17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

కొత్తసంవత్సరం: సర్వే జనా సుఖినో భవంతు....

By , బామ్మగారు

చిన్నా పెద్దా అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలర్రా! కొత్త సంవత్సరం వచ్చేసింది! మీరందరూ అర్ధరాత్రి వరకూ సంబరాలు చేసుకుని మీ మీ వాళ్ళందరితో శుభాకాంక్షలు పంచుకుని ఆనందించారు కదా! అనందించాల్సిందే నర్రా! "ఆనందో బ్రహ్మ" అన్నారు. మనిషి స్వతహాగా ఆనంద స్వరూపుడు. దుఃఖాన్ని భరించలేడు. సహించలేడు.

దుఃఖం బయటనుండే వస్తుంది. మనం చేసే కర్మల నుండీ దుఃఖం వచ్చి మనకంటుకుంటుంది.

ఏమిటీ వేదాంతం అనుకుంటున్నారు కదర్రా! అవును వేదాంతమే. ఆధ్యాత్మిక బోధ మన కిదే తెలియజేస్తుంది. నిజం! యిదిగో, అలాంటి మన చర్యల వల్ల, నడతల వల్ల 2008 రక్తపుటేరులు చిమ్మి, చేదు అనుభవాలు మిగిల్చి వెళ్ళిపోయింది. ముంబయి నగరాన్ని ముట్టడించిన ముష్కరులు, ప్రేమోన్మాదంతో వరంగల్ కిట్స్ కాలేజీ విద్యార్ధినులపై యాసిడ్ దాడి చేసి ఆపై పోలీసులతో తలపడి వాళ్ళ చేతుల్లోనే హతులయిన దుష్టులు, రాజకీయ కుతంత్రాలకు బలయిపోయిన బక్కన్నలు, పదిమందికి పట్టెడన్నం పండించి పెట్టగలిగినా తాను మనటానికి సరిలేని పరిస్థితుల్లో ప్రాణాలు తీసుకున్న రైతన్నలు, కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ, విలవిల్లాడుతున్న మధ్యతరగతి వర్గం ఎటు చూసినా నిరాశ నిస్సహాయలే. అయినా ఏదో ఆశ. ముందున్నది మంచి కాలమేనన్న ఎక్కడో నమ్మకం.

ఆ ఆశే మనిషికి కావల్సింది. ఆ నమ్మకమే మనల్ని ముందుకు నడిపించేది. మనం ఆనందంగా ఉండాలంటే మనమొక్కళ్ళమే ఆనందంగా ఉంటే సరిపోదుకదర్రా! మన చుట్టూ వున్నవాళ్ళు కూడా ఆనందంగా వుండాలి. వాళ సంతోషాన్ని మనకందించాలి. మన ఆనందంలో వాళ్ళు పాలు పంచుకోవాలి. అప్పుడే ఆనందమయమైన జీవితం అవుతుంది. అప్పుడే అందరం ఆనందంగా ఉండగలుగుతాం. మన యింటి తలుపులు మూసుకుని, మనం భద్రంగా ఉన్నామని మురిసిపోలేముగదర్రా. మన యింటి మీద ఎదుటవారు దాడి చేయకుండా కూడా వుండాలి. అప్పుడే మనం క్షేమంగా వుంటాము. ఆరోగ్యంగా వుండటానికి తీసుకునే ఆహారం, అమ్మిన వ్యాపారస్థులు కల్తీలేని పదార్దాలందించినప్పుడేగా ఆరోగ్యం చేకూరేది. మంచి పుస్తకం రాయగలగిన రచయిత వున్నప్పుడేగా మన మైండ్ రిలాక్స్ అయ్యేది. వైద్యుడు మంచివాడయితేనేగా రోగం నయమయ్యేది. పవర్ సప్లై సరిగా వుంటేనేగా టీవీనయినా చూడగల్గేది. ఇలా మన సుఖదుఃఖాలన్నీ ఎదుటి వారి చర్యలమీద ఆధారపడి వున్నాయి. అందుకే మనపెద్దలు "సర్వే జనా సుఖినో భవంతు" అన్నారు.

సర్వులు బాగుండాలనుకోవడం కంటే గొప్ప సంస్కారం మరొకటుండదర్రా! భారతీయ సంస్కృతి అందించిన గొప్ప సాంప్రదాయమిది. సమాజం సుభిక్షంగా వుండటానికి కావలసిన "చట్టాలు", "శిక్షలు" - యివే చాలవర్రా! మొదట, వ్యక్తిలో సంస్కారం ఏర్పడాలి. శీలం మెరుగు పడాలి. ప్రతి ఒక్కరు తమను తాము సంస్కరించుకోవాలి. చిన్నతనం నుండీ పిల్లల్లో మంచి శీల నిర్మాణం ఏర్పడటానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషిచేయాలి. ఎదుటి వ్యక్తిలోని సృజనాత్మకతను కూడా ఆనందంగా ఆస్వాదించేలా పెంచాలి. ప్రయత్నిస్తే యిదేమి కష్టం కాదర్రా!సర్వే జనా సుఖినో భవంతు....

మళ్ళోసారి హ్యాపీ న్యూయిరర్రా! వుంటానూ...

బామ్మగారి పేజీలను ఇక్కడ చూడండి


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved