19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

బూర్గుల రామకృష్ణారావు

burgula ramakrishna rao

హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు.

విద్యాభ్యాసం/గౌరవ పట్టాలు

మహబూబ్ నగర్ జిల్లా, తలకొండపల్లి మండలం లోని పడకల్ గ్రామంలో రంగనాయకమ్మ, నరసింగరావు దంపతులకు 1899 మార్చి 13న బూర్గుల జన్మించారు . ఆయన అసలు ఇంటిపేరు పుల్లంరాజు కాగా, స్వగ్రామమైన బూర్గుల పేరుతోనే ప్రసిద్ధికెక్కారు రామకృష్ణరావుగారు. హైదరాబాదు లోని ధర్మవంత్ పాఠశాలలోను, నిజాం కాలేజీలో చదువుసాగింది. పూనా (పుణె) ఫెర్గుసన్ కాలేజీలో బి.ఏ.చేసి ఆపై బొంబాయి విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి. పట్టాపుచ్చుకున్నారు. తరువాతి కాలంలో ఆయనకు 1953లో ఆంధ్ర విశ్వవిద్యాలయం అయనకు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ గౌరవపట్టాను ప్రదానం చేసింది. 1956లో ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లాస్ అనే పట్టాను ఇచ్చింది.

రాజకీయ జీవితం

1923లో హైదరాబాదులో న్యాయవాద వృత్తి ప్రారంభించి అగ్రస్థాయికి చేరుకున్నారు బూర్గుల. ఆ రోజుల్లోనే ఆయన రాజకీయ ప్రవేశం జరిగింది ఆంధ్రోద్యమం , గ్రంథాలయోద్యమం , భూదానోద్యమం మొదలైన వాటిలో బూర్గుల రామకృష్ణ పాల్గొన్నారు. శాసనోల్లంఘన ఉద్యమం లోను, క్విట్ ఇండియా ఉద్యమం లోను పాల్గొని కారాగారవాసం అనుభవించారు.మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి మొదలైన వారితో కలిసి పనిచేసారు. కృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం కు అధ్యక్షునిగా, కార్యదర్శిగా పనిచేసారు. హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు ఏర్పాటులో బూర్గుల ప్రముఖ పాత్ర వహించారు. 1931లో నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్రమహాసభ కు బూర్గుల అద్యక్షత వహించారు. 1948 లో పోలీసు యాక్షన్ ద్వారా నిజాం రాష్ట్రం స్వతంత్ర్య భారతంలో కలిసింది. అప్పుడు ఏర్పడిన హైదరాబాదు రాష్ట్ర సైనిక ప్రభుత్వంలో(వెల్లోడి క్యాబినెట్‌లో) ఆయన రెవిన్యూ, విద్యాశాఖల మంత్రిగా పనిచేశారు.1952లో మొదటిసారి హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికలు జరిగాక ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో భాషా ప్రయుక్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడేవరకూ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తరువాత ఆయన కేరళ రాష్ట్రానికి గవర్నరుగా వెళ్ళారు. 1960 వరకు కేరళ గవర్నరు గా పనిచేసి, తరువాత 1962 వరకు ఉత్తర ప్రదేశ్ గవర్నరు గా పనిచేసారు.

సాహితీవేత్తగా

బూర్గుల రామకృష్ణారావు బహుభాషావేత్త,సాహితీ వేత్తకూడా చిన్నతనంలో తండ్రి వద్దే తెలుగు, ఉర్దూ, పర్షియన్, ఇంగ్లీషు భాషలు నేర్చుకున్నారు. మహారాష్ట్రలో చదువుకునే కాలంలో మరాఠీ నేర్చుకున్నారు.పారశీక వాఙ్మయ చరిత్ర ఆయన రచనలలో పేరు పొందినది. జగన్నాథ పండితరాయల లహరీపంచకము , శంకరాచార్యుల సౌందర్యలహరి , కనకధారాస్తవము లను తెలుగులోకి అనువదించారు. కృష్ణ శతకం, సంస్కృతంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శారదస్తుతి, గౌరీస్తుతి, వాణీస్తుతి, లక్ష్మీస్తుతి, శ్రీకృష్ణాష్టకం మొదలైనవి ఆయన ఇతర రచనలు.

1912లో బూర్గుల రామకృష్ణ గారి వివాహం జరిగింది. ఆమె 1920లో మరణించడంతో, 1924లో మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు.

బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది, బూర్గుల రామకృష్ణారావుగారు 1967 సెప్టెంబర్ 14న మరణించారు .


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved