19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

కవిత, పాట, నాటిక కలబోసుకున్న త్రిమూర్తి -దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి, స్వేచ్ఛా గానం- కృష్ణపక్షం

By తాతిరాజు, వేణుగోపాల్

"జగము నిండ స్వేచ్ఛా గాన ఝరుల నింతు" (స్వేచ్ఛా గానం- కృష్ణపక్షం), "బ్రతుకంతా ప్రతి నిమిషం పాట లాగ సాగాలి" (ఏక వీర), " ఊరుకో! ఈ వేళ పాడక పోతే ఎలాగ?" (కృష్ణాష్టమి)- ఇలాంటి ఉదాహరణలు మచ్చుకి ఒక్కొక్కటి చొప్ప్పున ప్రతి ఒక్క ప్రక్రియకీ ఇచ్చుకుంటూ పొతే ఆ జాబితా ఎన్నేళ్ళ కైనా తరగదనిపిస్తే ఆ ఘనత ఒక్కరిదే! వారే దేవులపల్లి వారు.

ఆయన కవులకు కవి. వంకర పోని తెలుగు అక్షర కిరణాల రవి. తాళ బద్ధమైన మేలుకొలుపుల తొలి ఝాము వైతాళికుడు.

ఆయన తెలుగు పదం- నేలకానితే కందిపోయే పసి పాదం. ఆయన తెలుగు పద్యం- అమ్మమ్మ చేతుల్లోని నేతి నైవేద్యం.

ఆయన సినీమా పాట - సుందర సిరి వెన్నెలల భావి బాట.

ఆయన శ్రవ్య నాటిక- ముదిమిలోనూ మూసుకోనివ్వని స్వర పేటిక.

ఇవన్నీ చదివిన తెలుగు వాడు జన్మ ధన్యమైన వాడు. ఇవేవీ చదవని తెలుగు వాడు మరో జన్మ ఎత్తక తప్పని వాడు.

అవని అక్షయ పాత్ర

'అవని నా అక్షయ పాత్ర' అన్నారు కృ.శా , 'గగన సీమల తేలు మేఘమాల' ను చూసి బహుశ: .

'దిగి రాను దిగి రాను దివినుండి భువికి' అని ఆయన సెలవు తీసుకున్నా ఆ 'కలం'కారి 'మధురామృతాల తేట' లే ఇటు అవనికీ అటు గగనానికి మధ్య పరచుకున్న 'ఆశలనే నిచ్చెనలు'. మూడు దశాబ్దాలు గడచినా 'మోసం ద్వేషం లేని సీమలో మొగసాల' నిలిచిన ఈ మందారాన్ని చూస్తూ ఇక్కడ ఈ అవనిలో 'ఎవరు నేర్పేరమ్మ --పూలిమ్మనీ రెమ్మ రెమ్మకూ'. ఇంకెవరూ, పంచ భూతాలే! అక్షయ పాత్ర నిండా ప్రపంచ గీతాలే.

ఆంధ్రా షెల్లీ

1980 ఫిబ్రవరి 24న దేవులపల్లి వారు కన్ను మూస్తే మహాకవి శ్రీ శ్రీ 'షెల్లీ మళ్ళీ మరణించాడు' 'తెలుగు దేశపు నిలువుటద్దం బ్రద్దలైంది' 'వసంతం వాడి పోయింది' అని అశ్రు తర్పణం చేసారు. 'అచ్చంగా వసంత మాసం వచ్చే దాక' ఆగక 'తొందర పడి కోయిల ముందే కూసింది' అంతకు పదేళ్ళ క్రితమే'రానిక నీ కోసం సఖీ, రాదిక వసంత మాసం' అనీ. కానీ ఈ భావ గడసరి కోయిలకు తెలుసు, ఎప్పటికీ తను వేసినది చిక్కు ప్రశ్న గానే మిగిలి పోతుందనీ- 'మావి చిగురు తినగానే కోవిల పలికేనా? కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా?' అన్నదే ఆ ప్రశ్న. ఆ సమాధానం దొరికేంత వరకూ తనను మరచి పోరనీ ఆయనకు తెలుసు.

పల్లెల, మల్లెల ప్రేమికుడు

కోయిల పల్లె యాసలో కోవిల అవుతుందని ఆయనకు తెలుసు.

' ఊగే జనపా చేలల్లో తూగేసెనగా పూలల్లో'

'నాలుగు దిక్కుల నడిమి సంతలో'

'అయ్యకు బువ్వ పెట్టాల- పెయ్యకు మువ్వ కట్టాల' ,

'ఊరి గుడిలో రావి కావల'

'కడివెడు నీళ్ళూ కలాపి చల్లి'

'వేపా చెట్టూ బోదీ చుట్టూ వెర్రీ బావను కట్టేరోయ్'

-ఇలా ఎన్నో పాట పంక్తులు మాలగా కడితే ఎవరికైనా సరే 'మనసున మల్లెల మాలలూగెనే' అని అనిపించక పోదు.

పంచ భూతాల సాక్షిగా

అందరికీ గాలి స్పర్శ అనుభవమేకాని ఆ గాలి కలిగించే అనుభూతి కృ.శా మాటల్లోనే వినాలి. 'ఊగే గాలుల తూగే తీగలు','గాలుల తేలే గాటపు మమతలు', 'వెదురు గోలలు గాలి ఈలలు','రెమ్మల గాలులు ఉసురుసురనినా','చిరుగాలి తరగలా','గాలి దారిలో' 'చల్లనైన పిల్లగాలి పాడెనోయి'.

బడలి ఒడిలో రాజు పవ్వళిస్తే ఒక రాణి ఆ గాలిని సడి చేయవద్దంటూ వారిస్తూనే ఎన్నెన్ని పనులు చేయమందీ - పండు వెన్నెల నడిగి పాన్పు తెమ్మంది, నీలి మబ్బుల దాగు నిదుర తెమ్మంది, విరుల వీవన పూని విసిరి పొమ్మంది. సందె గాలి తేలి మురళి పాట వినిపిస్తుంటే తొందర తొందర లాయె మరొక జాణకి. 'చిగురాకుల గాలులే ఒదిగి ఒదిగేను' ఇంకొక జంటకి. 'ఆకులతో గాలి ఊసులాడగూడదు' అని ఒక జంట కోరితే, 'గల గల మన గూడదు ఆకులలో గాలి' మరొక జంటకి.ఒకరికి 'గాలి వీస్తే పైర గాలి', ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం కి మాత్రం 'ప్రతి గాలి పైర గాలి' యే!

అందరికీ నీరు స్వయానా కళ్ళలో, లేదంటే మబ్బుల్లో ఉంటుంది. అదే కృ.శా శైలిలో- ' కురియు నా కన్నీరు గుండెలో దాచుకొని వాన జల్లుగా కురిసి పోవా, కన్నీరు ఆనవాలుగా బావ మ్రోల' అనే మేఘ సందేశంగా మారుతుంది. 'ఎదురుగ వద్దామంటే ముదుసలి కదలలేదు' 'అసలే ఆనదు చూపు ఆపై ఈ కన్నీరు- తీర దయ చేసిన నీ రూపు తోచదయ్యయో' అంటుంటే శబరి కచ్చితంగా తెలుగు వారిదే అన్న భ్రమ కలుగుతుంది. పాతాళ గంగమ్మ ఎలా రావాలంటేనో అదీ కృ.శా వరుసలోనే చూడాలి -'సోలిన ఈ చేనికీ సొమ్మసిలిన భూమికీ' గోదారి గంగమ్మ సేద తీర్చేలా. ఇంతకీ ఆ గంగమ్మ ఉండేది శివుని జటలోనే కదా- అందుకనే 'శ్రీ శైలం మల్లన్న శిరసొంచేనా చేనంతా గంగమ్మా వానా' అంటారు శాస్త్రి గారు.

నిప్పు లు చెరిగే ఎండలు మన అందరికీ తెలుసు. కానీ కృ.శా 'కసిరే ఎండలు కాల్చుననీ' అంటారు. ఆ ఎండలకి 'వగరుస్తూ గుండె దాక పగిలిందీ నేల- సెగలొచ్చీ , పొగలొచ్చీ సొగసిందీ నేల' కనుక 'తాప కీల చల్లారాలంటే అన రాదా రామ యనీ' అని హిత బోధ చేస్తారు.

ఇలా ప్రకృతిలోని 'ప్రతి పులుగూ ఎగిరే దైవం' గానూ 'ప్రతి మనిషి నడిచే దైవం' గానూ తలచే కృ.శా గారిది 'ఇది హృదయం - మృదు కుసుమం'.

'కరుణ కురియాలిరా- కురిసి జగతి నిండాలిరా' అన్న ఆ మహనీయుడు కోరుకున్నట్టు నిజంగానే అలా జరిగితే- మనతో బాటు ఆయనా అనేది ఒకటే- 'అను కోనా ఇది నిజమనుకోనా ? కల యనుకోనా? అయినది కాదని కానిది అవునని అనుకోనా?

అందుకు పది గొంతులు ఏకమైతే చాలదు పది గుండెలు ఏకం కావాలి. అందుకే ఆయన హెచ్చరించారు- 'గొంతు పాడితే చాలునా గుండెలో రాగం ఉండాలి - మాట లాడగానే సరా మనసులో నిజం పలకాలి' అని.

అక్షరాలా నిజం. క్షరం కాని కవి అక్షరాలు అబద్ధమాడవు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved