19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

14 నెలల తర్వాత మళ్లీ పాక్ తో చర్చలు

ఉగ్రవాదంతో పాటూ నదీజలాలే కీలకాంశం,

25న న్యూఢిల్లీలో నిరుపమారావు, సల్మాన్ బషీర్ భేటీ

ముంబయి దాడుల నేపథ్యంలో దెబ్బతిన్నభారత్-పాకిస్థాన్ సంబంధాలను పునరుద్ధరించేందుకు గట్టి ప్రయత్నం జరుగుతోంది. 2008 నవంబరులో ముంబయి దాడుల అనంతరం తొలిసారిగా ఉభయ దేశాల విదేశాంగ కార్యదర్శులు ఫిబ్రవరి 25న సమావేశం కానున్నారు. భారత విదేశాంగ కార్యదర్శి నిరుపమా రావు, పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి సల్మాన్ బషీర్ న్యూఢిల్లీలో చర్చలు జరపనున్నారు. కాశ్మీర్ అంశం, బలూచిస్థాన్, అఫ్ఘనిస్థాన్ అంశాల్లో భారత్ జోక్యం చేసుకుంటుందోన్న ఆరోపణలు, ఉభయ దేశాల మధ్య నదీజలాల పంపిణీ తదితర విషయాలు ప్రస్తావనకు రానున్నాయి. చర్చలు మళ్లీ ప్రారంభించేందుకు భారత్ ఎలాంటి ముందస్తు షరతులు విధించలేదని, ఏ అంశంపైనయినా ప్రస్తావించేందుకు తమకు స్వేచ్ఛ ఉందని పాక్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు భారత్ వాదన భిన్నంగా ఉంది. ఇవి సమగ్ర చర్చలు కావని, దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించడమే లక్ష్యమని, చర్చల్లో సీమాంతర ఉగ్రవాదం, చొరబాట్లు గురించి ప్రస్తావిస్తామని స్పష్టం చసింది. పాక్ ఆరోపించినట్లుగా బలూచిస్థాన్ గొడవల్లో తమ పాత్ర లేదని, సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టితేనే సమగ్ర చర్చలు, అర్థవంతమైన చర్చలకు ఆస్కారం ఉంటుందని పేర్కొంది. భారత్ వైఖరి గమనించే కాబోలు పాక్ కూడా పూర్తిస్థాయి చర్చలకు పట్టుబడుతోంది. కార్యదర్శుల స్థాయి చర్చల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించేందుకు సమాయత్తమవుతోంది.

నదీజలాలే కీలకం...

కార్యదర్శుల చర్చల్లో ఉగ్రవాదంతో పాటూ నదీజలాల అంశం కీలకం కానుంది. ముఖ్యంగా పాక్ ఈ విషయమై పట్టుదలతో ఉంది. ముఖ్యంగా సింధు నది నీటి వినియోగంపై ఆది నుంచి అనేక అభ్యంతరాలు ఉన్నాయి. హిమాలయాల్లో ప్రారంభమయి అరేబియా మహా సముద్రంలో కలిసే ఈ నది ఉభయదేశాల్లో 26 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. 1960లో కుదిరిన ఒప్పందం ప్రకారం  పశ్చిమంగా ప్రవహించే సింధు, జీలం, చీనాబ్, నదీజలాలను పాక్; తూర్పునకు ప్రవహించే రావి, సట్లెజ్, బియాస్ నదీజలాలను భారత్ వినియోగించుకోవాలి. అయినప్పటికి కొన్ని పరిమితులకు లోబడి పశ్చిమ నదుల జలాలను వినియోగించుకునే హక్కు భారత్ కు, తూర్పు నదుల నీటిని వాడుకునే హక్కు పాక్ కు ఉంది.

పాకిస్థాన్ గుర్రు ఎందుకంటే

ఒప్పందంలో భాగంగానే జీలం నదీజలాలను వ్యవసాయ, తాగునీటి వసరాలకు వాడుకునేందుకు భారత్ యత్నిస్తోంది. అయినప్పటికి దీన్ని పాక్ వ్యతిరేకిస్తోంది. భారత్ భూభాగం నుంచి పాక్ కు వెళ్లే సింధు నది కాల్వల నుంచి నీటిని అక్రమంగా భారతీయ రైతులు వాడుకుంటున్నారని పాక్ ఆరోపిస్తోంది. దీనికి భారత్ ప్రత్యామ్నాయంగా తుల్ బుల్ ప్రాజెక్టును చేపట్టింది. పాక్ దీనిని ఊలార్ ప్రాజెక్టు అని పిలుస్తుంది. జీలం నదిపై ఊలార్ సరస్సుకు దిగువన నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల తమ ప్రాంతంలోని నదిలో నీటిమట్టం తగ్గుతుందని, నౌకాయానానికి ఇబ్బంది కలుగుతుందని పాక్ వాదిస్తోంది.

అయితే సోపూర్-బారముల్లా మధ్య 20 కిలోమీటర్ల దూరం నౌకాయానానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తామని భారత్ చెబుతోంది. ప్రాజెక్టును పూర్తిచేసి నీటి ప్రవాహాన్ని నిర్దిష్ట ప్రమాణంలో నియంత్రిస్తే నౌకాయానానికి ఎలాంటి ఆటంకం ఉండదు. వర్షాకాలంలో వచ్చే నీటిని వృథా కానీయకుండా రిజర్వాయరులో నిల్వ చేసుకుని అవసరాన్ని బట్టి కిందికి విడుదల చేయవచ్చ.

దీనిపై ఉభయ దేశాల నాయకులు, అధికారులు, నిపుణులు కలసి ఒక నమూనా ఒప్పందాన్ని తయారు చేసినా ఆమోదానికి నోచుకోలేదు. ఫిబ్రవరి 25న జరిగే చర్చల్లో దీనిపై ప్రధానంగా చర్చ జరగనుంది.

పధ్నాలుగు నెలల విరామం అనంతరం చర్చలకు సమ్మతించడం కీలకం. ఎంతటి జఠిల సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. పరస్పరం నిజాయితీగా, చిత్తశుద్ధితో, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చర్చలు సాగితే పరిష్కారం కాని సమస్య ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అందువల్ల 25న జరిగే చర్చలు మొక్కుబడి కాకూడదని, అర్థవంతంగా ఉండాలని ఆశిద్దాం.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved