22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

సినిమా పిచ్చి బాబాయి

"ఛీ...ఛీ... ఇవేం సినిమాలు...వాళ్ళకసలు బుద్ధుందా....జ్ఞానముందా...చూసేవాళ్ళు - వెర్రిముండాకొడుకులు - అనుకొంటున్నారా!! అంతంత టిక్కెట్టు పెట్టుకుని వెడుతుంటే యిల్లాంటి సినిమాలా తీసేది?! " అని బాబాయి తెగ ఆవేశపడిపోయాడు. "ఆ హీరో వెధవకి నోటినుండి శుద్ధంగా - శుభ్రంగా ఒక్కముక్క పలికిచావదు. నోరుతెరిస్తే అసభ్యమైన మాటలే. స్నేహితుడితో ఎలా మాట్లాడాలో..... విలన్‌తో ఎలా మాట్లాడాలో ...... తండ్రితో ఎలా మాట్లాడాలో తెల్సిచావని వెధవ హీరోనా !!.....తండ్రిని పట్టుకొని - సెల్లో పడేసి కుమ్మెయ్యాలి నిన్ను - అనే కొడుకూ ఒక కొడుకేనా?! "......ఇలా ఆ రోజంతా ఆసినిమాను, ఆసినిమా తీసినవాళ్ళనూ, ఆ సినిమాని చూసినవాళ్ళనూ....చివరికి తనని తానూ తిట్టుకుంటూ, అరుచుకుంటూ తెగ ఆవేశ పడిపోయాడు.

ఆవేళ మాత్రం బాబాయిని చూసి నేను తెగ భయపడిపోయాను. ఈ సినిమాపిచ్చితో ఏ బి.పీ కోలోనై - ఆ గుండె ఎక్కడ ఆగిపోతుందోనని !!అందుకే మరునాడు బాబాయితో - ఎదురుపడి మాట్లాడకుండా - తప్పించుకు తిరిగాను. అయినా బాబాయే "రాత్రి ఫలానా సినిమా చూసొచ్చానే అమ్మాయి" అని మొదలు పెట్టాడు.

"ఇలా తీసి ఛస్తున్నారేమిటే యీ సినిమావాళ్లు.....భర్త పోయినప్పుడు ఆచారాల పేరిట స్త్రీలకు జరిపే ( దు ) సాంప్రదాయాలను ఎవరైనా ఖండించాల్సిందే. ముఖ్యంగా యువత. దాన్నెవరూ కాదనరు. భర్తపోయి తల్లేడుస్తుంటే, 'బంగారు గాజులు లేవనేగా యీ దురాచారం. నేను బంగారు గాజులు తెస్తాను' అనటం.... వెళ్ళిన పని మర్చిపోయి ఏవేవో చేయటం.... ఏమిటమ్మాయ్ యిది?! లక్షలు, కోట్లూ ఖర్చుపెట్టి సినిమాలు తీసేది - నీతులు చెప్పటానికా - అంటున్నారుట దర్శక నిర్మాతలు.... నీతులు చెప్పటానికి కాకపోతే, మూతులు నాకటం చూపటానికా?....అహ నాకు తెలియక అడుగుతానూ... మూతులు నాకటం చూపించటానికాంట?....సినిమా చూడందే కాపురంచేయటం రాదని ఏ గాడిదకొడుకంటాడో అనమను....నాముందు అనమను! వ్యాపార దృక్పధమే సినిమా లక్ష్యంట! సినిమాకు సామాజిక బాధ్యత లేదుట! సినిమాలు చూసి ఎవ్వరూ చెడిపోరట! వీళ్ళనెవ్వరూ నిలదీసి అడగలేరనేగా వీళ్ళ ధీమా?! " అని బాబాయి ఉద్రేక పడుతుంటే "అంతలా ఆవేశపడకు బాబాయ్." అని నేను సర్దబోయాను.

నామాట చెవిలో పడీపడకముందే "ఆవేశం కాకపోటే ఏమిటమ్మాయ్....ఏ త్రాష్టపు ఆలోచన నీ బుర్రలోకి వస్తే, దాన్ని నువ్వు తెరమీదకెక్కిస్తే సరిపోతుందా?! నువ్వు చెప్పూ...అఁహా...సరిపోతుందా?! " అన్నాడు బాబాయ్.

" మీరెందుకండీ మరి అట్లాంటి సినిమాలు చూడటం....అదీ జిహ్వ చంపుకోలేనట్లు ప్రతిరోజూ, ప్రతీ సినిమా....ఆఁ !! మీలాంటి వాళ్ళు చూస్తుండబట్టే...వాళ్ళూ యిలాంటి సినిమాలు తీస్తున్నారు...తీయగలుగుతున్నారు. చూడటం మానెయ్యండి. చూశేవాళ్ళనూ ఆపి, వాళ్ళల్లో చైతన్యం తీసుకురండి.....దెబ్బకు దిమ్మతిరిగి తీసేవాళ్ళూ తీయటం మానేస్తారు." అన్నారు మాఆయనగారు.

అంతే ! ఆ మాటలకు బాబాయికి ఎన్నడూ రానంత కోపమొచ్చింది. శివమెత్తినట్లు ఒక్కవుదుటున లేచి, "ఇదిగో అబ్బాయ్! నువ్వు మర్యాదగా మాట్లాడటం నేర్చుకో ! నా సంగతి నీకేం తెలుసుననీ !! నీ యింటి కొచ్చాగదా అని నీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతావా?! ఇదిగో నిన్నే ఆపెట్టె తీసుకురా...ఈ యింట్లో ఇక ఒక్క క్షణముండను. " అని పిన్నిని కేకేసి.....

"నాలాంటి వాళ్ళు చూస్తూండబట్టి యిలాంటి సినిమాలు వస్తున్నాయా....అతనికసలు మెడకాయ మీద తలకాయ వుండే ఆమాట అంటున్నాడా? .... నాలాంటి వాళ్ళు చూస్తుండబట్టే యిలాంటి సినిమాలు తీసున్నారుట....నేనేమన్నా యిలాంటి సినిమా తీయమని చెప్తున్నానా... వాళ్ళేమైనా యిలాంటి సినిమా తీస్తున్నామని ప్రకటనలిస్తున్నారా?!....ఇదిగో యీ సినిమా కథ యిది. యిలా సినిమా తీస్తున్నాం... అని వాళ్ళు ముందే చెపితే, నేను చూట్టం మానేస్తాను....చూశాక కదా అది ముష్టి సినిమాయో, వీర ముష్టి సినిమాయో నాకు తెలుస్తోంది. వాళ్ళను ముందే చెప్పమను ఎలాంటి సినిమానో ! వాళ్ళు ముందు చెపితే నేనూ చూడటం మానేస్త్తాను. అంతేగానీ...." అంటూ ఆపై నేను ఎంత బ్రతిమలాడి ఆపుచేద్దామని ప్రయత్నించినా బాబాయి ఆగకుండా పిన్నిని తీసుకుని వెళ్ళిపోయాడు.

బట్టలుపెట్టి ఘనంగా సాగనంపుదామనుకున్న నాకోరిక - బాబాయ్ పట్టుదలతో - తీరనే లేదు.

" ప్చ్.... పిచ్చిబాబాయ్ "

నేను కూడా బాబాయిని 'పిచ్చిబాబాయ్' అనేసుకున్నందుకు కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగితే పమిట కొంగుతో కళ్ళు తుడుచుకున్నాను.

గమనిక: ఈ బామ్మగారి పెజీలోని భావాలు బామ్మగారివి మాత్రమే. ఎపి ఆల్‌రౌండ్ ఆ భావాలను సమర్ధిస్తున్నట్లుగా భావించరాదు. బామ్మగారికి మీ అభిప్రాయాలను bamma AT ap allround DOT com కు పంపగలరు. (ATను @ గా, DOTని చుక్కగా మార్చి, అంతా ఒకేపదంగా కొట్టండి)
పేజి   123 |      

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved