19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

తెలుగు వారి గళ వేల్పు ఘంటసాల

By తాతిరాజు, వేణుగోపాల్

బృహస్పతి సూర్యుని చుట్టూ తిరిగేందుకు దాదాపు 12 ఏళ్ళు పడుతోంది. గాన బృహస్పతి ఘంటసాల భౌతికంగా మన మధ్య నుంచి నిష్క్రమించి గంధర్వలోకంలో సంగీత వనంలో విహరిస్తుంటే అప్పుడే 36 ఏళ్ళు గడిచాయి. అనంత విశ్వంలో సూర్యుడు కేవలం 'స్టార్' మాత్రమే. కాని మన ఘంటసాల వారో - 'మాస్టారు'! బృహస్పతికి 'గురు' అనే పేరుంది. మన 'మాస్టారు' మన గురువు. ఆయన అమరుడు, అమృత హృదయుడు. కనుకనే పాటల అక్షయ పాత్ర లో అమృత గానం నింపి దాని పైన రికార్డు మూత పెట్టి ఎన్నిసార్లు తెరిస్తే అన్ని సార్లు ఆ మధుర ధారలు మనకందాలని, అవే మనకు అందాలని వర మిచ్చి, అక్కడి వారి ఆహ్వానాన్ని మన్నించి, తన పాటల్లోని రెండు పల్లవులు ఒకటి గురు పత్నికి, ఒకటి మనందరికీ ఎప్పటికీ వినిపించేలా చేసి వెళ్లి పోయారు.

'రానిక నీ కోసం సఖీ, రాదిక వసంత మాసం' - అవును, ఘంటసాల వసంత మాసం రాక ముందే 1974 ఫిబ్రవరి 11 న 'టాటా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు' - అని నిట్టూర్చారు. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు 1944 లో 'స్వర్గ సీమ' చిత్రానికి తొలుతగా పాడి మూడు పదుల కాలం సంగీత సామ్రాట్టు గా చిత్ర సీమను ఏలారు. 'విధి ఒక విష వలయం' కనుక ఆ అమృత కంఠానికి కేవలం అయిదు పదుల కాలం మాత్రమే భౌతిక రూపం దక్కింది. ఇక అప్పటి నుంచి తెలుగు వారికి పద్యాలు కరువయ్యాయి, మంచి తెలుగు పలుకులు అరుదయ్యాయి.

ప్రతి అనుభూతికీ ఓ పాట

గురజాడ వారి పుత్తడి బొమ్మ పూర్ణమ, శ్రీ శ్రీ గారి మహా ప్రస్థానం, కరుణశ్రీ వారి సులభ శైలి గద్యాలు, పద్యాలు, రావులపర్తి బద్రిరాజు గారి వెంకటేశ్వరుడు, ఘంటసాల వారి 'మృత్యు వంటే భయం లేని' రచన, దేవులపల్లి వారి అపర కాళిదాసీయ మేఘ సందేశం-- ఆ గొంతులో ఎంతగా బందీలైపోయాయంటే మళ్ళీ అటువంటివి మరో గొంతు నుండి విడుదల కాలేదు. తెలుగు వాడికి తెల్లవారితే 'దినకరా శుభకరా' ; మధ్యాహ్నం బాధ కలిగితే ఓదార్చే 'భగవద్గీత' ; సాయంత్రం వేడుకైతే 'పడమట సంధ్యా రాగం, కుడి ఎడమల కుసుమ పరాగం' ; రాత్రి 'కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది' , అలా కానప్పుడు 'నడిరేయి ఏ జాములో'' ... 'నిద్దురపోరా తమ్ముడా' ....'కల ఇదనీ నిజమిదనీ తెలియదులే' ; అంతలోనే తెల్ల వారితే 'నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో' అన్న సందేహంలో సంతృప్తి - ఇవన్నీ ఆయన ప్రసాదించిన వరాలే.

తెలుగు విద్యార్ధికి 'ప్రేమ తమాషా వింటేనే కులాసా' . కానీ 'పది మందిలో పాట పాడితే అది అంకితమెవరో ఒకరికే' అన్న సుతి మెత్తని బెత్తం దెబ్బా! తొందర పాటు నిర్ణయాలకు పోతుంటే 'కల కానిది విలువైనది బ్రతుకు- కన్నీటి ధారలలోనే బలి చేయకు' అన్న అక్షర లక్షల 'థెరపీ', ఆవేశం వస్తే 'ఆవేశం రావాలి' కానీ 'ఆవేదన కావాలి' అన్న మందలింపూ, ఆందోళనకు దిగితే 'తెలుగు వీర లేవరా' అన్న అదిలింపూ, ఎవరికి వారయి విడిపోతుంటే 'ఎవ్వరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి' అన్న విదిలింపూ- ఇవన్నీ ఆయన అందించిన వివరాలే.

తెలుగు తల్లికి 'ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి' నువ్వున్నావమ్మా అనగానే ఎంత సంబరం!

తెలుగు పడుచుకి 'దివి నుండి భువికి దిగి వచ్చే పారిజాతమే నీవే నీవే' అనగానే ఎంతటి గర్వం!

'తెలుగు వారి ఆడ పడుచు ఎంకిలా' ఎంతటి సిగ్గూ! ఇదంతా ఆయన గొంతు మహత్మ్యమే.

'పాపాయి నవ్వులే మల్లె పూలు' , ' ముద్దబంతి పూవులో మూగ కళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే' అన్నప్పుడు ఎన్ని మల్లెలు పాపాయిలుగా పుట్ట్టా లను కున్నాయో? ఎన్ని బంతి పూలు ఆది శంకరుని తలచు కున్నాయో! 'బలే బలే పావురమా' , 'జగమే మారినది మధురముగా -- పావురములు పలుక' , 'గోరోంక గూటిలో చేరావు చిలక' , 'నా పాట నీ నోట పలకాల సిలక' అన్నప్పుడు ఎన్ని పక్షులు తెలుగు నేర్చుకున్నాయో!'శివ శంకరీ శివానంద లహరీ--మనసు కరుగదా' అనగానే ఎన్ని మృదంగాలు నాట్యమాడ లేదూ! 'మది శారదా దేవి మందిరమే' అనగానే ఎన్ని గంటలు మ్రోగ లేదూ!

ప్రతి సంక్రాంతి 'అసలైన పండుగ-- కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండుగ' గా వాసి కెక్కిందంటే అది ఆ గళం అందించిన బలమే.ప్రతి ఉగాది 'భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు' గా చెలామణి అయ్యిందంటే అది ఆ కంఠం ప్రోద్బలమే. ఇన్నిటికీ, ఇందరికీ, అన్నిటికీ, అందరికీ 'తెలుగు వారి ఇలవేల్పు' గా వెంకటేశ్వరుడుంటే "తెలుగు వారి గళ వేల్పు" ఘంటసాల !

ఆరుద్రగారు అన్నట్టు- మాస్టారూ, 'నీలి మేఘాలలో గాలి కెరటాలలో మీరు (నీవు) పాడే పాట వినిపించునే వేళా'!


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved