19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఉద్దీపనలు ఉండాలి

అన్నిరంగాలదీ అదే మాట,

కోలుకుంటున్న తరుణంలో కోతలొద్దు,

విత్తమంత్రికి వినతుల వెల్లువ

యావద్దేశం ఇప్పుడు విత్త మంత్రి ప్రణబ్ ముఖర్జీ వైపు చూస్తోంది. ఫిబ్రవరి 26న సమర్పించనున్న కేంద్ర బడ్జెట్లో ఆయన ఏం చేయబోతున్నారనే విషయమై అందరికీ ఉత్కంఠ నెలకొంది. సామాన్య ప్రజల నుంచి కార్పొరేట్ల వరకు ...వారు, వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రణబ్ నుంచి ఏదో ఒకటి ఆశిస్తున్నారు. మాంద్యం నుంచి ఆర్థికవ్యవస్థ ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తరుణంలో మరింత ముందుకు సాగేందుకు ప్రభుత్వ మద్దతు అవసరమని పారిశ్రామికరంగం భావిస్తోంది. దాదాపు ప్రతి రంగానిదీ ఇదే భావన. ఇందుకు గాను ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ఉద్దీపనలను మరికొంత కాలం కొనసాగించాలని అవి కోరుతున్నాయి. పరిస్థితిపూర్తిగా కుదుటపడేంతవరకు ఉద్దీపనల కొనసాగించాలని కీలకమైన ఈ సమయంలో వెనక్కితగ్గితే ఇబ్బందేనని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అన్ని రంగాలదీ ఇదే మాటగా ఉంది. మాంద్యం నేపథ్యంలో వృద్ధిరేటు అంచనాలను మించుతుందన్న వార్తలు ఊరట కలిగిస్తున్నాయి. గతేడాది 6.7 శాతంగా నమోదైన వృద్ధిరేటు ఈ ఏడాది 7.2 శాతం ఉండగలదని కేంద్ర గణాంకాల శాఖ ఇటీవల ప్రకటించింది. విత్తమంత్రి ప్రణబ్ ఇది 7.75 శాతానికి చేరవచ్చని ఆశిస్తున్నారు. ఒక్క వ్యవసాయరంగం తప్ప అన్ని రంగాల్లో నమోదైన వృద్ధిరేటు కూడా ఆశాజనకంగా ఉన్న తరుణంలో ఉద్దీపనలు కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంది. పారిశ్రామికరంగంలో ప్రస్తుత ఊపు కొనసాగింపునకు, వ్యవసాయరంగంలో ముందుకు వెళ్లడానికి ఉద్దీపనలు అవసరం. మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడుతున్న ఉద్దీపనలు మరికొంత కాలం అవసరమని ప్రవాస భారతీయులు కూడా కోరుతున్నారు.

ప్రభుత్వ మద్దతు కోరుతున్న పారిశ్రామికరంగం...

దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టు లాంటిదైన పారిశ్రామిక రంగం ప్రభుత్వ మద్దతు అవసరమని అంటోంది. వృద్ధిరేటు ఊపందుకునే దాకా ఎక్సైజు సుంకం, సర్వీసు ట్యాక్సు రాయితీలను ఉపసంహరించుకోరాదని ఈ రంగం విత్తమంత్రి ప్రణబ్ ముఖర్జీకి విన్నవించింది. రాయితీలను పాక్షికంగా ఉపసంహరించుకునే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయని ఇవే నిజమైతే వృద్ధిరేటు తగ్గి, పారిశ్రామికరంగంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందన ఫిక్కీ అధ్యక్షుడు హర్షపతి సింఘానియా ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షోభానికి ముందున్న 9 శాతం వృద్ధిరేటుకు చేరుకోవాలంటే కనీసం ఏడాదిపాటైనా రాయితీలు కొనసాగించాల్సిన అవసరం ఉందని అథమంలో అథమం అక్టోబరు నెలాఖరు వరకైనా అనివార్యమని ఆయన అభిప్రాయపడుతున్నారు. రాయితీలను కొంతకాలం కొనసాగించాల్సిన అవసరం ఉందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చెబుతున్నారు. నిధుల లభ్యత, ఆర్థిక వనరుల విస్తరణ, మొండిబకాయిల వసూలు తదితర అంశాల్లో ప్రభుత్వరంగ సంస్థల మాదిరిగానే తమనూ పరిగణించాలని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు కోరుతున్నాయి. గత రెండుమూడు నెలలుగా వాహన పరిశ్రమ కొద్దిగా కళకళలాడుతుంది. ఇదే పరిస్థితి కొనసాగాలంటే ప్రభుత్వ మద్దతు తప్పనిసరని కార్ల తయారీ రంగం కోరుకుంటోంది. దేశీయ విపణిలో కార్ల అమ్మకాలు కొనసాగాలంటే మరో 8 నుంచి 9 నెలల పాటు ఉద్దీపనలు తప్పనిసరని హ్యుందాయ్ మోటార్సు ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ అరవింద్ సక్సేనా అభిప్రాయపడ్డారు. ఉద్దీపనులు ఉపసంహరించే విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగేయాలి. ఒకవేళ అనివార్యమైతే దశలవారీగా మాత్రమే ఉపసంహరించాలని టాటా మోటార్సు వైస్ ఛైర్మన్ రవికాంత్ సూచించారు. ఉద్దీపనులు మరికొంత కాలం కొనసాగించకపోతే ఎగుమతి ఆధారిత ఉత్పాదక రంగాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఇంటాస్ బయోఫార్మా సి.ఎఫ్.ఒ. సంజయ్ నాగ్ రథ్ అభిప్రాయపడ్డారు. ఆటోమొబైల్ రంగానికి ఉద్దీపనలు కొనసాగించాల్సిన అవసరం ఉందని కేంద్ర భారీపరిశ్రమల శాఖ మంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ కూడా విత్తమంత్రిని కోరారు. మాంద్యం తాకిడికి కుదేలై ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న స్థిరాస్తి రంగంవచ్చే బడ్జెట్లో రాయితీలు, వెసులుబాట్లు కల్పించాలని కోరుతోంది. ముఖ్యంగా గృహ రుణాలపై వడ్డీ మినహాయింపును లక్షన్నర నుంచి మూడు లక్షలకు పెంచాలని అభ్యర్థిస్తోంది. 1929 తర్వాత ఏర్పడిన భారీ ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా ఉద్దీపనులు ఉపసంహరిస్తే ప్రతికూల ఫలితాలు లభిస్తాయని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ హెచ్చరించారు. మాంద్యానికి బాగా దెబ్బతిన్న జౌళిరంగం ప్రభుత్వ మద్దతు కోరుతోంది. ఉద్దీపనలు కొనసాగించాలని లేనిపక్షంలో కనీసం ఎగుమతి ప్రయోజనాలు అయినా ప్రకటించాలని జౌళి రంగం కోరుతోంది. ఆర్థిక సంక్షోభానికి అతలాకుతలమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల రంగం కూడా ఉద్దీపనలు మరికొంత కాలం కొనసాగించాలని అభిప్రాయపడుతోంది. వస్తూత్పత్తిలో 45 శాతం వాటా కలిగిన ఈ రంగంలో రమారమి ఆరుకోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. ఎగుమతుల్లో 40శాతం ఈ రంగానిదే కావడం గమనార్హం. పూర్వవైభవం పొందాలంటే ప్రస్తుత ఉద్దీపనలను మరికొంత కాలం కొనసాగించాల్సిన అవసరం ఉందని సమాచార సాంకేతిక పరిశ్రమకు సంబంధించిన తయారీరంగం కోరుతోంది. ఐటీ రంగంలో పెరిగిన పోటీ, రూపాయి బలపడిన నేపథ్యంలో ఈ చర్య అవసరమని మ్యాన్యుఫాక్చరర్సు అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టరు విన్నీ మోహతా ఉద్ఘాటించారు. ఇంజినీరింగు పరికరాలు, హస్తకళలు, వస్త్రాలు, తోలు ఉత్పత్తుల ఎగుమతులు ఇంకా పుంజుకోవలసి ఉంది. కాఫీ, టీ, జెమ్సు, ఆభరణాలు, ప్లాస్టిక్, ఔషధాల ఎగుమతుల్లో చక్కటి వృద్ధి నమోదైంది.

పాక్షికంగా ఉపసంహరణ...

ఉద్యోగ కోతలు, ఆర్థిక నష్టాలతో కుదేలైన మధ్యతరగతి ప్రజలు ఊపిరి పీల్చుకునేందుకు ఐటీ పరిమితిని కనీసం రూ.2 నుంచి రూ. 3 లక్షలకు లక్షలకు పెంచాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆరోగ్యరంగం కూడా ఆర్థికమంత్రి నుంచి ఎంతో కొంత ఆశిస్తోంది. ఈ రంగంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు, సవాళ్లను అధిగమించేందుకు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఆరోగ్య సంరక్షణ రంగానికి ప్రాధాన్య, మౌలిక సదుపాయాల పరిశ్రమ హోదా కల్పించాలని కోరుతోంది. దీనివల్ల దీర్ఘకాల నిధులు లభిస్తాయి. ఎక్కువ మంది పెట్టుబడిదారులు ముందుకువస్తారు. వెనకబడిన వ్యవసాయరంగం ఊతానికి ఉద్దీపనలు తప్పనిసరని ఇందులో రెండో అభిప్రాయానికి తావులేదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో 0.2 శాతం వ్యతిరేక వృద్ధి నమోదవడం ఆందోళన కలిగించే పరిణామం. పారిశ్రామిక ఉత్పాదన రంగం, గనుల రంగం అనూహ్య అబివృద్ధిని కనబరిస్తే ఒక్క వ్యవసాయరంగం మాత్రం ఊసూరమంటోంది. వ్యవసాయరంగంలో లోటును ఆధునిక సాంకేతిక పరిజానం, అధికోత్పత్తి విధానాల ద్వారా ఎలాగైనా పూడ్చగలిగితే రెండంకెల వృద్ధి లక్ష్యం సాధించడం ఏమంత కష్టం కాదన్నది నిపుణుల అభిప్రాయంగా ఉంది. అయితే విత్తమంత్రికి ఎవరెన్ని అభ్యర్థనలు చేసినప్పటికి తాజా పరిస్థితులను పరిశీలిస్తే పాక్షికంగానైనా ఉద్దీపనులు ఉపసంహరించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎక్సైజ్ డ్యూటీలను పెంచడం ద్వారా ఈ ప్రక్రియ చేపట్టాలని రంగరాజన్ నేతృత్వంలోని ప్రధాని ఆర్థిక సలహా మండలి సూచనే ఇందుకు నిదర్శనం. కోలుకున్న రంగాలకు దశలవారీగానైనా ఉద్దీపనలు ఉపసంహరించి, మిగిలిన వాటికి కొనసాగించే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ ఇటీవల చెన్నైలో వెల్లడించారు. ఈ ఇద్దరి ప్రకటనలతో ఉద్దీపనలపై ప్రభుత్వ వైఖరేమిటో దాదాపుగా తెలిసిపోయింది. అయితే ఉపసంహరణ లేదా తొలగింపు వాస్తవ ప్రాతిపదికగా మాత్రమే ఉండాలని, మరీ ఏకపక్షంగా ఉండరాదన్నదే అన్నివర్గాల అభిప్రాయం.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved