17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

సమర్థ పాలనే ఆవిడ విజయ రహస్యం

అభివృద్ధి పనులతో పాటు రాజకీయంగా షీలాదీక్షిత్ చొరవగా వ్యవహరించారు. పార్టీ నాయకులు కార్యకర్తలకు అన్నివేళలా అందుబాటులో ఉండేవారు. ఎవరికి ఏసాయం అవసరమైనా నేనున్నా అంటూ ముందుండేవారు.

ఢిల్లీ ముఖ్యమంత్రిగా డిసెంబరు 17న మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన షీలాదీక్షిత్ (71) రికార్డు సృష్టించారు. దీంతో సుధీర్ఘకాలం పనిచేసిన మహిళా ముఖ్యమంత్రిగా ఆమె చరిత్ర పుటల్లోకెక్కారు. 1998 డిసెంబరులో తొలిసారిగా ఢిల్లీ అధికార పగ్గాలు చేపట్టిన షీలాదీక్షిత్ 2003 తో పాటు ప్రస్తుత ఎన్నికల్లో వరుసగా విజయఢంకా మోగించడం విశేషం.

సోనియాగాంధీ ప్రోత్సాహంతో తొలిసారి

సోనియాగాంధీ ప్రోత్సాహంతో ఢిల్లీ రాజకీయాల్లో అడుగుపెట్టిన షీలా అంచలంచలుగా ఎదిగారు. ఆమెతో సాన్నిహిత్యం ఏర్పడింది. 1998లో ఢిల్లీ కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను సోనియా ఆమెకు అప్పగించారు. సోనియా నమ్మకాన్ని వమ్ము చేయలేదామె. అనతికాలంలోనే పార్టీ వ్యవహారాలను కొలిక్కి తీసుకువచ్చారు. పార్టీని ఎన్నికలకు సిద్ధం చేశారు. అధికారంలో ఉన్న బి.జె.పి. ని ఓడించారు. అసెంబ్లీ ఎన్నికలకు అర్నెల్ల ముందు ఆమె ఢిల్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటికి పార్టీని విజయపథాన నడిపించారు. అప్పట్లో ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. ఈ సమస్యపై ఆమె పోరాడి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించారు. 52 సీట్లను కాంగ్రెస్ ఖాతాలో జమ చేశారు. 1998 డిసెంబరులో తొలిసారిగా ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.

అభివృద్ధిపై శ్రద్ధ

ఢిల్లీ దేశ రాజధాని. జాతీయ, అంతర్జాతీయ నేతలు ఈ నగరాని సందర్శిస్తుంటారు. ఢిల్లీని చూసే వారు భారత్ గురించి ఒక అవగాహనకు వస్తారు. అందువల్ల ఢిల్లీ అభివృద్ధిపై షీలా దృష్టి సారించారు. నగరన్ని ప్యారిస్, రోమ్‌ల తరహాలో అభివృద్ధి చేయాలని తలచిన ఆమె ఆ ప్రయత్నంలో చాలావరకు విజయం సాధించారు. రవాణా సౌకర్యాలు, మురికివాడల అభివృద్ధి , తాగునీరు, విద్యుత్తు...తదితర సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేశారు. రవాణా సమస్య అధిగమించడానికి అనేక కొత్త బస్సులు ప్రవేశపెట్టారు. పెద్దఎత్తున ఫ్లైఓవర్లు, కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టారు. విద్యుత్తు ప్రైవేటీకరణ చేసి, ఎలాంటి అవకతవకలకూ తావులేకుండా చేయడం వల్ల ప్రజల దృష్టిని షీలా ఆకట్టుకున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు సీఎన్ జీ వాహనాలనే వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు సూచనలను తు.చ. తప్పకుండా అమలుచేశారు. నగరంలో తిరిగే వాహనాలన్నింటికీ యూరో-2 ప్రమాణాలు నిర్దేశించారు. అభివృద్ధిపరంగా ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకున్నారు.

పునారాధికారంతో పార్టీపై పట్టు

అభివృద్ధి ఎజెండాగా 2003 ఎన్నికలను ఎదుర్కొని అనూహ్యంగా విజయం సాధించిన షీలాదీక్షిత్ అధినేత సోనియాగాంధీ దృష్టిలో పడ్డారు. నాటి ఎన్నికల్లో రాజస్థాన్, మద్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కుప్పకూలగా ఢిల్లీలో షీలాదీక్షిత్ సారధ్యంలో విజయం సాధించడం పార్టీ శ్రేణుల్లో ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. క్రమంగా సోనియాతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఎఐసీసీ ప్రధాన కార్యదర్శులతో సంబంధం లేకుండా నేరుగా అధినేత్రిని కలిసేంత చనువు సాధించారు. రెండోదఫా పాలనలో విద్య, వైద్యం, రవాణా, విద్యుత్ రంగాల్లో ఆమె గణనీయమైన అభివృద్ధిని నమేదు చేశారు. ఢిల్లీ మెట్రో రైలు, ఏసీ బస్సులు, ఫ్లై ఓవర్లు నిర్మాణంతో ఢిల్లీ రూపురేఖలను మార్చివేసి తనదైన ముద్ర వేశారు. విస్తృతంగా పాఠశాలలను ప్రారంభించి ఉత్తీర్ణత శాతం పెంచారు. 300లకు పైగా అరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. మురికివాడల ప్రజల చిరకాల స్వప్నమైన సొంతళ్ళు కట్టించారు.

పార్టీ శ్రేణులకు అందుబాటులో...

అభివృద్ధి పనులతో పాటు రాజకీయంగా షీలాదీక్షిత్ చొరవగా వ్యవహరించారు. పార్టీ నాయకులు కార్యకర్తలకు అన్నివేళలా అందుబాటులో ఉండేవారు. ఎవరికి ఏసాయం అవసరమైనా నేనున్నా అంటూ ముందుండేవారు. ఎవరు ఏ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పిల్చునా కాదనకుండా వెళ్ళేవారు. కార్యకర్తలు, సాధారణ ప్రజలే తనకు అండదండలని గ్రహించిన షీలాదీక్షిత్ తన రోజువారీ కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యులను చేశారు. వాళ్ళ ప్రేమా ఆదరణే లేకపోతే తాను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదని ఆమె తరుచూ పెర్కొనేవారు. తాజా ఎన్నికల్లో బ్లూలైన్ బస్సుల వ్యతిరేక అందోళన, కూల్చివేతకు కారణమైన బస్ ర్యాపిడ్ టాన్స్ పోర్ట్ వ్యతిరేక ఆందోళన, ఉగ్రవాదుల దాడులు, ధరల పెరుగుదల తదితర సమస్యలను సమర్థంగా ఎదుర్కొన్నారు. బీజేపీ భావించినట్లు ప్రభుత్వ వ్యతిరేకత పనిచేయలేదు. అభివృద్ధిని, ప్రజలని నమ్ముకున్న షీలాదీక్షిత్ అంతిమంగా విజయం సాధించి ఆదర్శంగా నిలిచారు.

ఇంకా

జీవితం - రాజకీయ అరంగేట్రం

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved