19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఆటలపై ఒకమాట.

By , బామ్మగారు

అవ్వ- వ్వ ఈ డాన్సులేమిటీ? ఈ చిందులేమిటీ? నలుగురితో కలిసి చూస్తుంటే ప్రాణం సిగ్గుతో చితికిపోతోంది. ఈ కుర్రకారు కొరియోగ్రాఫర్సు కొత్తదనం అంటూ అశ్లీలభంగిమలను జతచేసి పాతపాటల అందాల్ని నాశనం చేస్తున్నారు. ఛీ..ఛీ అని పెద్ద కంఠంతో అందరిమధ్యలో కూర్చుని మా అరుంధతి ఛీత్కారం చేస్తే , దాని మనుమడు దానిమీద గయ్యిమని లేచాడుట "అలా ఛీఛీ..ఛఛ అనుకుంటూ ఇక్కడే కూర్చోబోతే - పోయి పడుకోరాదూ?! నీ కెందుకీ ప్రోగ్రాములు" అంటూ.

"నిద్రపట్టి చావక కూర్చున్నాను. అయినా నన్నంటే పొమ్మంటున్నావు, నీ చెల్లెలెక్కడికి పోతుందీ?! - మీ అమ్మెక్కడికి పోతుందీ..." అని అరుంధతి కూడా గట్టిగా నిలదీస్తే గమ్మునున్నాట్ట.

***

భారతీయులకు నాట్యం, నాట్యశాస్త్రం కొత్తగాదు. భరతుని నాట్యశాస్త్రమే ప్రామాణికంగా చెప్పుకునే - భరతనాట్యం, కూచిపూడితో పాటు - కథకళి, కధక్, మణిపురి - యిలా యెన్నో నాట్య రీతులతో మనకు పరిచయముంది. నేర్చుకుంటున్నాం కూడా.

ప్రపంచీకరణ నేపధ్యంలో యిప్పుడు - సాల్సా, రోంబా, చాచా, టాంగో - లాంటి లాటిన్ డాన్సులతో పాటు, రాక్ - బ్రేక్‌-పాప్‌ కల్చర్ డాన్సులు, "వాల్‌ట్జ్" లాంటి బాల్‌రూమ్ డాన్సులు - యిలాంటివెన్నో నృత్యరీతులు మనకీవేళ అందుబాటులో కొచ్చాయి.

కాలాన్నిబట్టి సౌందర్యభావనను గ్రహించడంలో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకు తగ్గట్టుగా తనను తాను మలచుకోవడం ఏకళకైనా అవసరమే. అందునా అధునాతన సాంకేతిక సౌకర్యాలు వృద్ధిపొందుతున్న ఈ కాలంలో ఈమార్పులు చెప్పుకోవల్సినంత తప్పుగాదు. అవసరం కూడా! అందుకేగా ఈరోజు - సకుటుంబ, సపరివార సమేతంగా - టీవీ చానెళ్ళు ప్రసారం చేస్తున్న 'డాన్స్ బేబీ డాన్స్', 'స్టార్‌వార్', జగడాలతో పాటు‘ఆట’ - వన్, టూ, త్రీ, ఫోర్లు కూడా చూడగల్గుతున్నాం.

***

ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఏదన్నా తప్పుపడతున్నారుగానీ - ఈడాన్సులు చూసేవాళ్ళలో పెద్దా - చిన్నా, పిల్లా - పాపా, చదువున్నవారూ - లేనివారూ, శృంగారమే ప్రమోదంగా భావించి కలల్లో తేలియాడేయువతీ యువకులు - యిలా అన్ని వర్గాలవారు వున్నారు.

అయితే....

కొన్నిరకాల నాట్యభంగిమలను యువతీయువకులతోనేకాదు, బాలబాలికలతో - కొన్ని సార్లు పాలుగారే పసిపిల్లలతో కూడా చేయిస్తుంటే చూడడానికి సిగ్గుగా వుంది. సిగ్గేకాదు, ఇది చిన్నారులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందోనని జంకు కూడా కలుగుతోందర్రా!

"రేటింగ్" బాగుండి, యాడ్ బిజినెస్ రీత్యా ఈ ప్రోగ్రామ్స్ సూపర్‌హిట్ అవుతున్నాయని మా మనవడూ వాదిస్తాడు. ఈ వాదన మరింత బాధాకరంగా వుందర్రా!

అంటే మనం యింతటి జుగుప్సాకరమైన నాట్యభంగిమలను "వాంఛిస్తున్న" మనేగా! మన కళాహృదయం యింత లేమిని కల్గుందాని బాధకలుగుతోంది. మన కళా "టేస్ట్" యింత నిస్సారమయిందాని సందేహం వస్తోంది. ఇదెంతకూ నాకు బోధ పడటం లేదర్రా! ఇటువంటి వాటికి శ్రామికజనామోదం ఎక్కువని మరోమాట. దాన్నే యిప్పుడు ‘మాస్ ఇమేజ్’ అని అంటున్నారు కదూ!

అలాయితే యిది యింకా విచారించాల్సిన విషయం కదర్రా!

మరో విషయం...సమాజాన్ని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మీడియాతోపాటు - కళలు, కళాకారులపైన కూడా ఎంతో వుంది. ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో యింత ఆధునికతను సంతరించుకున్న సమాజంలో అంతరించిపోయాయనుకున్న మూఢనమ్మకాలను టీవీ సీరియల్స్ లోనేకాదు - డాన్స్ ప్రోగ్రామ్స్ లో కూడా ప్రోత్సహించి అవినిజమేనన్నట్లు భ్రమింపజేసే విధానం సముచితమైనది కాదర్రా!

ఓ అమ్మాయి ‘శివతాండవం’ నృత్యం చేస్తూ పూనకంతో వూగిపోతుంది. సెట్‌ లోని వారందరు టెంకాయకొట్టి, బొట్టుదిద్ది, హారతులిచ్చి శాంతింపజేసే ప్రయత్నాలు చేస్తారు. ఈ దృశ్యాలను ప్రమోలలో పదే పదే చూపించారు.

ఒకానొక మానసిక దౌర్బల్యంతో ఓ వ్యక్తికి పూనకం వస్తే, శాస్త్రీయమైన పద్ధతిలో దాన్ని రూపుమాపే ప్రయత్నం చేయాలి. అంతేగాని వేలాది, లక్షలాది ప్రేక్షకులకు దాన్ని చూపాల్సిన అవసరమే లేదు. అసలదంతా నిజంకూడా కాకపోవచ్చు!! అయినప్పటికీ వాటినలా ప్రచార ప్రకటనలుగా వాడుకోవడం ఏమాత్రం మంచిది ( సమర్ధనీయం ) కాదర్రా!

సమాజంలో మూఢనమ్మకాలు మిక్కుటంగా వున్న రోజుల్లో పుట్టిన వ్యక్తి ‘శ్రీ కందుకూరి వీరేశలింగం ’ గారు. మూఢనమ్మకాలతో ఛిన్నాభిన్నమైన జీవితాలను కళ్ళారా చూసిన వ్యక్తి. తన కన్నతల్లి మూఢనమ్మకాలకెలా బలైందో స్వీయ చరిత్రలో చాటిచెప్పిన వ్యక్తి. ఆనాటి సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలను పెరికివేయటానికి విశేష కృషి సల్పిన వ్యక్తి. చచ్చి స్వర్గానున్న వారి ఆత్మ వీటిని చూసి ఎంత క్షోభిస్తుందో?!

వ్యక్తులు ధనార్జనకు, అభివృద్ధికి, పేరు ప్రతిష్టలకు, తమ ఆశలుఆశయాలు ఉన్నతంగా ఏర్పరుచుకున్నట్లే, కళాకారులు, నిర్వాహకులు కూడా తమ వ్యాపార వృత్తులలో తమకు తాముగా నియమ నిబంధనలు విధించుకుంటే సమాజంబాగుంటుంది. సమాజంలో యితరులతోపాటు తన తల్లిదండ్రులు, తన భార్యాబిడ్డలు, తన సోదరసోదరీమణులు, బంధువులు, స్నేహితులు కూడా భాగస్వాములే.

స్విచ్ ఆఫ్ చేసి టీవీని చూడకపోవడం పరిష్కారమవ్వదుగా!!!

ఎవరికర్తవ్యం వారే నిర్వహించాలి.

చట్టాలు స్వభావాన్ని మార్చవు కదర్రా!!!

గమనిక: బామ్మగారికి మీ అభిప్రాయాలను bamma AT APallround.com కు పంపగలరు. (ATను @ గా మార్చి, అంతా ఒకేపదంగా కొట్టండి)

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved