19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

రాష్ట్రానికి 'కాసు' బ్రహ్మానంద రెడ్డి

ఘనంగా శతజయంతి ఉత్సవాలు

రోశయ్య సారథ్యంలో కమిటీ

రాష్ట్ర ప్రగతికి బాటలు పరిచిన బ్రహ్మానందరెడ్డి

రాష్ట్ర చరిత్రలో కాసు బ్రహ్మానందరెడ్డి పాత్ర అజరామరం. కాంగ్రెస్ చరిత్రలో ఆయనకంటూ ఒక ప్రత్యేక పేజీ ఉంది. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ఆయన వెనుకబడిన పల్నాడు ప్రాంతం నుంచి అంచలంచెలుగా అత్యున్నతస్థాయికి చేరుకున్నారు. నేటితరం నాయకులకు స్ఫూర్తిప్రదాత. జీవిత పర్యంతం రాష్ట్రాభివృద్ధికి పరితపించిన విసిష్టనేత. కాసు శతజయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడంతో పాటు ఆయన బాటలో ప్రయాణిస్తే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించగలదు. బ్రహ్మానందరెడ్డి శతజయంతి ఉత్సవాలను భారీగా, ఘనంగా నిర్వహించేందుకు ఆర్థికమంత్రి రోశయ్య నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.

ప్రస్థానం

గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని తూబాడులో 1909 జులై 28న జన్మించారు. మద్రాసులో బి.ఎ, ఎల్.ఎల్.బి.చదివి కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. విద్యార్థి దశలో మహాత్మగాంధీ, టంగుటూరి ప్రకాశం పంతులు సహచర్యం, బోధనలతో స్వాతంత్ర ఉద్యమంలో ప్రవేశించారు. లా ప్రాక్టీసును పక్కనబెట్టి బ్రిటీష్ వారిపై పోరాటానికి ఉత్సాహంగా కదిలారు. పోలీసు లాఠీ దెబ్బలు తిన్నారు. సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. 1942లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారు. గ్రామస్థాయి నుంచి అంచలంచెలుగా జాతీయస్థాయికి ఎదిగారు. జిల్లాబోర్డు సభ్యుడిగా, ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర ఎమ్మెల్యేగా, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఎఐసీసీ అధ్యక్షుడిగా, గవర్నరుగా వివిధ పదవులను చేపట్టి వాటికి వన్నె తెచ్చారు.

స్వాతంత్ర్యం అనంతరం కాసు కాంగ్రెస్ పార్టీలో పలు పదవులను నిర్వహించారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన 1956 నవంబరులో రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఏర్పాటైన మంత్రివర్గంలో స్థానం సాధించారు. తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, రెండో ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య మంత్రివర్గాల్లో వివిధ శాఖలకు సారథ్యం వహించి సమర్థతతను నిరూపించుకున్నారు. వారి మంత్రివర్గాల్లో మున్సిపల్, వాణిజ్య పన్నులు, ఆర్థికశాఖ వంటి కీలకశాకలను సమర్థంగా నిర్వహించి సెబాష్ అనిపించుకున్నారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి సీనియర్ నేతల దృష్టిలో పడ్డారు. ఫలితంగా దళితనేత దామోదరం సంజీవయ్య అనంతరం, నీలం సంజీవరెడ్డి ఆశీస్సులతో, 1964 ఫిబ్రవరి 29న ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రానికి ఆయన మూడో ముఖ్యమంత్రి.కోస్తా నుంచి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి నేతగా కాసు ఖ్యాతి గడించారు.

అహర్నిశలు అభివృద్ధిపైనే దృష్టి ...

రాష్ట్ర ప్రగతికి ఆయన అహర్నిశలు శ్రమించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొత్త పుంతలు తొక్కించారు. రాష్ట్రాభివృద్ధికి దోహదపడే దీర్ఘకాలిక ప్రాజెక్టుల పనులను పూర్తి చేయించారు. బహుళార్థ సాధక ప్రాజెక్టు నాగార్జున సాగర్ నిర్మాణానికి తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి హయాంలో నాటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేసినప్పటికి పనులు పూర్తయింది కాసు హయాంలోనే కావడం విశేషం. సాగర్ నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణకు ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన కాసుకు కర్షకులకు సేద్యపునీరు ఎంతో అవసరమో తెలియంది కాదు. అందువల్లే కావచ్చు పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు తీసుకు వచ్చేందుకు కృషిచేశారు. దేశంలో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తపన పడ్డారు. నాగార్జునసాగర్ మొదటిదశ పూర్తి కాగా 1966 ఫిబ్రవరి ఆగస్టు 3న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించడం విశేషం. రాయలసీమ ప్రాంతానికి వరదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు హైలెవల్ కెనాల్ ప్రాజెక్టుకు అవసరమైన క్లియరెన్సుల మంజూరు, నిధులు సమకూర్చడంలో కాసు పాత్ర కీలకం. పోచంపాడు ప్రాజెక్టు రూపశిల్పి కూడా ఆయనే. ఈ ప్రాజెక్టుకు ప్రపంచబ్యాంకు సాయం పొందేందుకు ఎంతగానో కృషిచేశారు. ప్రాంతీయ వివక్షతకు తావులేకుండా కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు మేలు చేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకుసాగారు. రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన కాసు అనేక మంచి కార్యక్రమాలను ప్రారంభించి ప్రజలకు చేరువయ్యారు. అప్పట్లోనే ఎల్.ఐ.సి.నుంచి పది కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుని బలహీనవర్గాల వారికి ఇళ్లు నిర్మించారు. ఉర్దూకు తెలుగుతో పాటు సమాన ప్రతిపత్తి కల్పించి అమలుకు కృషి చేశారు. కాసు హయాంలోనే పంచాయతీ చట్టం అమలులోకి వచ్చింది. సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏర్పాటు కావడం ఆయన ప్రయత్న ఫలితమే.

ప్రజలే పిల్లలు...

కాసు బ్రహ్మానందరెడ్డి 1994 మే 20న హైదరాబాద్ లో కన్నుమూశారు. రాష్ట్ర చర్రిలో బ్రహ్మానందరెడ్డి నిర్వహించిన పాత్ర ప్రతి ఒక్కరికీ కలకాలం గుర్తుండిపోతుంది. కాసుకు పిల్లలు లేరు. ప్రజలనే సొంత పిల్లలుగా భావించారు. గుంటూరు జడ్పీ ఛైర్మన్ గా పనిచేసిన తన అన్న కాసు వెంగళరెడ్డి కుమారుడు కాసు వెంకట కృష్ణారెడ్డిని దత్తత తీసుకున్నారు. ప్రస్తుత నరసరావుపేట ఎమ్మెల్యే అయిన కృష్ణారెడ్డి గతంలో పలుమార్లు నరసరావుపేట ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్ గత మంత్రివర్గంలో పౌరసరఫరాశాఖ మంత్రిగా పనిచేశారు. కృష్ణారెడ్డి సోదరుడు కాసు ప్రసాదరెడ్డి హైదరాబాద్ లోని బేగంపేటలో ప్రతిష్టాత్మకమైన నేత్ర వైద్యశాల(మ్యాక్సివిజన్) నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈ వైద్యశాల రాష్ట్రంలోనే ప్రముఖ నేత్ర వైద్యశాలగా గుర్తింపుపొందింది. కాసు బ్రహ్మానందరెడ్డి పేరిట ఆయన స్వస్థలమైన నరసరావుపేటలో జూనియర్, డిగ్రీ కళాశాలను నిర్వహిస్తున్నారు.

చూడండి


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved