19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

కొండల్లా కేసులు - కరువైన జడ్జీలు

By జి, శివ కుమార్

చట్టబద్ధ సంస్థలు, శాసన వ్యవస్థ, రాజ్యాంగ బద్ధ సంస్థలు విధి నిర్వహణలో పూర్తిస్థాయిలో సంతృప్తికరంగా పనిచేయకపోవడం కేసుల సంఖ్యకు కారణమౌతోంది. పెండింగ్ కేసులకు న్యాయమూర్తుల కొరత కూడా ఒక ప్రధాన కారణం. న్యాయమూర్తుల పదవుల భర్తీలో కూడా పాలకుల నిర్లక్షం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.

న్యాయమూర్తుల కొరత

2008 జనవరి నాటికి దేశంలోని మొత్తం 21 హైకోర్టుల్లో 284 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సుప్రీంకోర్టులో నాయమూర్తుల సంఖ్యను కేంద్రం గత ఏడాది 30కి పెంచింది. ఇప్పటికీ సుప్రీం కోర్టులో ఖాళీలు ఉన్నాయి. మన దేశంలో ప్రతి పది లక్షలమందికి 50మంది న్యాయమూర్తులు ఉండాలని "లా కమీషన్ " సూచించినప్పటికీ అది అందులో 10.5 శాతానికి మించడంలేదు. అదే అమెరికాలో ప్రతి పదిలక్షలమందికి 107 మంది, కెనడాలో 75మంది, బ్రిటన్‌లో 51మంది న్యాయమూర్తులు ఉన్నారు. ప్రస్తుత అవసరాలకు 10వేల అదనపు కోర్టులు కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కే.జీ.బాలకృష్ణన్ ఒక సందర్భంలో చెప్పారు. ప్రస్తుతం 15వేల దిగువ స్థాయి(సబార్డినేట్) న్యాయస్థానాలు ఉన్నాయి. వీటిల్లో 13,800న్యాయస్థానాల్లో మాత్రమే తగినంత సిబ్బంది ఉన్నారు.2008 ఆఖరు నాటికి దిగువ స్థాయి న్యాయస్థానాల్లో 3.58కోట్లు, హైకోర్టుల్లో 36లక్షలు, సుప్రీంకోర్టులో 49వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

న్యాయమూర్తులకు లభిస్తున్న వేతనాలు ఏమాత్రం ఆకర్షణీయంగా లేవన్నది చేదు నిజం. దీంతీ సమర్ధులైన న్యాయవాదులు న్యాయమూర్తులుగా వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆర్ధిక సంస్కరణలు, ప్రపంచీకరణ నేపధ్యంలో యువత కూడా న్యాయవిద్యపై దృష్టి సారించడం లేదు. ఇంజనీరింగ్, మెడిసిన్, సాఫ్ట్‌వేర్ కార్పొరేట్ కోర్సులపై నవతరం ఆసక్తి చూపుతోంది. దీంతో న్యాయ విద్యాకోర్సులకు పెద్దగా ఆదరణ లభించడం లేదు. ఎక్కడా సీటు రానివారు న్యాయకోర్సుల్లో చేరుతున్నారన్న విమర్శల్లో వాస్తవం లేకపోలేదు. ఈ కోర్సుల్లో చేరుతున్న వారంతా ఇదే రంగంలో కొనసాగుతున్నారా అంటే అదీ లేదు. మధ్యలో ఇతర అవకాశాలపై దృష్టి పెడుతున్నారు. ఫలితంగా సమర్ధులైన న్యాయవాదులు రావడం లేదు. దీంతో పాటూ, సమర్ధులైన న్యాయవాదులు అరకొర వేతనాలుగల న్యాయమూర్తుల పదవులకు దూరంగా వెళుతున్నారు. పాలకులు ఈ వాస్తవాన్ని గ్రహించాలి.

ఆర్ధిక సంస్కరణలు, ప్రపంచీకరణ, ప్రజల్లో తమ హక్కుల పట్ల పెరుగుతున్న చైతన్యం, కొత్త చట్టాల నేపధ్యంలో న్యాయ విద్యాకోర్సులకు ఆదరణ పెరుగుతుందని, ఈ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు విస్తృతమౌతున్నాయని నిపుణులు చెబుతున్నారు. "న్యాయ విద్య పట్టా పుచ్చుకున్న యువత వాణిజ్య సంస్థల ఉద్యోగాల వెంట పరుగుతీస్తుండటంతో నాణ్యమైన న్యాయమూర్తుల కొరత ఏర్పడుతోందని" సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కె.జి. బాలకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. క్రింది న్యాయస్థానాల్లో కేసులను వేగంగా పరిష్కరించేందుకు కేంద్రాన్ని ఆదేశించాలంటూ ఒక స్వంచ్చంధ సంస్థ దాఖలు చేసిన ప్రజా హిత వ్యాజ్యం విచారణ సందర్భంగా 2008 ఏప్రిల్ 15న న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ న్యాయ నిపుణుడు జనతా పార్టీ హయాంలో కేంద్ర న్యాయ మంత్రిగా పనిచేసిన శాంతి భూషణ్ ఈ కేసులో వాదించారు. ప్రతిభాశీలురైన న్యాయవాదులు న్యాయమూర్తులుగా పనిచేసేందుకు సిద్ధంగా లేకపోవడంతో దాదాపు 3000 ఖాళీలను భర్తీ చేయలేకపోతున్నారని ఆయన తెలిపారు.

అప్పీళ్ళ పర్వం

పెండింగ్ కేసులకు మరో కారణం అప్పీళ్ళు. అప్పీళ్ళ విషయంలో న్యాయస్థానాలు ఉదారంగా వ్యవహరిస్తున్నందువల్ల కేసులు కొండల్లా పేరుకుపోతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. పలు కేసుల్లో ప్రభుత్వమే వాది - ప్రతివాదులుగా ఉండటం విశేషం. బ్రిటీష్ కాలంనాటి చట్టాలను నేటికీ అనుసరిస్తుండటం కూడా కేసుల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తోంది. ప్రాధమిక స్థాయిలో కేసుల విచారణకు వర్తించే సివిల్ ప్రొసీజర్ కోడ్ (సిపిసి), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్‌పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు , ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసి) తదితర చట్టాలు బ్రిటీష్ కాలంనాటి చట్టాలు. నాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రూపొందించినవి. వందేళ్ళ తరువాత కూడా వాటినే అనుసరిస్తున్నాం. ఈ శతాబ్దంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా చట్టాలను సవరించాల్సిన అవసరం ఉంది.

కార్య నిర్వాహక వ్యవస్థ పాత్ర

ప్రజస్వామ్య మూల స్తంబాలలో ఒకటైన "ఎక్జిక్యూటివ్" బ్రాంచి (కార్య నిర్వాహక వ్యవస్థ) విధానాలు, వివిధ సందర్భాల్లో ప్రజల సమస్యలు ఇబ్బందుల పట్ల ఉదాసీన వైఖరీ, కేసుల పెరుగుదలకు దోహదపడుతోంది. కింది స్థాయిలో అధికారులు సమస్యలను సక్రమంగా పరిష్కరించినా, చట్టపరమైన విధి విధానాలను తు.చా. తప్పకుండా పాటించినా సామాన్యుడు న్యాయస్థానం తలుపు తట్టాల్సిన అవసరం రాదు. కార్య నిర్వాహక వ్యవస్థ ద్వారా న్యాయం లభించనప్పుడు ఆఖరి ప్రత్యామ్నాయంగా మాత్రమే బాధిత వ్యక్తులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. నానాటికి పెరుగుతున్న చట్టాలు కూడా న్యాయస్థానాలపై భారం మోపుతున్నాయి. ప్రతి పార్లమెంట్, అశెంబ్లీ సమావేశాల్లో అనేక కొత్త చట్టాలు రూపుదాలుస్తున్నాయి. అవసరం లేకపోయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో పాలకులు కొత్త చట్టాలు తీసుకువస్తున్నారన్న విమర్శలు బలంగా ఉన్నాయి.

అక్షరాస్యత పెరగడంతో ప్రజల్లో తమ హక్కుల పట్ల చైతన్యం పెరుగుతోంది. అన్యాయాన్ని మౌనంగా భరించడమనే విధానాన్ని విడనాడుతోంది. హక్కులను సాధించుకోవడానికి అన్యాయాన్ని అక్రమాలను నిలదీశేందుకు పలువురు న్యాయస్థానాలకు వెళుతున్నారు. కేసుల పెరుగుదలకు ఇదొక కారణం. అయితే ఈ చర్య అభిలషణీయం. ఆహ్వానించ దగ్గదీ. చట్టబద్ధ సంస్థలు, శాసన వ్యవస్థ, రాజ్యాంగ బద్ధ సంస్థలు విధి నిర్వహణలో పూర్తిస్థాయిలో సంతృప్తికరంగా పనిచేయకపోవడం కేసుల సంఖ్యకు కారణమౌతోంది. అదే సమయంలో రాజ్యాంగంలోని మూడు ప్రధాన వ్యవస్థల్లో ఒకటైన న్యాయవ్యవస్థపై ఇప్పటికీ ప్రజల్లో విశ్వాసం వుండటం వల్ల న్యాయం కోసం వారు ఎదురుచూస్తున్నారు. పెండిగు కేసులను ఈ కోణంనుంచి చూడాలని న్యాయవ్యవస్థ వాదిస్తోంది.ఇంకా

న్యాయవ్య(అ)వస్థ

ఇవీ పరిష్కారాలు


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved