19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

మాడభూషి అనంతశయనం అయ్యంగార్ - రెండవ లోక్ సభ స్పీకర్

తన ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ప్రజాజీవితంలో న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, స్వాతంత్ర్య సమరయోధునిగా, పేరెన్నికగన్న శాసనకర్తగా, సభాపతిగా, విద్యావేత్తగా, గవర్నరుగా ఇలా వివిధ పాత్రలలో అనేక సేవలనందించిన వ్యక్తి కీర్తిశేషులు మాడభూషి అనంతశయనం అయ్యంగార్.

అనంతశయనం అయ్యంగార్ తిరుపతి పక్కన తిరుచాణూరులో 1891 ఫిబ్రవరి 4న జన్మించారు. ఉన్నతపాఠశాల విద్యవరకు తిరుపతి దేవస్థానం హైస్కూల్‌లో చదువుకున్నారు. ఆ తరువాత పైచదువులకు మద్రాసు వెళ్ళారు.మొదట బి.ఎ ఆపై 1913లో మద్రాసు 'లా' కాలేజీ నుండి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. 1912లో కొంతకాలం గణిత ఉపాధ్యాయునిగా పనిచేసిన ఆయన 1915లో లాయరుగా ప్రాక్టీసు మొదలు పెట్టారు. అమోఘమైన తన జ్ఞాపక శక్తితో "వాకింగ్ డైజెస్ట్ ఆఫ్ కేస్ లాస్" గా పేర్గాంచారు. చిత్తూరు నగరం బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఆయన పనిచేశారు.లాయరు వృత్తి కేవలం సంపాదనకు మార్గం కాదని నమ్మిన వ్యక్తి అనంతశయనం అయ్యంగార్; న్యాయ వ్యవస్థలో మార్పులు తేవడంపై ఎంతో ఆసక్తిని కనబరిచేవారు ఆయన. పరాయిపాలనలో, కేవలం బ్రిటీషు పద్దతులకు కొనసాగింపుగా ఉన్న న్యాయ వ్యవస్థను భారతీయ అవసరాలకు, జీవన శైలికి అనుగుణంగా మార్చి మెరుగుపరచడానికి కృషిచేశారు.

స్వాతంత్ర్య పోరాటం - సాంఘీక ఉద్యమాలలో

చిన్నతనంలోనే ఆయన స్వాతంత్ర్యోద్యమం వైపు ఆకర్షితులయ్యారు. గాంధీ మహాత్ముని పిలుపు మేరకు సహాయ నిరాకరణోద్యమంలో పాల్పంచుకున్నారు. 1921-22మధ్య కాలంలో తన న్యాయవాద వృత్తిని పక్కనబెట్టారు. 1940-44 మధ్య కాలంలో ఆయన మూడు సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. 1940లో వ్యక్తి సత్యాగ్రహంలో పాలుపంచుకున్నందుకుగాను ఆయన జైలుపాలయ్యారు. తిరిగి 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కారగార వాసం అనుభవించారు.ఆనాటి జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యనాయకులలో ఒకరిగా గుర్తింపు పొందారు.

సాంఘిక దురాచారాలైన అస్పృశ్యతను అంతమొందించడానికి అనంతశయనం అయ్యంగార్ ఎంతో కృషిచేశారు. హరిజనులకు దేవాలయ ప్రవేశం, వారి సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి ఆయన కృషిచేశారు. మానవాళి ఐక్యతకు కట్టుబడిన వ్యక్తి ఆయన. మతం మనిషికీ - మనిషీకి మధ్యన బేధాలను రూపుమాపి, సౌభాతృత్వాన్ని పెంపొందించే సాధనమని నమ్మిన సెక్యులర్ వాది.

శాసన కర్తగా, సభాపతిగా

అనంతశయనం అయ్యంగార్ అనేక ఎన్నికైన పదవులలో పనిచేశారు. 1922లో చిత్తూరు మునిసిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఆ చిన్న స్థాయిలో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం లోక్‌సభ స్పీకరుదాకా సాగింది. స్వాతంత్ర్య పోరాట కాలంలో కౌన్సిళ్ళ బహిష్కరణ ముగిసిన తరువాత 1934లో "కేంద్ర శాసనసభ (సెంట్రల్ లెజిస్లేటివ్ అశెంబ్లీ" కు ఎన్నికయ్యారు. తన తర్కంతో, వాక్పటిమతో, విషయ పరిజ్ఞానంతో అనతికాలంలోనే సభలో గుర్తింపు పొందారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటీషువారిని తిప్పలు పెట్టిన జర్మనీ సబ్‌మెరీన్ "ఎండెన్" లాగా శాసనసభలో అయ్యంగార్ బ్రిటీష్ వారిని ఇబ్బందిపెట్టేవారని ప్రతీతి.

తరువాతి కాలంలో, దేశ స్వాతంత్ర్యం వస్తున్న రోజుల్లో "కాంస్టిట్యుయెంట్ అసెంబ్లీ" లో , ఆతరువాత "ప్రొవిజనల్ పార్లమెంటు" లో జి.వి. మావలంకర్ సభాపతిగా ఉండగా, అయ్యంగార్ ఉప-సభాపతిగా పనిచేశారు. మొట్టమొదటి పార్లమెంట్ అంచనాల కమిటీ (1950) అధ్యక్షునిగా పనిచేశారు. 1952లో తిరుపతి నుండి ఆయన భారత దేశ మొదటి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1956లో మావలంకర్ మరణానంతరం ఆయన సభాపతిగా ఎంపికయ్యారు. 1957లో రెండవ లోక్‌సభలో కూడా స్పీకరుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకరుగా అనంతశయనం అయ్యంగార్ నిర్ణయాలు న్యాయశాస్త్రంలో పటిమను, రాజకీయ దృష్టిని, శాసన సభ నియమ నింబంధనలపై ఆయనకుగల గౌరవాన్ని కనబరుస్తాయి. ఆయన తీసుకున్న నిర్ణయాలు నేడు పార్లమెంటరీ వ్యవహారాలు, పనితీరుకు నియమాలుగా నిలిచాయి. 1960 టోక్యోలో జరిగిన ప్రపంచ దేశాల 49వ "ఇంటర్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌" కు హాజరైన భారత బృందానికి ఆయన నాయకత్వం వహించారు.

1962లో ఆయన లోక్‌సభకు మూడవసారి ఎన్నికైనప్పటికీ, రాజీనామా చేసి బీహారుకు గవర్నరుగా వెళ్ళారు. మూడు దశాబ్దాలపాటు ఆయన శాసన కర్తగా తన సేవలను అందించారు

రాజకీయ జీవితంలోకాక అనంతశయనం అయ్యంగార్ విద్యావేత్తగా కూడా తన సేవలను అందించారు. తత్వశాస్త్రంలో, వివిధ మతాలకు సంబంధించిన శాస్త్రాలలో, భారతీయ విషయ శాస్త్రంలో, సంస్కృత భాషా సాహిత్యంలో ఇలా అనేక విభాగాలలో ఆయన ఎంతో పాండిత్యం కలవారు. భారత సంస్కృతిని, సంస్కృత భాషను ప్రచారం చేయడంలో ఆయన ఎంతో ఆసక్తిని కనబరిచేవారు. శ్రీ వేంకటేశ్వర పత్రికకు ఆయన సంపాదకులుగా ఉన్నారు. తిరుపతిలోని సంస్కృత విద్యా పీఠం ఆయన కృషి ఫలితమే. తన 87వ ఏట, 19 మార్చి, 1978న అనంతశయనం అయ్యంగార్ పరమపదించారు. ఆయన సంస్మరణార్ధం 2007లో తిరుపతి నగరంలో నిలువెత్తు కాంస్య విగ్రహం ప్రతిష్టించబడింది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved