22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

జ్యోతి బసు

మార్క్సిస్టు మహానేత

1914-2010

జ్యోతిబసు...మార్క్సిస్టు మహానేత. ఆధునిక రాజకీయాల్లో శిఖరస్థాయి నేత. సుదీర్ఘకాలం (రమారమి 23 సంవత్సరాలు) ముఖ్యమంత్రిగా పనిచేసి భారతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రాజకీయ వేత్త. మార్క్సిస్టు గాంధీగా మనన్నలు పొందిన మహా నాయకుడు. పేరుకు వామసక్ష నేత అయినా అన్ని రాజకీయ పక్షాల అభిమానం పొందిన అరుదైన నాయకుడు. భారత రాజకీయాలపై తనదంటూ చెరగని ముద్ర వేసిన మహానాయకుడు. విపక్ష నేతగా, ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఏ హోదాలో పనిచేసినప్పటికి నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపించిన ప్రజా నాయకుడు. పేదరికం అంటే తెలియని ఎగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జ్యోతిబసు జీవితాంతం నిరుపేదల అభ్యున్నతికి తాపత్రయపడ్డారు. వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి చిత్తశుద్ధితో కృషిచేశారు. నిజాయతీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన నికార్సయిన నాయకుడు. యావత్ బెంగాలీల అభిమానాన్ని చూరగొన్న బసు రాజకీయ ప్రస్థానమంతా ప్రజా ఉద్యమాలతోనే మమేకమైంది. రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. ప్రపంచవ్యాప్తంగా వామపక్ష సిద్ధాంతం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ బెంగాల్లో సజీవంగా ఉండటానికి, రాష్ట్రంలో ఇంతకాలం పార్టీ అధికారంలో ఉండటానికి పూర్తిగా జ్యోతిబసు వ్యక్తిగత నాయకత్వమే కారణమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇదీ ప్రస్థానం...

1914 జులై 8న కోల్‌కత్తాలో జన్మించిన జ్యోతిబసు తల్లితండ్రులు హేమలతా బసు, నిశికాంత బసు సంపన్న కుటుంబానికి చెందిన వారు. బాల్యంలో దైవభక్తి గల బసు క్రమంగా హేతువాదిగా మారడం విశేషం. ఆంగ్లంలో బి.ఎ.ఆనర్సు అనంతరం అత్యున్నతమైన బార్ ఎట్ లా కోసం లండన్ వెళ్లారు. విద్యాభ్యాసం సమయంలోనే వామపక్ష ఉద్యమం పట్ల ఆకర్షితుడై కమ్యూనిజం వైపు అడుగులేశారు. బ్రిటన్ వామపక్ష నేతలతో కలసి పనిచేశారు. విద్యాభ్యాసం అనంతరం సీపీఐలో సభ్యత్వం స్వీకరించి కార్మిక సంఘ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు. 1952 నుంచి 1957 వరకు రాష్ట్ర సీపీఐ ప్రొవిన్షియల్ కమిటీ కార్యదర్శిగా పనిచేసి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. తొలిసారిగా 1946లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఎన్నికైన బసు ఇక ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం కలగలేదు. అప్పటినుంచి అప్రతిహంగా వరుసగా 1952, 57, 62, 67, 69, 71, 77, 82, 87, 91, 96లలో పుష్కలమైన ప్రజామద్దతుతో అసెంబ్లీకి ఎన్నికై సంచలనం సృష్టించారు. 1957 నుంచి 67 వరకు దశాబ్దం పాటు ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలపై పోరాడారు. 1967-69 మధ్యకాలంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1977 జూన్ 27న తొలిసారిగా రాష్ట్రంలో వామపక్ష కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 63 ఏళ్ల వయస్సులో ముఖ్యమంత్రి పగ్గాలు అందుకున్న బసు అప్పటి నుంచి వరుసగా అయిదుసార్లు వామపక్ష ప్రభుత్వ సారధిగా అటు పార్టీ, ఇటు ప్రభుత్వాన్ని ఒంటిచేత్తో నడిపించి చరిత్ర సృష్టించారు. సుమారు 23 ఏళ్లపాటు సీఎంగా పనిచేసిన ఆయన రికార్డు నేటికీ చెక్కుచెదరలేదు. అనారోగ్యం దృష్ట్యా బసు 2000 నవంబరు 6న రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికి పార్టీ కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరోకు ప్రత్యేక ఆహ్వానితుడుగా కొనసాగుతున్నారు. 1964లో పార్టీ ఆవిర్భావం నుంచి 2008 వరకు పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయకసంస్థ పొలిట్ బ్యూరోలో సభ్యుడుగా కొనసాగడం ఆయనకే చెల్లింది.

ముఖ్యమంత్రిగా...

దేశంలోనే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించిన జ్యోతిబసు ప్రజారంజకంగా పాలించారు. బసు ప్రభుత్వానికి ప్రజా ప్రయోజనాలే ప్రాతిపదికలయ్యాయి. వాటి ఆధారంగానే ప్రభుత్వ విధానాలు రూపుదిద్దుకునేవి. తొలి పదవీకాలమైన 1977-82 మధ్యకాలంలో భూసంస్కరణలకు శ్రీకారం చుట్టి రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. 5,14,000 హెక్టార్ల మిగులు భూమిని 20 లక్షల నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేయడం ద్వారా పేదప్రజల పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టడం ద్వారా యావద్దశానికే ఆదర్శంగా నిలిచారు. తద్వారా ప్రజాస్వామ్య ఫలాలను అట్టడుగు వర్గాల ప్రజలకు అందించారు.1991లో నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యాక పారిశ్రామిక విధానాల్లో సంస్కరణలను తీసుకువచ్చి పారిశ్రామిక ప్రగతికి ఊపునిచ్చారు. రాష్ట్ర ప్రగతి కోసం పార్టీ ప్రవచిత సిద్ధాంతాలను పక్కనబెట్టి పెట్టుబడి దారీ దేశాలైన అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో పర్యటించారు. బెంగాల్ ల్యాంపుల కుంభకోణం, కుమారుడు చందన్ బసు కారణంగా జ్యోతిబసు ప్రతిష్టకు కొంతవరకు విఘాతం కల్గినప్పటికి ఆయనను వేలెత్తి చూపడం అసాధ్యం. అనారోగ్యం పట్టిపీడిస్తున్నా అందరిలాగా పదవిని అంటిపెట్టుకోకుండా 1999లో తన వారసుడిగా బుద్ధదేవ్ భట్టాచార్యను ప్రకటించి 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 1996లో ప్రధాని పదవి చేపట్టే అరుదైన అవకాశం లభించినప్పటికి పార్టీ నిర్ణయానికి బద్ధుడై తిరస్కరించారు. నాడు బసు ప్రధానమంత్రి అయి ఉంటే దేశ భవిష్యత్తు మరోరకంగా ఉండేదన్న అభిప్రాయం అన్ని పార్టీల్లో ఉంది. అనంతరం ఆయన చారిత్రక తప్పిదంగా ప్రకటించి తన మనసులోని మాటను బయటపెట్టారు. 2004లో దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు ప్రతిపాదన పార్టీ వైఖరికి విరుద్ధమనదంటూ తిరస్కరించిన ధీశాలి. తాను ఏం సాధించినా పార్టీ ద్వారానే సాధించిందేనని ఆ ఖ్యాతి అంతా తనకు అవకాశం ఇచ్చిన పార్టీకే దక్కుతుంది తప్ప వ్యక్తిగా తనకు కాదని వినమ్రంగా ప్రకటించడం ఆయన నిజాయితీకి నిదర్శనం. సమకాలీన రాజకీయాల్లో సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన, ఇంతగా ప్రజలను ప్రభావితం చేసిన, పార్టీ పట్ల నిబద్ధదతో వ్యవహరించిన నాయకుడు మరెవరూ లేరన్నది అక్షర సత్యం. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రజాభిమానాన్ని పుష్కలంగా పొందిన మహానాయకుడు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved