19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

21వ శతాబ్దంలో మన తెలుగు తల్లి - వెయ్యరా వీర తాడు!

By , బామ్మగారు

'మాయాబజార్ ' ఎంత అద్భుతమైన సినిమానో కదర్రా ! ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ప్రతి ఒక్క పాత్ర ఎంత అద్భుతంగా మలిచారో ! వారందరూ ధన్యజీవులు.

సినిమాలో చిన్నమయ్య ( రమణారెడ్డి ) తన సహచరులకు, శత్రు - మిత్ర చరిత్ర జ్ఞానం బోధిస్తూ "పాండవులు అస్మదీయులు అంటే ’మనవాళ్ళు’" అని పాఠం చెప్పి తిరిగి చెప్పమంటాడు.జంబూకు అస్మదీయులు అనటానికి నాలిక తిరగదు. అందుకని ’అసమదీయులు’ అంటూ, "ఎందుకీ గోల - ఆ మాటతో మనవాళ్ళే అని తెలుసుకుంటాం నాయకా!" అంటాడు.

"పాండిత్యం కంటే జ్ఞానం ముఖ్యం. వేసుకో వీరతాడు." అంటాడు ఘటోత్కచుడు ఆనందంగా.

పాండవులు అసమదీయులయితే - కౌరవులు కానివాళ్ళు అన్న అర్ధంతో "కౌరవులు తసమదీయులు" అనే పదాన్ని లంబు పుట్టిస్తాడు.

"ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి. వెయ్యి వీడికీ రెండు వీరతాళ్ళు." అంటాడు తిరిగి ఘటోత్కచుడు.

హాస్యంగా వున్నట్లనిపించే ఈ సంభాషణలో ఎంత అర్ధం వుందో చూడండి. అలా అవసరానికి పుట్టిన పదాలు భాషలో మిళితమై భాషను పునర్జీవింప చేస్తాయి.

కొన్నాళ్ళ క్రితం కృష్ణా జిల్లాలోని భట్టిప్రోలులోతెలుగు భాషకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయట. దాన్నిబట్టి తెలుగు ఎంతటి ప్రాచీన భాషో గుర్తించవచ్చునట. అక్కడ లభించిన ఆధారాలు యిప్పటి మన వాడుకలో వున్న తెలుగు భాష తరహాలోదని భావిస్తే పప్పులో కాలేసినట్లే కదా! అంతదాక ఎందుకూ? ఆదికావ్యమైన మహాభారతాన్ని నన్నయ్య గారు వ్రాశారు. మన తొలి తెలుగు నవలా రచయిత వీరేశలింగం గారు 'రాజశేఖర చరిత్ర' ను తెలుగులోనే వ్రాశారు. ఎంత తేడా?!

దానికీ, దీనికీ సామీప్యతా?!

అది పద్యం - ఇది గద్యం.

అది కావ్యం - ఇది నవల.

దానితో దీన్ని పోల్చటం ఏమిటని ఆవేశపడకండర్రా. మలి తెలుగు నవల 'మాలపల్లి ' ఉన్నవ లక్ష్మీనారాయణ గారిదీ తెలుగే. ఆలోచనలు రేపుతూ అర్ధమయ్యీ, అర్ధం కానట్లుండే 'చలం రచనలు '... అవీ తెలుగులోనే వున్నాయి. ఇహ విశ్వనాధ వారి తెలుగు వైభోగం చెప్పటం నాతరమా?! అడవి బాపిరాజు గారి 'నారయణరావు ' కళ్ళ ముందు కదిలే తెలుగు సినిమాయే ! హృదయాన్ని పిండే బుచ్చిబాబు గారి 'చివరకు మిగిలేది ' తెలుగువారి హృదయం నుండి జాలువారే తెలుగు కన్నీటి చుక్కే ! గోపీచంద్ గారు ఆంధ్రదేశంలోని 'అసమర్ధుని జీవనయాత్ర 'ను తెలియ పరచిందీ తెలుగులోనే! ఆద్యంతం అత్యద్భుతంగా సాగే తెలుగువారి తెలుగుతనపు 'అతడు - ఆమె ', ఉప్పల లక్ష్మణరావు గారి రచన, చిందించినదంతా తెలుగు వెలుగులే. చదువరిని చదివించే కొడవటిగంటి వారి 'చదువు ' కూడా తెలుగే నర్రా!!

ఇలా తెలుగు భాష, గంగలా కొండలూ - గుట్టలూ, వాగులూ - వంకలూ ఉరుకుతూ, దూకుతూ కులుకులతో హొయలు కురిపిస్తూ నేటికీరూపాన్ని సంతరించుకుంది.

తెలుగమ్మకు మార్పులు కొత్త గాదు. మార్పుతోనే మనుగడని తెలియందీ కాదు. 'భాష భావి తరాలకు పునాది బాట' అయినప్పుడు మారుతున్న శాస్త్ర దృక్పథానికి అనుగుణమైన సాంకేతిక పదజాలాలను, ఇంగ్లీషు పదాలను వున్నవాటిని వున్నట్లుగా తెలుగు భాషలోకి చేర్చుకుంటే తప్పేమిటీ?! - చెప్పండర్రా. సాంకేతిక పరిజ్ఞానం అప్పుడే కదా అందరికీ అందుబాటులోకి వచ్చేదీ!!

పి.సీ లతో కుస్తీపడుతున్న ఈ కంప్యూటర్ యుగంలో 'ఇన్ బాక్స్ ( inbox)'అంటే తెలియని వారుండరు. దీనికి తెలుగులో పదం పుట్టలేదు. నిజం చెప్పాలంటే తెలుగు పదం లేదు. దీనికి తెలుగు పదం పుట్టించాల్సిన అవసరమేముందీ?! 'ఇన్ బాక్స్'ని యథాతథంగా వాడుకలో వుంచితే అసలు తప్పేమిటంటా?!

అలాగే కంప్యూటర్ ప్రపంచానికి అవసరమైన మరోపదం 'యూజర్స్ ( users)' . దీనికోసం కొంతమంది కష్టపడి 'వాడుకరి ' అని సృష్టించారు. అంత కష్టపడవల్సిన పని వుందా?! పత్రికలలో కూడా భాటకము, మూల్యాంకనము - లాంటి పదాలను ఇంగ్లీషునుండి తెలుగులోకి అనువదించి చదువరులను గాబరా పెట్టకపోతే, వాటి ఇంగ్లీషు పదాలను యథాతథంగా వుంచితే నష్టమేమిటీ? దానివల్ల తెలుగు తల్లిని కించపరచినట్లు భావించటం అవివేకమేమో ననిపిస్తుంది. ఎందుకు చెబుతున్నానంటే తెలుగు వెబ్ సైట్లలోను, దిన వార పత్రికలలోను శాస్త్ర - సాంకేతిక ఇంగ్లీషు పదాలను యథాతథంగా తెలుగు భాషలో మిళితం చేస్తే మీలాంటి 'యువత'కు దగ్గరవ్వటానికి మాలాంటి బామ్మలకూ అవకాశమేర్పడుతుందని నా ఆశ.

అంతే కదర్రా! లేకపోతే, మేమెప్పుడూ మీకు దూరంగా వుండిపోవల్సిందే కదర్రా!!

గమనిక: ఈ బామ్మగారి పెజీలోని భావాలు బామ్మగారివి మాత్రమే. ఎపి ఆల్‌రౌండ్ ఆ భావాలను సమర్ధిస్తున్నట్లుగా భావించరాదు. బామ్మగారికి మీ అభిప్రాయాలను bamma AT ap allround DOT com కు పంపగలరు. (ATను @ గా, DOTని చుక్కగా మార్చి, అంతా ఒకేపదంగా కొట్టండి)

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved