19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

సమాజ్ వాదీలో సంక్షోభం

పార్టీ పదవులకు అమర్ సింగ్ రాజీనామా - కార్యకర్తగానే కొనసాగుతా,

అనారోగ్యం సాకే, అధినేతతో విభేదాలే అసలు కారణం

ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ (ఎస్.పి)పార్టీ సంక్షోభంలో చిక్కుకుంది. కొత్త సంవత్సరంలో ఈ సంక్షోభం పార్టీకి పెనుసవాలుగా నిలిచింది. పార్టీ అగ్రనేత, పార్టీ అధినేత ములాయంకు అత్యంత ఆప్తుడుగా పేరుగాంచిన అమర్ సింగ్ పార్టీ పదవులకు జనవరి 6న రాజీనామా చేయడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, పార్లమెంటరీ బోర్డు సభ్యత్వానికి అమర్ సింగ్ రాజీనామా చేశారు. అయితే పార్టీని వీడే ప్రశ్నే లేదని, సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని ఆయన ప్రకటించడంతో పార్టీవర్గాలు బిత్తరపోయాయి. దుబాయ్ లో ఉన్న అమర్ అక్కడి నుంచే ఈ తీవ్ర నిర్ణయాన్ని పత్రికల వారికి ప్రకటించడంతో పార్టీలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. రాజీనామాకు అనారోగ్యమే కారణమని, రాజకీయ ఉద్దేశ్యాలు ఏమీ లేవని చెబుతున్న ఆయన తన స్థానంలో అధికార ప్రతినిధిగా రామ్ గోపాల్ యాదవ్ ను నియమించాలని సూచించడం మరో విశేషం.

అమర్ రాజీనామా నేపథ్యంలో ప్రముఖ నటుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి సంజయ్ దత్, మరో ప్రధాన కార్యదర్శి ఒబైదుల్లా ఖాన్ కూడా రాజీనామా చేయడం విశేషం. మరోపక్క నటి, రాంపూర్ ఎంపీ జయప్రద అమర్ కే తన విధేయత ప్రకటించారు.

ఇటీవల సింగపూరులో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకున్న తనకు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని, ఇకనుంచి ఆరోగ్యం, కుటుంబంతో గడపటమే తన ప్రథమ ప్రాధాన్యాలని, రాజకీయాలు ద్వితీయ ప్రాధమ్యమేనని అమర్ స్పష్టం చేశారు. పుస్తక పఠనం, సినిమాలు చూడటం, బ్లాగులు రాయడం తదితర కార్యకలాపాల్లో నిమగ్నమవుతానని భవిష్యత్ కార్యక్రమాన్ని వెల్లడించారు. గతంలో ఒకసారి ఇలానే రాజీనామా చేసి వెనక్కితగ్గిన అమర్ సింగ్ ఈసారి మాత్రం అటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదని, తన రాజీనామాను ఆమోదించడం తప్ప అధ్యక్షుడికి అవకాశం లేనేలేదని చెప్పడం ద్వారా తన వైఖరిని చాటారు. నిజంగా రాజకీయ విభేదాల వల్లే రాజీనామాలు చేస్తున్నారా అన్న ప్రశ్నకు ఎవరికి తోచిన విధంగా వారు తన వాఖ్యలను అన్వయించుకోవచ్చని చెప్పడం ద్వారా అసలు కారణం చెప్పకనే చెప్పారు. గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలను పరిశీలిస్తే అమర్ సింగ్ రాజీనామా ఆశ్ఛర్యం కలిగించదు.

అనారోగ్యాన్ని సాకుగా చూపి అమర్ సింగ్ రాజీనామా చేసినప్పటికి అధ్యక్షుడితో ఏర్పడిన తీవ్రమైన అభిప్రాయ భేదాలే ఈ పరిస్థితికి దారితీశాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు నుంచే ఏర్పడిన విభేదాలు క్రమంగా తీవ్రమయ్యాయని అందుకే ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. రాంపూర్ స్థానానికి తన సన్నిహితురాలైన సినీనటి జయప్రద అభ్యర్థిత్వం ఖరారులో అమర్ అధ్యక్షుడితో విభేదించారు. జయప్రదకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీ నాయకుడు అజాంఖాన్ ను నియంత్రించడంలో అధ్యక్షుడు ఉదాసీనంగా వ్యవహరించారన్నది ఆయన ప్రధాన ఫిర్యాదుల్లో ఒకటి. ఇటీవల జరిగిన ఫిరోజాబాద్ ఉపఎన్నికలో స్వయంగా పార్టీ అధినేత కోడలు డింపుల్ యాదవ్ ఓటమి నేపథ్యంలో అమర్ చేసిన వ్యాఖ్యలు ములాయంను కొంత ఆగ్రహానికి గురిచేసినట్లు సమాచారం. ఉప ఎన్నిక సందర్భంగా ములాయం కుమారుడు వ్యవహరించిన తీరుపై అమర్ విమర్శలు గుప్పించడం వివాదాస్పదమయ్యాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలం కావడానికి ములాయం కుమారుడే కారణమని అమర్ వ్యాఖ్యానించడం పెద్ద దుమారమే లేపింది.

ఈ నేపథ్యంలో రాజీనామాకు అనారోగ్యం కారణం కాదని రాజకీయ పరిస్థితులే ఇందుకు దారితీశాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అమర్ పైనా పార్టీ వర్గాల్లో అసంతృప్తి ఉంది. రాజ్ బబ్బర్, బేణి ప్రసాద్ వర్మ, సలీం షేర్వానీ, మహమ్మద్ అజంఖాన్ వంటి సీనియర్లు పార్టీకి దూరమవడానికి ఆయనే కారణమన్న విమర్శలు ఉన్నాయి. ములాయాంకు మారుపేరుగా, ఆయనకు కళ్లుచెవులుగా పేర్కొనే అమర్ రాజీనామా పార్టీకి కచ్చితంగా పెద్దదెబ్బే. ప్రజాదరణ పెద్దగా లేనప్పటికి పారిశ్రామిక వేత్తలతో సత్సంబంధాలు నెరపడం, పార్టీకి విరాళాలు సేకరించడం వంటి పనుల్లో అమర్ సింగ్‌ది అందెవేసిన చేయి. ఢిల్లీ రాజకీయాలు నడపటంలో దిట్టగా పేరుగాంచారు. రాజకీయాలకు అతీతంగా ప్రతిపార్టీలో సన్నిహిత మిత్రులున్న ఆయన పనులు చక్కబెట్టడంలో సిద్ధహస్తుడు. అమర్ సింగ్ తో ఎలాంటి విభేదాలు లేవని ఆయనతో మాట్లాడకుండా ఏ నిర్ణయం తీసుకోనని ములాయం చెబుతున్నప్పటికి పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. మొత్తమ్మీద అమర్ రాజీనామా పార్టీపై ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో ఎంతో కొంత ప్రభావం చూపకపోదు. అమర్ సింగ్ ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెసులలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved