17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

శివరాజ్ పాటిల్‌ - వివాదస్పద వ్యవహారశైలి

ముంబయిపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాకు హోంమంత్రిగా శివరాజ్ పాటిల్‌ పై వేటు వేయవల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. వివిధ సందర్భాల్లో శివరాజ్ పాటిల్‌ను వెనుకేసుకు వచ్చినా ఈసారి చర్య తప్పలేదు. 2004 లోక్ సభ ఎన్నికల్లో సొంత నియోజవర్గమైన లాతూర్ నుంచి ఓడిపోయిన పాటిల్‌ను మంత్రిగా తీసుకోవడంపైనే విమర్శలు వచ్చాయి. మంత్రివర్గంలో చేరిన అనంతరం పాటిల్ ఎగువసభకు ఎన్నికయ్యారు. "నెంబర్ టూ" హోదాగా ముద్రపడిన అత్యంత కీలకమైన హోం మంత్రి పదవి కట్టబెట్టడం పార్టీవర్గాలకే మింగుడుపడలేదు. వాస్తవానికి హోంమంత్రి పదవిని సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ఆశించారు. గాంధీ-నెహ్రూ కుటుంబంపై పాటిల్‌కు గల అచంచల వెధేయతే ఆయనకు హోంమంత్రి పదవిని ప్రసాదించింది. పాటిల్‌పై అధిష్టానం ప్రేమ ఇంతవరకే పరిమితం కాలేదు. ఆయనను గత ఏడాది రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది, అయితే వామపక్షాలు వ్యతిరేకించడంతో ఆ ప్రయత్నానికి అడ్డుకట్ట పడింది. అనంతరం ఉప రాష్ట్రపతి పదవి కోసం పాటిల్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

హోంమంత్రిగా శివరాజ్ పాటిల్ (74) పనితీరు ఆదినుంచీ వివాదాస్పదమే. సెప్టెంబర్‌లో ఢిల్లో పేలుళ్ళు సందర్భంగా ఆయన తక్షణ చర్యలపై దృష్టి సారించాల్సింది పోయి సూటు కోటు మార్చుకోవడంపైనే శ్రద్ధ చూపారన్న బలమైన విమర్శలు వచ్చాయి. ఈ విషయమై ప్రశ్నించినపుడు, "నేను తాగానా? పేక ఆడానా?" అంటూ ఎదురుదాడికి దిగారు. ముంబయిపై దాడిలో దిగ్భాంతికి గురైన జాతికి పాటిల్ ఆకస్మిక నిష్క్రమణ ఆశ్చర్యాన్ని కలిగించలేదు. నవంబరు 26న ఉగ్రవాద దాడులతో అంతర్గత భద్రతావైఫల్యంపై ప్రతిపక్షాలతోపాటు కాంగ్రెస్ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే వరుస పేలుళ్ళతో విమర్శలపాలన పాటిల్ ముంబయి ఘటనకు బాధ్యత వహించాలని ఆ పార్టీ నేతలు ఒత్తిడి తేవడంతో అన్నివేళలా ఆయనకు అభయహస్తం చూపే సోనియా కూడా ఏమీ చేయలేకపోయారు. 2004 జులై 10న మణిపూర్‌లో తాంగ్ జమ్ మనోరమ అనే మహిళపై సైనికులు అత్యాచారం చేసి కాల్చి చంపారన్న సంఘటనతో పాటిల్ కు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఈ సంఘటనతో అట్టుడికిన మణిపూర్ ను రెండు నెలల తరువాత పాటిల్ సందర్శించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. జనాభా లెక్కల సేకరణ అంశం హోంమత్రిత్వశాఖ పరిధిలోనిది. జనాభా వివరాలను వెల్లడించే ముందు మతపరమైన లెక్కల సర్వేపై సెన్సస్ కమీషనర్ తన అనుమతి తీసుకోలేదని పాటిల్ చెప్పారు. హోంశాఖపై ఆయనకు పట్టులేదని ఈ సంఘటన నిరూపించింది. గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా పర్యటనకు వెళ్ళిన సమయంలో ప్రణబ్ ను నంబర్ 2గా నియమిస్తూ నోట్ జారీ చేయాలని కేబినేట్ కార్యదర్శిని ప్రధాని ఆదేశించారు. ఇది కూడా పాటిల్‌కు ఇబ్బంది కలింగించిన అంశమే. జైపూర్ బెంగుళూరు వారణాసి ఢిల్లీ నగరాల్లో పేలుళ్ళు జరిగినపుడు కేవలం ఖండనలు సంతాప ప్రకటనలకే ఆయన పరిమితమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తాయి.

స్వతహాగా సున్నిత మనస్కుడైన పాటిల్ కు రోజువారీ సవాళ్ళు, ఒత్తిడులతో కూడిన హోంమంత్రి పదవి అప్పగించడం సరైంది కాదన్న అభిప్రాయం ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తుంటారు. విద్యా, మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక రంగాలు, ప్రణాళిక, పార్లమెంటరీ వ్యవహారాలు తదితర శాఖలు ఆయన స్వభావానికి అతికినట్లు సరిపోతాయి. అందువల్లే ఇతర శాఖల్లో విమర్శల పాలవ్వని పాటిల్ హోశాఖలో వివాదాస్పదుడయ్యారు. వాస్తవానికి హోంశాఖ ఆయన కోరుకున్నదేమీ కాదు. రాజకీయ ప్రయోజనాలను ఆశించి అధిష్టానం ఆయనకు ఆ పదవిని కట్టబెట్టింది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved