19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

శ్రీశ్రీ - ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఒక మైలురాయి

కవితా సంప్రదాయాన్ని మార్చి, సాహిత్య క్షేత్రంలో ఋతుపరివర్తనం తెచ్చే రచయితల నందరినీ కలవరపరిచే సమస్యలను పరిష్కరించడానికి చేసే యుద్ధపరంపరలే శ్రీశ్రీ రచనలు. శ్రీశ్రీలో సర్వజన ప్రియమైన కొన్ని అద్భుత శక్తులున్నాయి. ఎంతటి తీవ్ర విమర్శకుడైనా మెచ్చుకోక తప్పని సంవిధాన చాతుర్యం, వైవిధ్యం, వైయక్తికమైన బాణి శ్రీశ్రీకి స్వార్జితమైన ఆస్తి. మామూలు మాటలకు ప్రాణం పోసి బరువులేని బలంతో, మరుగులేని స్వచ్ఛతతో, కరువులేని శిల్పంతో పలకడంవల్ల ప్రతి మాటా, ప్రతి ఊహా మనస్సును గట్టిగా పట్టుకుంటుంది. అగ్గిపుల్లనో, అరటితొక్కనో, హారతి పళ్ళాన్నో- దేన్నైనా సరే కవితామయంగా చేసే స్పర్శవేది శ్రీశీకి తెలుసు. శ్రీశ్రీ వ్రాసిన ప్రతి రచనలోను ఛందో వైవిధ్యం, ఉక్తి వైచిత్ర్యం కనిపిస్తుంది.

1933 ప్రాంతాలలో శ్రీశ్రీ కవిగా, సంపూర్ణవ్యక్తిత్వంతో, సామాజికచైతన్య ప్రతినిధిగా బయటపడ్డాడు.శ్రీశ్రీ ఒక్కడే ఆనాడు సామాజిక సమస్యలను జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులతో సమన్వయించి తెలుగులో ప్రగతిశీలమైన వీరవాణితో సామాజిక విప్లవానికి పురోగామిగా సాహిత్య విప్లవం సాగాలన్న దృఢసంకల్పంతో తన గొంతుక వినిపించాడు. విప్లవశక్తులలో విభజన కూడదు. అందరూ ఏకం కావాలి. అందరూ నడుంకట్టి ముందుకు నడవాలి. అలసులు వెనకపడితే పడనీ, మనం ముందుకు పోదాం. “పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైపైకి” అని 1934 లో సామాజిక చైతన్య ప్రతినిధిగా శ్రీశ్రీ తన విప్లవవాణితో, దేశాన్ని మహాప్రస్థానానికి ప్రబోధించాడు.(అది రాసేనాటికి ఆయన వయస్సు 24 ఏళ్ళే!) ఆ ‘మహాప్రస్థానం’ సాహిత్యరంగంలో మొదట జరగాలన్న ప్రయత్నంచేసిన ఉద్యమనాయకుని కీర్తి శ్రీశ్రీకి దక్కింది.

భావకవిగా కృష్ణశాస్త్రి ఆనాటికే ఒక వెలుగు వెలిగి ఆరిపోతున్నాడు. విశ్వనాథ, రాయప్రోలు మొదట జాతీయోద్యమ ప్రభావంతో స్పందించి దేశభక్తి ప్రేరితాలైన రచనలు చేసినా, అ తరువాత తరువాత మరోరకమైన రచనా పద్ధతి అవలంబించారు. ఆ పరిస్థితిలో ప్రజల ఆకాంక్షకు రూపమిచ్చి శ్రీశ్రీ తన కవితను ప్రజాయత్తం చేయడానికి ముందుకొచ్చాడు. తమ వాంఛలనే శ్రీశ్రీ బలమైన భాషలో పలికే సరికి ప్రజలతనిని గొప్ప కవిగా అంగీకరించారు.

మార్క్సు సిద్ధాంత ప్రభావం శ్రీశ్రీకి జీవితాన్ని విమర్శించే విచారదృష్టినీ, సమాజ పరిస్థితుల వెనకాల ఉండే అగాధ నిగూఢ రహస్యాలను అవగతం చేసుకొనే శక్తినీ ప్రసాదించింది. వ్యధార్థ జీవిత యధార్థ దృశ్యాలు పునాదులుగా భావివేదాలు అవతరిస్తాయని శ్రీశ్రీ అంటాడు. వాటి జీవనాదాలే తన రచనలని చెప్పుకొన్నాడు.

శ్రీశ్రీ స్వప్రతిభను, స్వశక్తినీ చాటుకున్న గీతాలు కొన్ని చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. శ్రీశ్రీ కావించిన స్వశక్తి ప్రతిభల స్వచ్ఛందగానములో కూడా సామాజికశక్తి ప్రచ్ఛన్నంగా అంతర్వాహినిగా ప్రవహిస్తుంది.‘ఉన్మాది’, ‘భిక్షువర్షీయసి’, ‘ఆకాశదీపం’ వంటి కొన్ని పద్యచిత్రాలలో శ్రీశ్రీ చిన్నమాటలతో పెద్ద వర్ణచిత్రాన్ని నిర్మిస్తాడు. మాటలను వీలైనంత పొదుపుగా వాడి గొప్ప కావ్యశిల్పాన్ని రూపొందించగల సామర్థ్యానికి ఈ రచనలు మచ్చుతునకలు.

శ్రీశ్రీ రచనలలో ఎక్కువ ప్రచారానికి రానిదీ, శిల్పదృష్టిలో మిక్కిలి అందంగా ఉన్నదీ ‘కవితా! ఓ కవితా!’ ఇది యువరచయితలను కొందరిని బాగా ఆకర్షించిందే కానీ సామాన్య సాహితీప్రియుల మనస్సు నెక్కువగా చూరగొనలేదు. రచనలోని అస్పష్టత కొంత దానికి కారణం కావచ్చును.

శ్రీశ్రీ కొన్ని రచనల్ని తెలుగుభాష ఎరగని పద్ధతిలో నిర్మించవచ్చును. విచిత్ర రూపాలు కట్టవచ్చును. ప్రతి ఉపమా కొత్తగా స్ఫురించవచ్చును. కాని సంప్రదాయ వైఖరి ఎక్కడా దెబ్బతినదు. ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను’ అన్న గేయములో సమిధ శబ్ద ప్రయోగమే కవి వెనకాల ఉన్న యుగయుగాల సంప్రదాయాల స్మృతిని నిరూపిస్తోంది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved