19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

97వ సైన్సు కాంగ్రెస్ మహాసభలు

ప్రధాని ప్రోత్సాహం మాటలనుండి చేతలలోకి మారేనా!

అఖిల భారత సైన్సు కాంగ్రెసు 97వ మహాసభలకు కేరళ రాజధాని తిరువనంతపురం వేదికైంది. జనవరి 3 నుంచి అయిదురోజుల పాటు జరిగిన ఈ మహాసభలకు రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యం ఇచ్చింది. సుమారు 7500 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కేరళ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్, ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖ మంత్రి వయలార్ రవి, విదేశాంగ శాఖ సహాయ మంత్రి శశి థరూర్, కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ సహాయమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్, అఖిల భారత సైన్సు కాంగ్రెసు అధ్యక్షుడు, ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నాయర్, ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్, నోబెల్ బహుమతి విజేతలు రోజర్ సియన్, యొహన్ క్రోమ్‌వెల్ తదితరులు పాల్గొన్నారు. వయలార్ రవి, శశిథరూర్ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు.

ఈ సందర్భంగా సైన్సు కాంగ్రెస్ ఏర్పాటుచేసిన అవార్డులను ప్రధాని విజేతలకు అందజేశారు. ప్రఖ్యాత అంతర్జాతీయ గణాంక నిపుణుడు సి.ఆర్.రావుకు ఈ ఏడాది భారత సైన్సు అవార్డు లభించింది. అవార్డు కింద రూ.25 లక్షల నగదు, ప్రశంసాపత్రాన్ని ఆయనకు అందజేశారు. పానంబిల్లి గోవిందమీనన్ అవార్డును ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నాయరు అందుకున్నారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వానికి చెందిన ఉన్నత విద్యా స్కాలర్ షిప్ పథకాన్ని ప్రధాని మన్మోహన్ ప్రారంభించారు. ఈ ఉపకార నిధికి రూ.12 కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి అచ్యుతానందన్ ప్రకటించారు.

సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కొన్ని చేదునిజాలను ఏకరవు పెట్టారు. పరిపాలన, రాజకీయ వ్యవస్థలో లోపాల వల్ల శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తిరోగమన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ నడుం కట్టాలని పిలుపునిచ్చారు. రాజకీయ జోక్యం, బ్యూరోక్రసీ, ఆశ్రిత పక్షపాతం తదితర రుగ్మతల కారణంగా శాస్త్ర సాంకేతిక రంగం పురోగమించలేకపోతుందన్నారు. శాస్త్రవేత్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ శాస్త్రవేత్తలు స్వేదేశానికి తిరిగి రావాలని కోరారు. అధికార జోక్యం, స్థానిక రాజకీయాల నుంచి శాస్త్రవేత్తలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న నోబెల్ బహుమతి విజేత రామకృష్ణన్ సూచనను భారత ప్రభుత్వం తప్పక పరిగణనలోకి తీసుకుంటుందని హామీనిచ్చారు.

2010-2020 దశాబ్దాన్ని ఆవిష్కరణల దశాబ్దంగా ప్రభుత్వం ప్రకటించిందని పేర్కంటూ వివిధ రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు శాస్త్రవేత్తలు కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. మహిళా శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు, మహిళలు ఈ రంగంవైపు దృష్టి సారించేందుకు కన్సలాడేషన్ ఆఫ్ యూనివర్సిటీ, రీసర్చు, ఇన్నోవేషన్ అండ్ ఎక్సలెన్సు (క్యూరీ) పేరుతో నూతన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. మార్చిలో జాతీయ శాస్త్ర, ఇంజనీరింగు పరిశోధన బోర్డు పనిచేయడం ప్రారంభిస్తుందని తెలిపారు. ఈ బోర్డును ప్రముఖ శాస్త్రవేత్తలు స్వతంత్రంగా నడుపుతారని, పరిశోధన ప్రాజెక్టులకు ఈ బోర్డు నిధులు అందిస్తుందని వివరించారు.

కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ సహాయమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్ మాట్లాడుతూ భూకంపాన్ని ముందుగా గుర్తించే విధానంపై దృష్టి సారించాలని శాస్త్రవేత్తలను కోరారు. దేశంలోని పరిశోధన శాలలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని అఖిల భారత సైన్సు కాంగ్రెస్ అధ్యక్షుడు మాధవన్ నాయర్ ప్రభుత్వాన్ని కోరారు. శత్రుదేశాల ఉపగ్రహాలను నిర్వీర్యం చేసే ఆయుధ వ్యవస్థను మనదేశం రూపొందిస్తున్నట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్ డిఎ) డైరైక్టర్ వి.కె.సరస్వత్ వెల్లడించారు. ప్రధాని ఆవేదన, ఆయన ప్రోత్సాహం నేపథ్యంలో భారతీయ శాస్త్రవేత్తలు మరిన్ని నూతన ఆవిష్కరణలకు సమయాత్తమవ్వాల్సి ఉంది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved