17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

కాశ్మీర్‌లో కత్తిమీద సాము

సున్నితమైన సరిహద్దు రాష్ట్రం జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘంలో తొలుత ఏకాభిప్రాయం వ్యక్తంకానప్పటికీ తర్జన భర్జనల అనంతరం ఎట్టకేలకు 7 దశల్లో ఎన్నికలకు అక్టోబరు 19న తలూపింది. మొత్తం 87 స్థానాలకు మొదటిదశ నవంబరు 17తో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమౌతుంది. డిసెంబరు 24 ఆఖరి దశలో ఎన్నికలు ముగుస్తాయి. గతంలో నాలుగు దశల్లో ఎన్నికలు జరగ్గా శాంతి భద్రతల పరిస్థితి దృష్ట్యా ఈ సారి ఏడు దశల్లో జరపాలని ఈసీ నిర్ణయించింది. సహజంగానే సంక్షుభిత రాష్ట్రమైన కాశ్మీర్ ఇటీవల అమర్‌నాథ్ భూవివాదంతో అట్టుడుకింది. ఇప్పటికీ పరిస్థితి పూర్తిగా కుదుట పడలేదు. రాజకీయ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఎన్నికల నిర్వహణకే ఈసీ మొగ్గు చూపింది. హురియత్, జె.కె.ఎల్‌.ఎఫ్ వంటి వేర్పాటువాద సంస్థలు సహజంగా వాటి విధానాలకు అనుగుణంగా ఎన్నికలను వ్యతిరేకించాయి. కాంగ్రెస్ బీజేపీ నేషనల్ కాన్ఫరెన్స్‌లు ఎన్నికలకు వ్యతిరేకమేమి కాదు. ప్రాంతీయ పార్టీ పీడిపీ మాత్రం అయిష్టంగానే ఎన్నికలకు సమాయత్తమవుతోంది. 2002 ఎన్నికల్లో 44 శాతం పోలింగ్ నమోదైనప్పటికి అప్పుడు జరిగిన నరమేథం జాతిని నిశ్చేష్టుల్ని చేసింది. ఆ నేపథ్యంలో ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళన సహజంగానే అన్ని వర్గాల్లో కలుగుతోంది. నాటి ఎన్నికల్లో అధికార నేషనల్ కాన్ఫరెన్స్ ఓడి హంగ్ అసెంబ్లీ ఏర్పడటంతో అధికారాన్ని పంచుకున్న కాంగ్రెస్ పీడీపీ కూటమిలో చివరిలో కలతలు ఏర్పడి గౌర్నరు పాలనకు దారితీసింది. కాంగ్రెస్ తరుఫున మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ పీసీసీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి సైఫుద్దీన్ సౌజ్, నేషనల్ కాన్ఫరెన్స్ తరుఫున ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, పీడీపీ తరుఫున మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమద్ సయీద్, ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ ఎన్నికల్లో ప్రధాన పాత్ర వహించనున్నారు. బీజేపీ ప్యాంథర్స్ పార్టీల పాత్ర కూడా తక్కువేమీ కాదు. ఎవరి గెలిచినా ఓడినా సాఫీగా ఎన్నికలు జరిగి అక్కడ ప్రజా ప్రభుత్వం ఏర్పడాలని జాతి కోరుకుంటోంది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved