19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

అందరికీ అందుబాటులో బ్యాంకింగ్ సేవలు

ఆర్బీఐ డిప్యుటీ గవర్నరుగా కె. సి. చక్రబర్తి

డా కమలేష్ చంద్ర చక్రబర్తి (కె. సి. చక్రబర్తి) - ఇప్పుడు దేశ అత్యున్నత బ్యాంకులో నలుగురు డిప్యుటీ గవర్నర్లలో ఒకరు. ఆర్బీఐ లో కొత్త ముఖమే అయినా, బ్యాంకింగ్ రంగంలో కె. సి. చక్రబర్తి పాత దిగ్గజం. గత సంవత్సరం, డిసెంబరు 2008లో వి. లీలాధర్ గారి పదవీ విరమణ అనంతరం, ఆ స్థానంలో వీరి నియమకం ఊహించిందే అయినా, ఆయన రాకతో దేశ సెంట్రల్ బ్యంక్ నుంచి కొన్ని ఆసక్తికరమైన విధాన మార్పులను ఆశించవచ్చు.

చక్రబర్తి గారు మొదటినుంచీ కుడా ఫైనాన్సియల్ ఇన్‌క్లూజన్‌కు ప్రాముఖ్యతను ఇస్తూ వచ్చారు. దేశంలో 60% జనాభాకి ఇంకా బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవు అనేది ఆయన తరచూ చెప్పే విషయం. అయితే ఫైనాన్సియల్ ఇన్‌క్లూజన్‌కై ఆయన ఎజండాలో ఉన్న విషయాలు మాత్రం ప్రైవేటు బ్యాంకులకు వణుకు పుట్టిస్తాయి. రానున్నది చాలా గడ్డుకాలమని ప్రైవేటు బ్యాంకర్లు అనధికారికంగా భయం వ్యక్తంచేస్తున్నారు.

చక్రబర్తిగారు స్వతహాగానే తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే వ్యక్తి. ఆయనతో సంభాషించడానికి పాత్రికేయులు సైతం ఉత్సాహంగా ఉంటారు. పబ్లిక్ రంగ బ్యాంకుల సామర్ధ్యం పెంచడానికి కన్సాలిడేషన్ అత్యవసరమని చెబుతూనే, దానికి సమయం ఇదికాదు అని బాహాటంగా చెప్తారు. "కన్సాలిడేషన్ కన్నా ఫైనాన్సియల్ ఇన్‌క్లూజన్‌ ఇంకా ముఖ్యమైనది. అందుకని, ఇంకో ముణ్ణాలుగేళ్ళ తరువాత వీటి విలీనం గురించి ఆలోచించవచ్చు" అంటారాయన.

శాఖలు

ఆర్బీఐ డిప్యుటీ గవర్నరుగా ఆయన పర్యవేక్షించబోయే విభాగాలు చాలానే ఉన్నాయి. అందులో కస్టమర్ సర్వీసులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రూరల్ ప్లానింగ్ మరియు క్రెడిట్, అర్బన్ బ్యాంకులు ఉన్నాయి. రూరల్ ప్లానింగ్ మరియు క్రెడిట్ విభాగమే గ్రామీణ, వ్యవసాయ, చిన్నతరహా పరిశ్రమలకు రుణ సదుపాయ విధానాలను నిర్ణయించి పర్యవేక్షిస్తుంది. గ్రామీణ రుణ ప్రణాళికలను, ప్రయారిటీ సెక్టార్‌లోని రుణ విభాగాల పనితీరును నిర్దేశించడం ద్వారా ఆయన తన ఫైనాన్సియల్ ఇన్‌క్లూజన్‌ ఎజెండాను ముందుకు తీసుకువెళ్ళడానికి చాలా ఆస్కారం ఉన్నట్టు భావించవచ్చు.

విజయాలు

చక్రబర్తి గారికి బెనారస్ హిందూ యూనివర్సిటీ వారి గోల్డు మెడల్ కంఠాభరణమైతే, స్టాటిస్టిక్స్‌లోని డాక్టరేట్ ముంజేతి స్వర్ణకంకణం. ఆయన 1978లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్లానింగ్ ఆఫీసరుగా తన బ్యాంకింగ్ రంగ ప్రస్థానాన్ని ప్రారంభించి, 26ఏళ్ళలో వివిధ బ్యాంకింగ్ శాఖలలో పనిచేశారు. శరవేగంతో ఉన్నత పదవులకు ఎదుగుతూ చివరకి ఛీఫ్ ఎక్జిక్యూటివ్ హోదాలో, 2001-04 మధ్యకాలంలో యూకే కార్యకలాపాల బాధ్యతలు నిర్వహించారు. ఆపై 2004లో పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీయన్బీ) ఎక్జిక్యూటివ్ డైరెక్టరుగా ఎదిగారు. అటుపిమ్మట, 2007లో బలహీన బ్యాంకుగా గుర్తించబడిన ఇండియన్ బ్యాంక్‌కు, సిఎండీగా ఐపీఓకు సారధ్యం వహించి రూ.782కోట్లు సాధించిపెట్టారు. అదే సంవత్సరం జున్‌లో తిరిగి పీయన్బీ సీఎండీ అయ్యారు. ఆయన యాజమాన్య దక్షతలోనే 2008 సెప్టెంబరులో నెలకొన్న ఆర్ధిక సంక్షోభ గడ్డుకాలంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ గట్టెక్కడమే కాకుండా, ముందుకు సాగి, మార్చి 2009కి నికర లాభంలో 51%శాతం వృద్ధిని నమోదుచేసుకుంది.

తన సుధీర్భ బ్యాంకింగ్ రంగ అనుభవంలో ఇటువంటి ఎన్నో విజయాలు సాధించిన చక్రబర్తి గారు ఆర్బీఐలో కూడా ప్రభావవంతమైన ఫలితాల సాధించగలరనడంలో సందేహం లేదు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved