17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

సామాజిక న్యాయం

By , బామ్మగారు

కాలమహిమని ఒకటుందర్రా! కాలం కలసివస్తేనే వ్యక్తులకైనా, వక్తలకైనా పేరు ప్రఖ్యాతులొస్తాయి. వాళ్ళాడిన మాటలకు కూడా కొత్త అర్థాలు పుడతాయి. కీర్తీ వస్తుందీ. ప్రచారమూ పెరుగుతుంది. అంతేనర్రా! అంతకంటే ఏమీ లేదు.

"స్వాతంత్రమే నా జన్మ హక్కు " అని తిలక్ మహాశయుడు ఎలుగెత్తి చాటినప్పుడు, గాంధీ మహాత్ముడు "క్విట్ ఇండియా" అని ప్రభోదించినప్పుడు ఆ మాటలకు అంతటి గొప్పదనం ఎందుకొచ్చింది? కాల మహిమ! అదంతా కాలమహిమే!

ఇందిరా గాంధీ "గరీభీ హటావో", ఎన్టీఆర్ "ఆత్మ గౌరవం", భారతీయ జనతా పార్టీ "దేశం వెలిగిపోతోంది" స్లోగన్సు కూడా ఇలాంటివే. అంతదాకా ఎందుకూ, నిన్నటి చంద్రబాబుగారి "విజన్2020", నేటి రాజశేఖర్ రెడ్డిగారి "హరితాంధ్రప్రదేశ్" కూడా ఈ తరహావే! వీటితో పాటూ ఇప్పుడు "సామాజిక న్యాయమనేది" మరోకటి వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఎవరినోట విన్నా సామాజిక న్యాయమనే మాట నానిపోతోంది.

ఈమాట పుట్టింది ఎక్కడనుండీ అని ఆరా తీస్తే మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ నుండీ అని తెలిసిందర్రా! ఇంతకీ సామాజికా న్యాయమంటే ఏమిటర్రా?!! తమ పార్టీలో సామాజిక న్యాయం లేక మరో పార్టీలో చేరాం అంటారు కొంతమంది. టిక్కెట్టు ఇవ్వకపోతే సామాజిక న్యాయం లేదంటున్నారు ఇంకొందమంది. తమ కులం వాడిని రాష్ట్రాధిపతిని చేస్తేనే సామాజిక న్యాయం అంటున్నారు మరి కొంతమంది. సామాజిక న్యాయమంటే ఏమిటో నాకు అర్థమై చావటల్లేదర్రా! దీని జాడ తీద్దామని మా ఆయనగారిని ప్రశ్నిస్తే, ఆయనగారు ఏమిటే చెప్పారు - భారత రాజ్యాంగం సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసిందట; రాజ్యాంగం ఆదేశిక సూత్రాలలో అందరికీ విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలి అని వుందిట. బాల బాలికలకు నిర్భందోచిత ప్రాధమిక విద్య వృధులకు వికలాంగులకు జీవన భృతి, కుల మత జాతి విచక్షణ లేకుండా దేశంలోని ప్రజలందరికీ ఒకే న్యాయం...ఇలా అనేకం రాజ్యాంగం నిర్దేసిస్తూ వీటికనుగుణంగా ప్రభుత్వాలు పాలనా నిర్ణయాలు తీసుకుని పరిపాలన సాగించాలి. ప్రజల ప్రాథమిక హక్కులను రక్షించాలి. ఇవీ మా ఆయనగారు నాకు చెప్పిన జవాబు. మా ఆయనగారికి బొత్తిగా ఏం తెలీదు! పాత కాలం మనిషి.. రాజకీయాలు తెలియవు...పేపరు చదవరు...అందుకే ఆయన గారి మాటలు నేను పట్టించుకోనర్రా! ఈ విషయాన్ని మా బాబాయినడిగి తెలుసుకోవాలనుకున్నాను. మా బాబాయికి అన్నీ తెలుసు. రాజకీయాలంటే ప్రాణం. పేపరు చదవందే నిద్రపోడు. న్యూస్ చూడందే అన్నం ముట్టడు. వయసులో పెద్దవాడు. అన్నీ నిజమే చెబుతాడు. ఆ నమ్మకంతోనే బాబాయిని అడిగాను.

"నో... నో! అలాంటిదేం రాజ్యాంగంలో ఉండి ఉండదు. ఉంటే అవన్నీ ఆనాడే పూర్తి చేసేశారు. మనకు స్వాతంత్ర్యం వచ్చి 60ఏళ్ళు దాటింది. రాజ్యాంగంలో ఉన్నవి నెహ్రూ ఆనాడే మొదలు పెట్టేశాడు. ఇందిరా గాంధీ అప్పుడే పూర్తి చేసేశింది. రాజీవ్ గాంధీ ఎప్పుడో మెరుగులు దిద్దాడు. సోనియా, రాహుల్ గాంధీలు ఏనాడో ప్రచారం చేసేశారు. ఇప్పుడు ఇంకా అవేమీ మిగిలి లేవు" అన్నాడు సీరియస్‌గా.

మా బాబాయి పూర్తిగా కాంగ్రెస్ వ్యతిరేక పక్షి. అది తెలిసీ ఆయన్నడగటం నాదే తప్పని మనసులోనే చెంపలేసుకున్నాను. నా కర్థంగాని సామాజిక న్యాయం నాదగ్గరే ఉండిపోయింది. ఎలా తెలుసుకోవడమాని మనసు గొడవ పెడుతుంటే మా మనవడు గుర్తుకొచ్చాడు. ఎంతైనా ఈ కాలం వాడు! చురుకైన వాడు! అని నిర్ధారణ చేసుకున్నాను. నేనడిగిన ప్రశ్నకు వాడు వెక్కిరింతగా నన్ను చూస్తూ "ఓస్! ఇదికూడా తెలియదా" అని హి.. హి.. హి..అని వెకిలి నవ్వు నవ్వుతూ, "సామాజిక న్యాయం అంటే , హ... హ ..., సామాజిక న్యాయం అంటే..." అని పొట్ట చేత్తోపట్టుకుని ,"సామాజిక న్యాయం అంటే జ్యోతీరావ్ ఫూలే, బాబా సాహెబ్ అంబేద్కర్ అంతే...బామ్మకు ఇది కూడా తెలీదు" అని పొట్ట చెక్కలయ్యేట్లు నవ్వ సాగాడు.

వాడు చెప్పేదేమిటో తెలియక, వెర్రిముఖమేసుకుని చూసే నా బుర్రలో లీలగా "ఈగ" కథ గుర్తుకొచ్చింది....

ఈగ ఒకటి తన ఇల్లు అలుక్కుంటూ తన పేరును మర్చిపోయింది. తన పేరును తెలుసుకోవడానికి పక్కనున్న చెట్టును, ఆచెట్టుకు కట్టిఉన్న ఆవును, ఆవును మేపుతున్న అవ్వను, అవ్వ చంకలోవున్న పిల్లను ఇలా వరసగా అడుగుతూ ఎవరూ నాకు తెలీదూ అంటే నాకు తెలియదూ అనడంతో ఈసురోమంటూ ఇంటికి చేరి తన పిల్లనడిగిందిట.... ఆ ఈగ పిల్ల నవ్వుతూ నీ పేరు ఈగ కదూ అందిట...

సామాజిక న్యాయం అంటే ఇంకా ఏమిటీ నాకు అర్ధంకానట్లే ఉందర్రా...!


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved