20 సెప్టెంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ప్రభుత్వ రంగ 'మహారత్నాలు'

మహారత్నలుగా సెయిల్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ

మరింత స్వయం ప్రతిపత్తి, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ,

అంతర్జాతీయ దిగ్గజాలుగా ఎదిగేందుకు అవకాశం

ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి యూపీఏ ప్రభుత్వం ద్విముఖ వ్యూహం అవలంబిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థల్లో డిజిన్వెస్టుమెంటు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు మరో పక్క అదే ప్రభుత్వరంగ సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. గత ఏడాది బడ్జెట్లో పేర్కొన్న విధంగా ఎన్.ఎం.డి.సి, విశాఖ ఉక్కు కర్మాగారం తదితర తొమ్మిది ప్రభుత్వరంగ సంస్థల్లో తన వాటాను పరిమితం చేసుకుని, విక్రయించేందుకు రంగం సిధంచేస్తోంది. తద్వారా వచ్చిన నిధులను సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తామని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. అదే సమయంలో ప్రభుత్వరంగ సంస్థలకు స్వేచ్ఛ, స్వయం ప్రతిపత్తి కల్పించడం ద్వారా వాటిని బలోపేతం చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు కనపడుతోంది.

ఇటీవల మూడు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు మహారత్న హోదా కల్పించడం ద్వారా తన నిబద్ధతను చాటుకుంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్), నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్.టి.పి.సి, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఒ.ఎన్.జి.సి) లకు మహారత్న హోదాలను కల్పించింది. డిసెంబరు 24,2009 న ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అంబికాసోని వెల్లడించారు.

ఆర్థిక స్థోమత, పనితీరు ప్రాతిపదికగా మినీరత్న, నవరత్న, మహారత్న హోదాను కల్పిస్తున్నట్లు భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల శాఖల మంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ వెల్లడించారు. ప్రస్తుతం 18 సంస్థలకు నవరత్న, 62 సంస్థలకు మినీ నవరత్న హోదా ఉంది. ప్రభుత్వ నిర్ణయంపై సెయిల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ ఛైర్మన్లు ఎస్.కె.రుంగ్టా, శర్మ, ఆర్.ఎస్. శర్మ హర్షం వ్యక్తం చేశారు.

మూడు ప్రభుత్వరంగ సంస్థలకు మహారత్న హోదా కల్పించడం వల్ల అవి పలు విధానపరమైన విషయాల్లో స్వతంత్రంగా వ్యవహరించేందుకు అవకాశం కలుగుతుంది. మరిన్ని అధికారాలు లభిస్తాయి. జాయింట్ వెంచర్లు నెలకొల్పేందుకు, ఇతర కంపెనీలను టేకోవర్ చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఆర్థిక అంశాలతో పాటు, పెట్టుబడుల విషయాల్లోను, సంస్థాపరంగాను మరింత స్వయం ప్రతిపత్తి పొందుతాయి. వీటి నికర ఆస్తుల్లో 30 శాతం లోపు పెట్టుబడులపై వీటికి స్వేచ్ఛ లభిస్తుంది. ప్రభుత్వ అనుమతితో నిమిత్తం లేకుండా మహారత్న కంపెనీలు రూ.5వేల కోట్ల వరకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాయి. సంయుక్త భాగస్వామ్యాలు, అనుబంధ సంస్థల పెట్టుబడుల్లో, డైరెక్టర్ పదవి కంటే దిగువస్థాయి పోస్టులు కల్పించడం పైనా ఈ మూడు సంస్థలకు వెసులుబాటు ఉంటుంది. పెద్ద పెట్టుబడులు, సంయుక్త భాగస్వాముల విషయంలో త్వరగా నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడుతుంది.

కాగా మహా రత్న హోదాను కల్పించడానికి ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. పాతికవేల కోట్ల రూపాయల టర్నోవరు, వరుసగా మూడేళ్లపాటు అయిదువేల కోట్లకు పైబడి నికర లాభాలు, రూ.15 వేల కోట్ల నికర ఆస్తులు కలిగిన సంస్థలకు ప్రభుత్వం మహారత్న హోదా కల్పిస్తోంది. ఆయా సంస్థలు స్టాక్ మార్కెట్లో నమోదై ఉండాలని, వాటి షేర్లు ట్రేడ్ అవుతూ ఉండాలన్నవి ప్రభుత్వ నిబంధనలు. అయితే టర్నోవర్, లాభాల ప్రాతిపదికన మహారత్న హోదా కల్పించడం సరైనది కాదని కార్పొరేట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. తక్కువ టర్నోవర్ కలిగిన సంస్థలు కూడా ఎక్కువ లాభాలు గడిస్తున్నాయన్న వాస్తవాన్ని గుర్తించాలని వారు అంటున్నారు.

మహారత్న హోదా కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ మూడు సంస్థలు మరింత విస్తరించి అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు దోహదపడుతుంది. భారతీయ బహుళజాతి దిగ్గజాలుగా ఎదుగుతాయి. ఒకటీఅరా విమర్శలు ఉన్నప్పటికి మొత్తమ్మీద కేంద్రం నిర్ణయం పారిశ్రామిక పురోగతికి దోహదపడేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో పరిస్థితులకు అనుగుణంగా సత్వరమే స్పందించి వేగంగా నిర్ణయాలు తీసుకుని దూసుకుపోయే సంస్థలకే భవిష్యత్తు ఉంటుంది. ఈ వాస్తవాన్ని గ్రహించే ఆర్థికవేత్తలైన మన్మోహన్, ప్రణబ్ ముఖర్జి, చిదంబరం వంటి ఉద్దండులు సరైన నిర్ణయం తీసుకున్నారు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved