖాతాదారునికి ఒక్కో వడ్డీ విధానాన్ని అవలంబిస్తున్నాయి. కచ్చితమైన విధానమంటూ లేదు. పారదర్శకత లేనేలేదు. అయితే ప్రైమ్ లెండింగు రేటు (పి.ఎల్.ఆర్) ఆధారంగా వడ్డీరేటును నిర్ణయిస్తున్నారు. అంటే సాధారణంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 11 శాతం, ప్రైవేట్ బ్యాంకుల్లో 13 శాతం ఉంది. ఏప్రిల్ 1 నుంచి ఈ విధానానికి తెరపడనుంది.

బేస్ రేటు ఆధారంగానే వడ్డీని నిర్ణయించాల్సి ఉంది. డిపాజిట్ల సేకరణ, ఇతరత్రా ఖర్చులను కలుపుకుని బేస్ రేటును నిర్ణయిస్తారు. బేస్ రేటు కంటే తక్కువ వడ్డీరేటుకు రుణాలిచ్చే అవకాశం ఉండదు. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలకు ఒక్కో వడ్డీ రేటు ఉండవచ్చేమో గానీ ఖాతాదారుని బట్టి వడ్డీని నిర్ణయంచే అవకాశం ఇక నుంచి ఉండదు. అందరికీ ఒకే రేటును వర్తింపజేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం బ్యాంకుల డిపాజిట్ల సేకరణ వ్యయం 7 నుంచి 8 శాతం వరకు ఉంది. ఈ ప్రాతిపదికన ప్రభుత్వరంగ బ్యాంకుల్లో బేస్ రేటు 9 శాతం, ప్రవేట్ బ్యాంకుల్లో 10 శాతం బేస్ రేటు ఉండే అవకాశం ఉంది. బేస్ రేటు విధానం వల్ల ప్రస్తుతం పి.ఎల్.ఆర్. కంటే తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుంటున్న కార్పొరేట్ రుణాలకు అడ్డుకట్ట పడుతుంది. స్పెషల్ ఆఫర్ పేరుతో తక్కువ వడ్డీ అంటూ ప్రజలను ఊరిస్తూ ఇచ్చే రుణాలకు కూడా చెక్ పెట్టినట్లు అవుతుంది. అదే సమయంలో రిటైల్ రుణాలైన వ్యక్తిగత, వాహన, గృహ రుణాలు తక్కువ వడ్డీకి లభించేందుకు మార్గం సుగమమవుతుంది.

బేస్ రేటు విధానాన్ని పాతరుణాలకు కూడా వర్తింపజేయాలని ఖాతాదారులు కోరుతున్నారు. రిజర్వుబ్యాంకు నిర్ణయాల వల్ల దేశీయ బ్యాంకింగు రంగంలో పారదర్శకత పెరిగి ఖాతాదారులకు మేలు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved