19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ప్రేమలు, సమాజం, సినిమాలు: నాడు - నేడు

By , బామ్మగారు

"నీ సుఖమే నేకోరుతున్నా...

నిను వీడి అందుకే వెడుతున్నా నీ సుఖమే నేకోరుతున్నా................."

ఇది పాతసినిమా పాట. అమ్మాయి మనసులో తాను లేనని తెలుసుకొని, తన మనసు అమ్మాయిమీద ఉన్నప్పటికీ తన ప్రేమను, జీవితాన్ని, త్యాగం చేసి దూరంగా ఉండే ప్రయత్నచేయడం.... ఇది త్యాగం.

హీరోయిక్ క్వాలిటీస్‌లో త్యాగం అత్యంత ప్రధానమైనది. త్యాగగుణం అంటే మాటలు కాదు. నిబ్బరం ఉండాలి. నిశ్చయం ఉండాలి. నిగ్రహం ఉండాలి. దీర్ఘకాలిక స్పృహ కలిగి ఉండాలి. క్షణికావేశానికి లోనుకాకూడదు. హీరోయిజం అంటే ఇది! అది చాలా కష్టమైనది.అందుకే ఇదువరకు సినిమాలన్నింటిలో హీరో ఇటువంటి మనోనిబ్బరం కలిగి ఉండేవాడు. ఆవేశానికి గురికాకుండా కష్టాలకోర్చి, ఇంద్రియ నిగ్రహం కలిగి స్వార్ధాన్ని వీడి తల్లిదండ్రులు తోడబుట్టినవారి కోసం పాకులాడుతూ కుటుంబక్షేమానికి తపిస్తుండేవాడు. సినిమా కధాంశాలలో హీరోని ఈ క్వాలిటీస్‌తోనే చూపించేవారు.

ఇప్పుడు, ప్రతి విషయానికి - అది చిన్నదైనాసరే, పెద్దదైనా సరే - కోపంతో ముఖం కందగడ్డలా చేసుకొని, ముఖచర్మం చినిగిపోయేలా ఉద్రేకపడి, పళ్ళు విరిగిపోయాలే కొరికి ఆవేశంతో ఊగిపోతూ, ఎదుటివాణ్ణి చితక్కొట్టి, తాను రక్తం కారేలా చావుదెబ్బలు తిని, చివరకు జైలు పాలై జీవితాన్ని భ్రష్టుపట్టించుకునేవాణ్ణి "హీరో" అంటున్నారు.

నిజజీవితంలో అలాంటివాడిని హీరో అంటారా?

నాకు నువ్వంటే ఇష్టంలేదు మొర్రో అని మొత్తుకుంటున్నా పిల్లను పట్టుకొని "వీల్లేదు నువ్వు నన్నేప్రేమించాల్సిందే! లేదంటే నరికేస్తాను" అని నిండు క్లాస్‌రూమ్‌లో తల నరకడం...ఏమిటిది? ప్రేమించకపోతే యాసిడ్‌ పోస్తానని బెదిరించి మరీ యాసిడ్‌పోసేవాడు ఒకడు. కత్తితో మెడకోసి చంపేవాడొకడు. కత్తిపోట్లతో పొడిచి పొడిచి చంపేవాడు మరొకడు. ఏమిటిదంతా? దీన్నసలు ప్రేమంటారా!? అహా...ఈ ఉన్మాదాన్ని ప్రేమంటారా అని?

ఈ ఉన్మాదానికి కారణాలు ఏమై ఉంటాయి? తల్లిదండ్రుల పెంపకంలో లోపమా? సహవాస దోషమా? నేటి సినిమాలా?

ఇహ ఇప్పటి సినిమాలు..... ఇదేమిటర్రా! ఇలా ఉంటున్నాయి.!!? "నాకు నువ్వంటే అసహ్యం, నువ్వంటే ఇష్టంలేదు ...ఛీ " అని అమ్మాయి ఛీత్కరిసున్నాసరే, "నీకిష్టం లేకపోతే ఏం?- నేను నిన్ను ప్రేమిస్తున్నానుగా" అని వదురుతూ వెంటపడేవాణ్ణి హీరో అంటున్నారు.దీన్ని ప్రేమంటరా?

ఇద్దరి మధ్య ఇష్ట ఏర్పడితేనే ప్రేమ పుడుతుంది. వారినే ప్రేమికులు అంటారు. బలవంతంగానో భయపెడితోనో వచ్చేది ప్రేమగాదు. ప్రేమ ధైర్యాన్నివ్వాలి. ప్రేమ ఆనందాన్ని నింపాలి. ప్రేమ ఇరువురిని కలిపి ఉంచాలి.ప్రేమ జీవితాన్ని నిలబెట్టాలి.

"అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు..."

అని మనకొక చక్కని పాట ఉంది. విన్నారా ఎప్పుడైనా!?

"అదృష్టదేవత తెరిచెను కళ్ళు - అందరికిద్దాం భాగాలు

ఈ కలిమినిచ్చిన దేవుని కాళ్ళకు రోజూ పెడదాం దండాలు

పచ్చగ ఉందాము ముద్దు ముద్దు ముచ్చటగుందాము"

అని ఆ పాట చివరగా వస్తుంది. ప్రేమంటే అది. ప్రేమైనా, పాటైనా, మాటైనా ముచ్చటగా ఉండాలి. ముద్దులొలకాలి. భయభ్రాంతులను చేయగూడదు. మరి ఇప్పుడో....

...ఎత్తుకెడతా నిన్ను పథకమే పన్ని

ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని...

ఇవి నేటి పాటలు....

ఇక మాటల సంగతి - "తొక్కలో " మాటలసంగతి నే చెప్పనవసరం లేదుగా!

ఇవీ ఇప్పటి సినిమాలు!!

చూసేటప్పుడు ఆనందిస్తే ఆనందించవచ్చేమో గానీ వీటి ప్రభావం సమాజంమీద ఎంతగా ఉంటోందో ఒక్కసారి ఆలోచించండి. సమాజం అంటే వేరే ఏదో కాదు. సమాజం అంటే మీరు, నేను, మనమందరమూనూ.

"ప్రేమించటమే నిజమైతే మన్నించుటయే రుజువుకదా"

ఎంతటి గుణసంపద ఉంటే ఈ మాట అనగలరూ! ఇది పాటగా చెప్పిన నిండు నిజం! కాదా!

తల్లిదండ్రులు మన తప్పులు ఎందుకు భరిస్తున్నారు? మన తోడబుట్టిన వారి లోటుపాట్లను మనమెందుకు సహిస్తున్నాం?

ప్రేమ.....ప్రేమ వలన.....ప్రేమ ఉండబట్టి కదా!

కనీసం ఇలాంటి పాతపాటలను వింటూ నైనా ఉండడర్రా! మనసు కరుగుతుందేమో!

కలకానిదీ , విలువైనదీ బ్రతుకు

కన్నీటి ధారలలోనే బలి చేయకు

ఇది పాతపాటే అయినా, నా ఇప్పటి మాట ఇదే.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved