19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

తెలుగు సాహిత్యంలో స్వర్ణయుగం

By కె, మణినాథ్

2009ని నూరేళ్ళ కధా సంవత్సరంగా జరుపుకుంటునాం. ఈతరుణంలో మరిన్ని సాహితీ కుసుమాలు తమ సుగంధ పరిమళాలను విరజిమ్మాలి. ఇటీవల తురగాజానకిరాణి అధ్యక్షతన నూరేళ్ళ తెలుగు కధానిక-రచయిత్రుల పాత్ర పై జరిగిన సదస్సులో వ్యక్తమైన అభిప్రాయాలను చక్కగా కూర్చి కె.మణినాథ్ మనకందించారు.

నేడు కాలం మారుతోంది. పుస్తకాలు చదివే తీరుబాటు తక్కువ వుంటోంది.చదువులు ఉద్యోగాల వేటలో సమయం ఉండటంలేదు. కధలు, నవలలు చదవటానికి మనస్ధితి ఉండాలి. లింగ బేధం ఉండదు రచనలకి. భాష, భావ ప్రకటన ఒకటే.... కధ రాయటానికి ఒక తపన, ఒక రచయిత కధలు రాయాలనే తపన లోపల్నించి ళ్ళగించుకురావాలి. ఊపిరాడని తనం. అంత ఉత్సాహం, అంత ఊపిరి,రాయకపోతే తోచని స్ధితి. ఆస్ధితిలో రాయాలి కధ.... కధలు రాయటం ఎవరూ నేర్పరు. కధరాయాలనే తపన ఉండాలని తప్ప.

మొదలైందిలా

తొలి కధ మొదలై నూరేళ్ళు నిండాయి.1909 లో గురజాడ అప్పారావు గారి కధ దిద్దుబాటు తో ఆరంభమైన కదా పరంపరలో రచయిత్రుల పాత్ర కూడా ప్రధానమైనదని చెప్పాలి. బండారు అచ్చిమాంబ గారి కధ స్త్రీ విద్య మొదటి కథ అని అంటుంటారు తెలుగు సాహిత్యంలో మహిళల పాత్రల గురించి. తరువాత కనుపర్తి వరలక్ష్మమ్మ గారు, ఇల్లిందల సరస్వతీదేవి గారు వంటి ఎందరో తొలి తరం రచయిత్రుల రచనలతో తెలుగు సాహిత్యంలో స్వర్ణయుగం ఆరంభమయిందని చెప్పవచ్చు. నాలుగు దశాబ్దాలుగా, ఉత్తుంగ తరంగంలా తెలుగు సాహిత్యాన్ని ముంచి తేల్చారు స్త్రీలు. వంటింటి రచనలని అవహేళన చేశారు కొందరు. కాని వంటిల్లు ఇంటికి మూల స్తంభం! ఇంటిని, సమాజాన్ని బాధ్యగా తీర్చి దిద్దే రచనలు చేశారు రచయిత్రులు.ఇతర భాషలలో లేని రచయిత్రులు తెలుగులోనే అధిక శాతం ఉన్నారు. రచనలు ఎలా రాసినా మానవతా భావంతో రాశారు. కుటుంబ సమ్యసలు, వ్యక్తికగత సమస్యలు, అన్ని భావాలు మానవతా భావంలోనే వున్నాయి. స్త్రీ వాదం, దళితవాదం.. రకరకాల వాదాలున్నాయి.ఏవాదాలయినా రకరకాల రచనలు చెయ్యాలి రచయిత్రులందరూ. కానీ స్త్రీలను ఆదరించేవారు, ప్రోత్సహించేవారు తక్కువ! మూడో తరం రావాలి. మంచి రచనలు చేసి సువర్ణాధ్యాయాన్ని ముందు తరానికి అందించాలి.. సాహిత్యాన్ని నిలపాలి అందరూ....ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టకూడదు.

కథావస్తువు...శైలి....

స్త్రీల పాత్ర తెలుగు కధా వికాసంలో చాలా అనన్యమైనటువంటిది. తొలితరం వారిలో కనుపర్తి వరలక్ష్మమ్మ గారు..విశాలాక్షి గారున్నారు. వారి దృక్పధం ఆధ్యాత్మిక, నైతిక విలువలని కాపాడటం కథా రచన ద్వారా తెలియచేయాలని! కథానిక శిల్ప ప్రధాన శైలి పరంగా రచన చేస్తున్నా..అంతర్‌ లయగా ఒక నీతి ధ్వనించేటట్లు....ఉత్తమ మానవతా విలువలకి పరిరక్షణకి ఏది అవసరమో అది రచిస్తూ...ఆ విషయమైన అధ్యాత్మిక నైతిక పరమైనటువంటి విలువలు పాటిస్తూ....సమాజం,కుటుంబం వంటివి విచ్ఛత్తి కాకుండా చూడాలి.... కధాంశం నేపధ్యం చూసినప్పుడు సామాజిక పరమైన నియమాలుంటాయి, వాటిని ఉల్లంఘించకుండా రచన ఉండాలి. అలనాటి కధల్లో ఆ నియమాలు పాటిస్తూ రచన సాగేది. ఆర్తి ఉండేది; అందుకే ఆనాటి కధలు నిలిచి వున్నాయి. తెలుగులో ఆంధ్ర ప్రభ పత్రిక రచయిత్రుల రచనలద్వారా పాఠకులని పెంచింది. స్త్రీలయెక్క పఠనాశక్తి పెరిగింది.రాగ ద్వేషాలకతీతంగా చూస్తే రచయిత్రుల సంఖ్య పెరిగింది. ఆనాటి రచయిత్రులు పాఠకుల సంఖ్యని పెంచారు. మాలతీచందూర్ గారి ప్రశ్నలు జవాబులు , లత గారి ఊహాగానం మొదలైనవారి రచనలద్వారాను, పత్రికల ప్రోత్సాహంతోను తెలుగు జాతికి మేలు జరిగిందని గుర్తించాలి. ఎందుకంటే పాఠకుడు ఆ శీర్షిక నిర్వహిస్తున్న రచయిత్రి మాలతీ చందూర్ గారిని తమ సమస్యల పరిష్కారం సూచించే ఆత్మీయురాలిగా భావించే వారు.

ఇక యద్దనపూడి సులోచనారాణి గారు కథల ద్వారా పాఠకులని పెంచారు. వారి కథలు తెలుగు కథానికల్లో ఒక మలుపు. ప్రేమ కథలు, కథానాయకురాలి కున్న ఆత్మాభిమానం, పట్టుదల, ఇంకా ఎన్నో మంచి గుణాలు కలిగిన ఆపాత్రలు అందరిని ఆకట్టుకునేవి. ఎందరో కన్నె పిల్లల ఊహానాయికలు వారు. ఇలా ఆనాటి ఎందరో రచయిత్రులు పాఠకుల మనసు దోచుకున్నారు. ఒక స్వర్ణయుగంగా ఉండేది సాహిత్యం.

నేటి కథకు వస్తే...

నేటి రచయిత్రులు కూడా జీవితాలని రాసే స్ధితిలో వున్నారు. కధల్లో బలం కూడా వుంటోంది. రచయిత్రుల్లో మూడోతరం వాళ్ళు వుధృతంగా రాస్తున్నారు. కధానిక తీరు తెన్నులు మారాయి. రెండు పదాలు కనపడుతున్నాయి. గాఢత, సాంద్రత వుంటున్నాయి.

నేడు కధలలో సాత్విక మానసిక సంఘర్షణ, సమాజంలో ఉండే సమస్యలు, బాధలేకాదు...ఏ సమస్యలు గురించి రాసినా కధలలో రచయితలు చెప్పింది కర్టెక్టేనా కాదా అని చూడాలి. అవి సమర్ధంగా చెప్పగలగారా లేదా అని చూడాలి. స్త్రీలు, వాళ్ళ కష్టాలని, అనుభవిస్తున్న హింసని, అణచివేతని రాయడం ద్వారా చాలా చక్కగా బయటికి వచ్చిన మాట నిజమే. కాని కధాంశాలలో చాలా విషయాలుంటాయి.గొప్ప కధలు ఇలా వుంటాయి - అలా వుంటాయి అని గిరిగీసుకుని రాయటం సమంజసం కాదు. చూడగలిగిన విషయాల్లో కధలో శిల్పం చూడాలి. రచయితలు కధలు రాసేటప్పుడు తోచింది రాయకుండా, మంచి అధ్యయనం అవగాహన చేసుకుని రాయాలి .

పూర్వకాలంలో కధావస్తువుల కోసం పుస్తకాలమీద ఆధారపడేవాళ్ళు. ఆరోజుల్లో కధలు చదివి తృప్తి పడేవాళ్ళు. కాని నేడు అలాతృప్తి పడలేక పోతున్నారు. నేటి వారికి కధావస్తువులు చాలా వుంటున్నాయి. శిల్పం బాగుంటుంది అన్నీ బాగుంటున్నాయి. కాని ఆనాటి కధల్లో వుండే ఆత్మీయత అనురాగాలు, ఆర్ద్రత కనపడటం లేదు.కథ సమాజాకి దర్పణం పడతాయి. సమాజంలో జరిగేది రచయితలు ముందు తరాలవారికి అందించడమే ధ్యేయంగా పెట్టుకుని సమస్యలని పాఠకుల ముందు వుంచాలి. మంచి రచనలను ముందు తరాల వారికి అందించాలి. అందుకు విరివిగా రచనలు రావాలి. నేడు ఇంగ్లీషు లేకుండా తెలుగు మాట్లాడలేక పోతున్నారు. నేటి కధల్లో ఇంగ్లీషు వాక్యాలే వుంటున్నాయి. కాలానుగుణంగా మారింది భాష. నిజంగా అసూయలు కక్ష్యలు, కార్పణ్యాలు కాకుండా వాస్తవానికి సంబంధించిన కధలు రావాలి.

మరుగున పడుతున్న తెలుగు సాహిత్యానికి పూర్వ వైభవం తీసుకురావాలి. పుస్తకాలు చదవడం ద్వారా విఙ్ఞానం పెరగడమే కాదు సమస్యలు వచ్చినపుడు పరిష్కరించుకునే ఆలోచనా ధోరణి పెరుగుతుంది. లోకం తీరు తెన్నులు తెలుస్తాయి . తెలుగుకి ప్రాచీన భాష హోదా కల్పించడం ద్వారా రచయిత (త్రు)లందరూ తిరిగి తెలుగు రచనలు కొనసాగించి సాహిత్యానికి పూర్వ వైభవం తీసుకు రావాలి.

2009ని నూరేళ్ళ కధా సంవత్సరంగా జరుపుకుంటున్న ఈతరుణంలో మరిన్ని సాహితీ కుసుమాలు తమ సుగంధ పరిమళాలను విరజిమ్మాలి.

(నోట్: ఇటీవల జరిగిన నూరేళ్ళ కధా సదస్సులో జరిగిన రచయితల అభిప్రాయాల ఆధారంగా రచించిన వ్యాసం ఇది.)


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved