22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

కేంద్రపాలిత ప్రాంతం అంటే...

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భవితవ్యంపై అనేక ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర విభజన, రాజధానుల ఏర్పాటు వంటి అనేక అంశాలు కీలకం కానున్నాయి. అదే సమయంలో ప్రస్తుత రాజధాని నగరమైన హైదరాబాదుపై కూడా వివిధ కోణాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు వేర్వేరు రాజధానులు ఏర్పాటు చేస్తారని, లేదా హైదరాబాదునే ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేస్తారని, లేదా హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని...ఇలా వివిధ కోణాల్లో అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తమ్మీద హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశాలు బలంగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అసలు కేంద్ర పాలిత ప్రాంతం అంటే ఏమిటి, దాని పరిపాలన వ్యవహారాలు ఎవరు నిర్వరిస్తారు, ఇందుకు సంబంధించి రాజ్యాంగం ఏమంటోంది తదితర సందేహాలు రావడం సహజం. ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ వ్యాసం లక్ష్యం.

కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం పరిపాలించాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. కేంద్రపాలిత ప్రాంతాలకు రాష్ట్రాలకు ఉండే అధికారాలు ఉండవు. భౌగోళికంగా ప్రధాన భూభాగానికి దూరంగా ఉండే ప్రదేశాలను, ప్రాంతాలను అంతర్ రాష్ట్ర వివాదాల వల్ల అనివార్యంగా కేంద్రం పాలించాల్సిన ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటిస్తారు. వీటి పాలన వ్యవమారాలు, బడ్జెట్ తదితర అంశాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. బడ్జెటును పార్లమెంటు ఆమోదిస్తుంది. సాధారణంగా రాష్ట్రాలకు గవర్నర్ ఉంటారు. అయితే కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రం లెఫ్టినెంట్ గవర్నరును నియమిస్తారు. కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు అసెంబ్లీ కూడా ఉంటుంది. అలాంటి కేంద్రపాలిత ప్రాంతానికి ముఖ్యమంత్రి కూడా ఉంటారు. ఉదాహరణకు ఢిల్లీ. కాంగ్రెస్ పార్టీకి చెందిన షీలాదీక్షిత్ దీని ముఖ్యమంత్రి.

దేశంలో మొత్తం ఏడ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వాటి వివరాలు...

  • లక్షదీవులు, అండమాన్ నికోబార్ దీవులు ...ఇవి దేశ ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్నందువల్ల వీటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించారు.
  • పోర్చుగీసు వారి దురాక్రమణ నుంచి స్వాధీనం చేసుకున్న అనంతరం డామన్ డయ్యూ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. ఇవి గోవాకు దూరంగా ఉన్నాయి.
  • విదేశీయుల దురాక్రమణ నుంచి విముక్తమైన దాద్రా - నగర్ హవేలీ ని కూడా కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. ఇవి కూడా గోవాకు దూరంగా విస్తరించి ఉన్నాయి.
  • ఫ్రెంచ్ వారి నుంచి విముక్తం అయిన తర్వాత పాండిచ్చేరి ని కూడా కేంద్రపాలిత ప్రకటించారు. ప్రస్తుతం దీని పేరు పుదుచ్చేరిగా మార్చారు. ఇక్కడ శాసనసభ, ముఖ్యమంత్రి ఉన్నారు. మన రాష్ట్రంలోని యానాం ప్రాంతం సైతం కేంద్రపాలిత ప్రాంతంగా పుదుచ్చేరిలో భాగంగా ఉంది.
  • పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్ కూడా కేంద్ర పాలిత ప్రాంతమే. ఇంతకు ముందు పంజాబ్ నుంచి హర్యానా విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది. అనంతరం రాజధాని విషయమై వివాదం తలెత్తడంతో చండీగఢ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. చండీగఢ్ రెండు రాష్ట్రాలకు రాజధాని అయినప్పటికి ఒప్పందం ప్రకారం దీనిని పంజాబుకు ఇచ్చారు. ఇంకా బదిలీ పూర్తి కానందున కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతోంది.
  • ఇక దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. రాజ్యాంగం ప్రకారం న్యూఢిల్లీ దేశ రాజధాని అయినప్పటికి వ్యవహారికంగా మాత్రం కేంద్రపాలిత ప్రాంతమే.

ప్రస్తుతం చండీగఢ్, హైదరాబాదులకు ఒక పోలిక ఉంది. పంజాబును విభజించి హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు సహజంగానే రాజధాని నగరంపై వివాదం తలెత్తింది. ఆ వివాదాన్ని పరిష్కరించేందుకు నగరాన్ని తాత్కాలికంగా రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉంచాలని, ఒప్పందం ప్రకారం చండీగఢ్ ను పంజాబుకు బదిలీ చేయాలని అప్పటివరకు కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుందని నిర్ణయించారు. అంతేతప్ప దీనిని శాశ్వతంగా కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించలేదు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved