19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

20వ కామన్వెల్తు ప్రిసైడింగ్ అధికారుల సదస్సు

కామన్వెల్తు దేశాల స్పీకర్లు, ప్రిసైడింగు అధికారుల 20వ సదస్సు జనవరి 5న న్యూఢిల్లీలో ప్రారంభమైంది. వరుసగా మూడోసారి ఈ సదస్సును భారత్ నిర్వహించడం విశేషం. గతంలో 1971, 1986లలో ఈ సదస్సుకు భారతదేశం ఆతిధ్యం ఇచ్చింది. 1969లో కామన్వెల్త్ స్టేట్స్ ప్రిసైడింగు అధికారుల సంఘం ప్రారంభమైంది. ఐదురోజుల పాటు జరిగే సదస్సుకు మొత్తం 42 పార్లమెంట్లకు చెందిన 50 మంది స్పీకర్లు, ప్రిసైడింగు అధికారులు హాజరయ్యారు. వీరితోపాటు కామన్వెల్తు పార్లమెంట్లకు చెందిన 34 మంది ఇతర అధికారులు, కార్యదర్శులు హాజరయ్యారు.మన దేశం నుంచి 34 మంది స్పీకర్లు, ప్రిసైడింగు అధికారులు పాల్గొన్నారు.

పాత్ర కీలకం

నిజాయతీ, నిష్పక్షపాతం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తదితర అంశాలపై స్పీకర్లు, ప్రిసైడింగు అధికారులకు అవగాహన కల్పించడం సదస్సు లక్ష్యం. సదస్సులో తీసుకున్న నిర్ణయాలను సభ్యదేశాలు తప్పనిసరిగా ఆమోదించేలా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో జరిగిన సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాలు, సూచనలు అమలు చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగని నేపథ్యంలో పై నిర్ణయం తీసుకున్నారు. సదస్సులో ప్రధానంగా మూడు అంశాలపై చర్చలు జరిగాయి. భిన్న నేపథ్యాలు గల సభ్యుల మధ్య సంధానకర్తగా స్పీకర్ పాత్ర, పార్లమెంటు నిర్వహణలో ఉపయోగించవలసిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, పార్లమెంటు నిర్వహణలో స్పీకర్ పాత్ర తదితర అంశాలపై సమగ్రచర్చ జరిగింది. పార్లమెంటు నిర్వహణ వ్యయం నియంత్రించడం, సమాచారం పారదర్శకంగా అందరికీ అందుబాటులోకి రావడం తదితర అంశాలపై ఆహుతులు వివిధకోణాల్లో చర్చలు జరిపారు.

సదస్సును ఉద్దేశించి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, స్పీకర్ మీరాకుమార్ ప్రసంగించారు. సదస్సు ప్రారంభం సందర్భంగా భారత పార్లమెంట్ చిహ్నంతో ముద్రించిన పోస్టల్ స్టాంపును ప్రధాని విడుదల చేశారు. పార్లమెంటు నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లను ప్రధాని ప్రస్తావించారు. పరిష్కార మార్గాలపై ప్రతినిధులు దృష్టి సారించాలని కోరారు. సభ్యులు చట్టసభల ఔన్నత్యాన్ని, సభాపతి గౌరవాన్ని కాపాడాలని కోరారు. సంకీర్ణ రాజకీయాల నేపథ్యంలో సభాపతుల పని కత్తిమీద సాములా ఉందని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. సంకీర్ణ పరిమితులు పాలనకు అడ్డంకిగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కోసారి చిన్న పార్టీల సంకుచిత ధోరణి వల్ల అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. స్పీకర్ మీరాకుమార్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలు, అంచనాలకు కేంద్రబిందువైన పార్లమెంటు నిర్వహణలో సభాపతి పాత్ర కీలకమైనదని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో చట్టసభలే అత్యుత్తమమైనవని వాటి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత సభ్యులపై ఉందన్నారు.

భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు మెరుగయ్యేందుకు పార్లమెంటరీ దౌత్యం దోహదపడుతుందని పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ ఫామిద మీర్జా అన్నారు.పాక్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికైన తొలి మహిళా స్పీకర్ ఆమె. పాక్ బృందానికి ఫామిదా నాయకత్వం వహించారు. నియంతృత్వం కంటే బలహీనమైన ప్రజాస్వామ్యమే మేలని ఆమె వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం పట్ల ప్రజల ఆకాంక్షలు, అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు మరింత బాధ్యాతాయుతంగా, పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చట్టసభల కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల తమ ప్రతినిధుల పనితీరును అంచనా వేసేందుకు, అవగాహన చేసుకునేందుకు ప్రజలకు అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా తమ సమస్యలపై స్పందిస్తున్నారా లేదా అన్న విషయం ఇట్టే తెలిసిపోతోంది. ప్రజల నిఘా కారణంగా ప్రజాప్రతినిధులు అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రిసైడింగ్ అధికారులు రాగద్వేషాలకు, పార్టీ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి సభ్యుల హక్కులను కాపాడాల్సి ఉందని సదస్సు సూచించింది. అయిదురోజుల సదస్సు అనేక అంశాలపై తీర్మానాలు చేసింది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved