22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

రాజకీయంగా చచ్చి బతికాడు

మాతృసంస్థలోకి మళ్ళీ దేవేందర్‌

దేవేందర్ గౌడ్ -దాదాపు రెండు దశాబ్ధాలుగా తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. చంద్రబాబుపార్టీ అధ్యక్షుడు అయినతరువాత నంబర్‌ టూ నాయకునిగా చక్రం తిప్పారు. అంతవరకూ బాగానే వుంది. కానీ ఇటీవల ఎన్నికల సమయంలోనే ఆయన లెక్కలు తప్పాయి. అక్కడి నుంచి తప్పుల తిప్పలు అనుభవించారు.

టిడిపి అధినేత చంద్రబాబు తెలంగాణా అంశంపై అధ్యయనం చేస్తున్న తరుణంలోనే దేవేందర్‌గౌడ్‌ కాస్త దుందుడుకుగా వ్యవహరించి తెలంగాణా సెంటిమెంట్‌ను క్యాష్‌ చేసుకోవాలనుకున్నారు. ఆ వ్యూహంతోనే నవ తెలంగాణా పార్టీని స్థాపించి సొంతఇన్నింగ్స్ ప్రారంభించారు. కానీ తెలంగాణా పిచ్ ఆయనకు అచ్చిరాలేదు. స్కోర్ చేయలేక పోయారు.

రాజకీయ సొంత కుంపటి పెట్టిన కొద్ది రోజుల్లోనే ఆయన స్వంతంగా నెగ్గుకురాలేమన్న విషయం స్పష్టం అయింది. అప్పటికే తెలుగుదేశం తెలంగాణాకు అనుకూలమన్న నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో దేవేందర్ తన రెండవ తప్పు చేశారు. తన నవ తెలంగాణ పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేశారు. చిరు చెరిష్మాకు తన రాజకీయ ప్రతిభను జోడించి అధికారం చేజిక్కించుకోవాలని ఆయన మంత్రాంగం రచించారు.కాని సినిమాహీరో పార్టీలో ఆయనకు విధి చాలా బలీయమన్న సినీ డైలాగులో నిజం తెలిసివచ్చింది.ఇటు అసెంబ్లీకి, అటు లోక్‌ సభకు పోటీచేసి రెండింటా ఓటమిని చవిచూడవలసి వచ్చింది. ప్రజల రాజకీయ చతురత తెలిసొచ్చింది. 'మెగా' పొలిటికల్‌ షో అట్టర్‌ ప్లాప్‌ కావడంతో ఖంగుతిన్న ఆయన రాజకీయ ఉనికిని కోల్పోకుండా జాగ్రత్తపడే చర్యల్లో పడ్డారు.

ఈ నేపథ్యంలోపార్టీని బలోపేతం చేయడానికి 2009 సార్వత్రికఎన్నికల సందర్భంగా పార్టీ నుంచి జంప్‌ అయిన వలసపక్షులకు స్వాగతం పలికిన చంద్రబాబు నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించడంతో దేవేందర్‌ మాతృసంస్థ అయిన టీడీపీలోకి మళ్ళీ చేరారు. తలసాని శ్రీనివాస్ రాజీనామ బెదిరింపులు కాస్త ఇబ్బంది పెట్టినా, చచ్చినపామును మళ్ళీ చంపొదన్న రీతిన క్షమార్పణ చేస్తూ టీడీపీ పచ్చ కండువా కప్పుకున్నారు దేవేందర్. రెండు వారాలకిందట అధినేతతో జరిగిన రహస్య సమావేశంలో రాజ్యసభ సీటుతో పాటు పోలిట్‌బ్యూరో గుర్తింపు కూడా లభించగలదన్న హామీని పొందారన్నది రాజకీయ కారిడార్లలో వినవస్తున్న మాట.

టీడీపీ లో నంబర్‌ టూ స్థానాన్ని కోల్పోయి, రెంటికీ చెడ్డ రేవడిగా రాజకీయంగా భ్రష్టుపట్టిన దేవేందర్‌గౌడ్‌కు ప్రజల ఆదరణ లభించకపోయినా మళ్ళీ మాతృ సంస్థ ఆపన్నహస్తం అందివ్వడం అదృష్టంగానే భావించవచ్చు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved