19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఆకలి సమస్య - ఆహార భద్రత

పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ ప్రసంగించినప్పుడు జాతీయ ఆహార భద్రత చట్టం తీసుకొస్తామని వాగ్దానం చేశారు. గ్రామీణ ప్రాంతంలోని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం లేక గోధుమలు కిలో 3 రూపాయల చొప్పున నెలంతా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) తాలూకూ ప్రపంచ ఆకలి సూచిక(వరల్డ్ హంగర్ ఇండెక్స్)లోని 88 దేశాలలో భారతదేశం 66వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆహర భద్రత చట్టం తీసుకురావడం తప్పనిసరి. అయితే ఈ ప్రతిపాదితచట్టం, ఆకలి బారిన పడుతున్న అసలు వ్యక్తులకు ప్రయోజనం చేకూరుస్తుందా అన్నది ఆలోచించాల్సిన విషయం. జాతీయ ఆహార భద్రత చట్టం తేవాలని కాంగ్రెస్ ప్రగాఢంగా వాంఛిస్తోంది. కాగా ఈ చట్టంలో లొసుగులు ఉన్నాయన్నది కొందరు విశ్లేషకుల, నాయకుల వాదన.

ఎవరు పేదలు?

అసలు పేదలను గుర్తిస్తున్న తీరే అసమంజసంగా ఉంది. ప్రస్తుతం మన దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న(బిలో పావర్టీ లైన్ - బీపీఎల్) వారి సంఖ్య6.5 కోట్ల కుటుంబాలు ఉన్నట్లు తెలుస్తోంది(ప్లానింగ్ కమీషన్ లెక్కలలో). వారిలో అంత్యోదయ కుటుంబాలు 2.5 కోట్లు. అంత్యోదయ కుటుంబాలంటే పేదల్లో పేదవారు, సబ్సిడీకి అర్హులైన వారు అని చెప్పుకోవచ్చు. దారిద్ర్యాన్ని అంచనా వేయడానికి సురేష్ టెండూల్కర్ కమిటీని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతంలో రోజుకు రూ. 11.80, పట్టణ ప్రాంతంలో రోజుకు రూ. 17.80 సంపాదిస్తున్న వారినే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిగా గుర్తిస్తున్నారు. మిగితా అందరినీ దారిద్ర్య రేఖకు ఎగువ ఉన్నవారిగా గుర్తిస్తున్నారు. అసంఘటిత రంగంపై అంచనావేసేందుకు ఏర్పాటు చేసిన అర్జున్ సేన్ గుప్తా కమీషన్ భారత దేశంలో 77 శాతం మంది ప్రజలు(పెద్దలు) రోజుకు రూ. 20 కంటే ఖర్చు చేసే స్థితిలో లేరని అంచనా వేసింది. ఇదిలావుండగా, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి గుర్తింపు కార్డులు ఇవ్వడంలోనూ అవకతవకలు జరుగుతున్నాయి. అవినీతి చోటు చేసుకుంటోంది. ఆహార భద్రత చట్టం ఈ వాస్తవాలని పరిగణలోనికి తీసుకుంటుందా అనేది ప్రశ్నార్ధకం!

ఉన్నది పోయే అవకాశం!

నేడు దేశ వ్యాప్తంగా అంత్యోదయ కుటుంబం కిలో రూ.2 చొప్పున 35కిలోల గోధుమలు పొందేందుకు అర్హమైనది. అంటే ఆ కుటుంబం నెలకు రూ.70 చెల్లించి 35కిలోల గోధుమలు పొందవచ్చు. ఒకవేళ ఆహార భద్రత చట్టం అమలయితే కేవలం 25కిలోల ధాన్యానికి గానూ ఖర్చు రూ. 75కు పెరుగుతుంది. అంటే అంత్యోదయ కుటుంబాలకు భారమే అవుతుంది. ప్రస్తుతం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు సగటున కిలో రూ. 4.50 చొప్పున 35 కిలోల ధాన్యం పొందుతున్నారు. మొత్తం ఖర్చు రూ. 157.50; అదే కొత్త ఆహార భద్రత చట్టం అమాలైతే, లభించే 25 కిలోలకు రూ.75, ఆపై అవసరమయ్యె 10కిలోలకు అదనంగా ఖర్చు చేయవలసి వస్తుంది. హీన పక్షం కిలో 10 రూపాయలుగా గణించినా అది మునుపటి ఖర్చుకంటే అధికం. (రూ. 10 x 10 = రూ. 100 + 75 = 175 > 157.5). ఆంధ్రప్రదేశ్‌లో 80 శాతం జనాభాకు ప్రజా పంపిణీ వ్యవస్థ(పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం - పీడీఎస్)ద్వారా కిలో 2 రూపాయల చొప్పున తలా 6 కిలోలు, కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి, ఇస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం అన్ని కుటుంబాలకు కిలో ఒక రూపాయి చొప్పున 16 నుంచి 20 కిలోల బియ్యం ఇస్తోంది. తమిళనాడులో యూనివర్సల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం అమలవుతోంది. ఈ పథకాలతో పోలిస్తే ఆహార భద్రత చట్టం వల్ల వచ్చే లాభం ఏపాటిదోతేట తెల్లమవుతుంది.

అన్నీ వున్నా...!

పేదరికాన్ని మరో కోణంలో లెక్కించడానికి ప్రమాణం వారికి లభించే పౌష్టికాహారం. ప్రపంచంలో అత్యధిక మంది పౌష్టికాహార లోపానికి గురవుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో పౌష్టికాహార లోపానికి గురవుతున్నవారి సంఖ్య అధికంగా ఉందని "స్టేట్ ఆఫ్ ఫుడ్ ఇన్‌సెక్యూరిటీ ఇన్ ద వరల్డ్ - 2007"(ప్రపంచ ఆహార అభద్రత పరిస్థితి) నివేదిక తెలిపింది. అందులో 65శాతం మంది భారత్, చైనా, కాంగో(జైయిర్), బంగ్లాదేశ్, ఇండోనెషియా, పాకిస్థాన్, ఇథియోపియాలోనే ఉన్నారు. అయితే, ఆఫ్రికా దేశాలలోనే పౌష్టికాహార కొరతను ఎదుర్కొంటున్న వారి సంఖ్య అధికం.

మన దేశానికి వస్తే, ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త ఉత్సా పట్నాయక్ వేసిన లెక్కల ప్రకారం 2004-05నాటికి గ్రామాల్లో 87శాతం 2400 కేలరీలనిచ్చే ఆహారం కూడా అందుబాటులో లేదు. జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం ప్రతి వ్యక్తి రోజూ 2400 కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలి. కానీ గ్రామాల్లో 49శాతం, పట్టణాలలో 53 శాతం మంది అన్ని కేలరీల ఆహారం తినలేక పోతున్నారు. ఆదాయం లేకపోవడమే దీనికి కారణం. ప్రపంచ సగటు కేలరీలు 2718, అభివృద్ధి చెందిన దేశాల సగటు కేలరీలు 3206 వర్ధమాన దేశాల సగటు కేలరీలు 2573కాగా, మనదేశంలో వర్ధమాన దేశాల సగటు కేలరీల కంటే తక్కువగానే వినియోగిస్తున్నారు.

మన దేశంలో ఆహార భద్రతకు సంవత్సరానికి 20 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలు అవసరమౌతుండగా, భారత ఆహార సంస్థ(ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా -ఎఫ్ సీ ఐ) వద్ద సంవత్సరానికి 62 మిలియన్ టన్నుల నిల్వ ఉంటోంది. అయినప్పటికీ మన దేశంలో 20 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధర ఆధారంగా రైతుల నుంచి పంటను ఎఫ్సీఐ సేకరిస్తుంటుంది. ఇదే రైతులు, రైతు కూలీలు తదితర పేదల ఆదాయాన్ని నిర్ణయిస్తుందన్న మాట. తినటానికి తిండి గింజలు పండినా కూడా 20కోట్ల మంది ప్రజానీకానికి కొనుగోలు శక్తి లేకుండాపోతోంది! అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా తయారయింది పరిస్థితి.

ఇదీ కారణం

ఆహార భద్రతకు ముప్పు ఏర్పడడానికి ప్రధాన కారణం గత 25 సంవత్సరాల్లో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టకపోవడమే. ప్రస్తుతం స్థూల జాతీయాదాయంలో వ్యవసాయ రంగ పెట్టుబడులు 1.9శాతం మాత్రమే.మన దేశంలో వ్యవసాయ రంగం చాలా వరకు ఋతుపవనాలపై ఆధారపడి ఉంది. వానలు తగిన సమయంలో కురియకపోతే ఉత్పత్తి తగ్గిపోతుంది. బోర్లు, పంపు సెట్లు భూగర్భ జలాలను తోడేస్తుండడం వల్ల దేశంలోని 596 జిల్లాల్లోని 264 జిల్లాల్లో భూగర్భ నీటిమట్టం అడుగంటింది. రైతుల సంఖ్య తగ్గి, వ్యవసాయ కూలీల సంఖ్య పెరిగిపోయింది. కానీ వ్యవసాయ రంగంపై ఆధారపడిన జనాభా సంఖ్య అలాగే ఉంది. చాలా మంది రైతులకి వేరే బతికే దారి లేకపోవడం ఇందుకు కారణం. నగరాల్లో టెక్నాలజీ తెలిసిన కార్మికులనే బయటకు పంపించేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతులు వేరే ఏదైనా పని చేసుకుందామని నగరానికి వచ్చినా శ్రమ దోపిడికి గురికాక తప్పదు. కాంట్రక్టు కార్మికునిగా, కూలీ నాలీ చేసుకునే వానిగా బతికినా, మూడు పూటలా సరైన తిండీ కూడా తినలేడు. కుటుంబాన్ని పోషించనూ లేడు. అందుకే చాలా మంది ఇంకా భూమినే నమ్ముకుని గ్రామాల్లో ఉంటూన్నారు. 63శాతం రైతుకుటుంబాలకు భూమే ఆధారం.

వ్యవసాయోత్పత్తి తగ్గితే ధరలు పెరుగుతాయి. పేదల కొనుగోలు శక్తి ఈ ధరల పెరుగుదలను భరించలేదు. దాంతో వారు ఆకలిబారిన పడక తప్పదు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రోత్సాహకాలు ఇచ్చి పంట దిగుబడి పెంచి ఆహార సంక్షోభాన్ని కొంత వరకు నివారించవచ్చు. అలాగే వారికి అందించే కనీస ధరలను పెంచడం ద్వారా రైతాంగానికి రాబడి పెంచి తద్వారా వారి కొనుగోలు శక్తిని పెంచవచ్చు.

90వ దశకంలో సరళీకృత ఆర్ధికవిధానాలతో పుట్టుకువచ్చిన వాణిజ్య సరళితో, జన్యుమార్పిడి పంటలతో ఆహార సంక్షోభం తీవ్రమయింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ద్వారా పారిశ్రామిక దోపిడి పెరిగింది. మన దేశంలో చేసే వ్యవసాయం ఖర్చులో 50శాతం వీటికోసమే ఖర్చయిపోతోంది. రైతాంగాం పరాధీనమయ్యింది. అనవసర ఖర్చుల కారణంగా రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు అనేకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగితా ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణా, రాయలసీయ ప్రాంతాలలో వ్యవసాయం గడచిన 10సంవత్సరాల కాలంలో తీవ్రమైన ఆటుపోట్లకు, సంక్షోభానికి గురయ్యింది. రాష్ట్రంలోని మెదక్, మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఆకలి చావులు సంఘటనలు వెలుగు చూశాయి.

ఆహార భద్రత, తిండి గింజల ధరలపై ప్రభావం చూపుతున్న మరో అంశం ఆహార ధాన్యాలపై ఫ్యూచర్స్ ట్రేడింగ్. పెట్రోలియం వంటి ఇంధన వనరులు,ఇతర ఖనిజ వనరులు ఇత్యాది వస్తువలలో ప్రారంభమైన ఈ కమోడిటీ ట్రేడింగ్ ఆహార పదార్ధాలలో కూడా నేడు జరుగుతోంది. రాబోయే పంటకు నేడే ధర కట్టి ముందుగా కొనుగోలు చేయడం, వాటి క్రయ విక్రయాల ద్వారా లాభం పొందడం ఫ్యూచర్స్ ట్రేడింగ్ లక్షణం. వస్తువుల ధరలలో హెచ్చు తగ్గులను కొనుగోలు దారుకి, అమ్మేవానికి నష్టం తగ్గించడానికిఅవతరించిన ఈ వ్యవస్థలో, నేడు స్టాక్ మార్కెట్ల లాగానే వ్యాపారులు కాని సామాన్యులు సైతం క్రయ విక్రయలు చేయవచ్చు. ఇందువల్ల కూడాఆహార ధాన్యాల ధరలు పెరిగి, ఆకలి బారిన పడుతున్నవారి సంఖ్య పెరుతోందన్న వాదన ఒక వర్గం వాదన కొంత కాలంగా బలం పుంజుకుంటోంది. ఫ్యూచర్స్ ట్రేడింగ్ నిలిపివేయాలని ఈ వర్గం వాదిస్తోంది.

ఏది ఏలా ఉన్నా ఆహార భద్రత, ఆకలి ఆలోచించి పరిష్కరించాల్సిన అంశాలు. ప్రపంచమంతా ఉన్న ఈ సంక్షోభ నివారణకు కృషి చేయాలి. మన దేశంలోనూ తగు చర్చలు చేపట్టాలి.

ఇంకా


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved