19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

రక్తప్రసరణను శాస్త్రీయంగా వివరించిన విలియం హార్వే

By డి, హనుమంతరావు

ప్రాచీన కాలం నుండి ప్రాణం రక్తంలో ఉండేదని విశ్వసించేవారు. అందుకే జంతువుల మాంసం కన్నా వాటి రక్తాన్ని స్వీకరించడం పాపంగా భావించేవారు. అయితే ఆ రక్తం ఎలా ప్రసరిస్తుంది, దాని గమనం ఎలా ఉంటుంది, అన్న విషయాలు చాలా కాలం వెలుగులోకి రాలేదు. గాలెన్, ఆండ్రియస్ వెసాలియస్ లు కొంత మేరకు ప్రయత్నించారు. శాస్త్రీయంగా రక్తప్రసరణను వివరించిన తొలి వ్యక్తి విలియం హార్వే .

విద్య - వైద్యం - రక్తం

హార్వే ఇంగ్లాండ్ లోని కెంట్ (ఫోక్ స్టోన్)లో 1578,ఏప్రిల్-1న జన్మించాడు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదివాడు. యూరప్ లో నాడు ప్రతిష్టాత్మకంగా భావించే పాడౌ విశ్వవిద్యాలయం నుండి మెడికల్ డిప్లమో పొందాడు. 1609లో సెయింట్ బర్తలోమియా హాస్పిటల్ లో వైద్యుడిగా చేరాడు. చక్రవర్తి జేమ్స్-1 ఆస్థాన వైద్యుడిగా నియమించబడి చార్లెస్-1 వరకు కొనసాగాడు. ప్రాణం మూలాలు తెలుసుకోవాలని చేసిన ప్రయత్నాలు రక్త ప్రసరణ వైపు మరలాయి. రక్త ప్రసరణ గురించి అప్పటికి ఉన్న సమాచారం అసమగ్రంగా అనిపించింది. అందుకే స్వయంగా ఎన్నో జంతువులను కోసి పరిశీలించాడు. మానవుల శవపరీక్షలను అధ్యయనం చేశాడు. వివిధ చికిత్సా రీతులను పరిశీలించాడు. చివరిగా గుండె కొట్టుకోవడం, అక్కడి నుండి రక్తం పంప్ చేయబడటం, శరీరపు రక్తం ఊపిరితిత్తులకు అనుసంధానం కావడం వంటి అనేక విషయాలను కనుగొన్నాడు. రక్త ప్రసరణకు గుండె పంపువలె పనిచేయడం కారణమని తెలుసుకొన్నాడు. తన పరిశోధనా ఫలితాలను 'ఎనాటమికల్ ఎక్సర్సైజ్ కన్సర్నింగ్ ద మోషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ బ్లడ్ ఇన్ ఏనిమల్స్ ' అనే గ్రంథం(1628) ద్వారా వెలువరించాడు.

హార్వే రక్తప్రసరణ వ్యవస్థకు గుండె కారణమని చెప్పినా, గుండెకు రక్తం ఎలా ప్రసరిస్తుందో ఆయన చెప్పలేకపోయాడు. దానిని ఇటలీ శాస్త్రవేత్త మెర్సిలో మాల్ఫీజీ తరువాత కనుగొనడం జరిగింది. హార్వే పరిశోధనా ఫలితాలు వైద్యశాస్త్ర పురోగతికి ఎంతగానో తోడ్పడ్డాయి. ఎందరో మానవశరీరంపై పరిశోధించడానికి స్ఫూర్తిగా నిలిచిన హార్వే లండన్ లో 1657 జూన్ 3వ తేదీన మరణించాడు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved