19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఒబామా ముందున్నది కష్టాల ముళ్ళబాటే

తెల్లకోటలో నల్లరాజు

American Elections 2008 Poll Date Nov 4

ఒబామా గెలిచాడు...చరిత్ర సృష్టించాడు. తెల్లకోటలో మెదటి నల్ల అధ్యక్ష్యునిగా అడుగిడనున్నాడు.

అధ్యక్ష పీఠం చేజిక్కించుకోవటం ఒక ఎత్తు అయితే, చేసిన వాగ్దానాలను నిలుపుకోవటం మరో ఎత్తు. ఒబామా మార్పును తెస్తాడన్న అపార నమ్మకంతో అమెరికా ప్రజలు మునుపెన్నడు లేని విధంగా ఓటింగులో పాల్గొని ఒబామాని గెలిపించారు. యువకులే కాక అనేక మంది మధ్య వయస్కులు కూడా మెదటిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని సర్వేలు తెల్పుతున్నాయి. వీరందరు ఒబామా తమ జీవితంలో కొత్త వెలుగును నింపుతాడని నమ్ముతున్నారు. వారి నమ్మకాన్ని నిలుపుకోవడం ఒబామా ముందున్న పెద్ద సవాల్.

బుష్ ప్రభుత్వంపై ఉన్న విముఖతతో ఒబామా మార్పు మంత్రం బాగా పనిచేసింది. కాని ఆయన అమలు చేస్తానన్న మార్పులు అంత తేలికగా వచ్చేవి కావు. ఆయన ముందున్న ముఖ్య సమస్యలు రెండు - ఒకటి ఆర్థిక మాంద్యం, రెండు అమెరికా సేనలను ఇంటికి రప్పించడం.

ఆర్థిక మాంద్యం

దేశం ఆర్థిక మాంద్యంలో వుంది. ఇప్పుడప్పుడే ఈ కష్టాలు గట్టెక్కే సూచనలు కనిపించడం లేదు. పైగా కొంత మేర తీవ్రతరం అవుతాయని విశ్లేషకులు తెలుపుతున్నారు. అంటే అప్పుల ఊబిలో కూరుకు పోతున్న సామాన్య అమెరికన్ కష్టాలు ఇప్పుడే తీరవన్న మాట. అలాగే కొత్త ఉద్యోగాల కల్పన దేవుడెరుగు, ఉన్నవి కాపాడటం కూడా కష్టం కావచ్చు. పెరుగుతున్న నిత్యావసర ధరలను అదుపుచేయడం కూడా అంత సులభం కాదు. ఆరోగ్య సదుపాయాలు, భీమా లేని ప్రజలకు వైద్య సేవలను అందించగలగటం, నీరుగారిపోతున్న సామాజిక భద్రతా వ్యవస్థను పునరుధరించడం వంటి సమస్యలు అంత తేలికగా లొంగే భూతాలు కావు.

గడచిన పది సంవత్సరాల కాలంలో సామాజిక భద్రత హాస్యాస్పదంగా మారిందని అనేకమంది అమెరికన్లు వాపోతున్నారు. బేబీ బూమర్ సంతతి నేడు వృధాప్యంలోకి ప్రవేశిస్తోంది. వీరందరికి కావలసిన పింఛన్లు, ఆరోగ్య భీమాలను అందజేయడానికి సోషల్ సెక్యూరిటీ వ్యవస్థలో ధనం లేదని విశ్లేషకులు చాలా కాలంగా గగ్గోలు పెడుతున్నారు. వీరికోసం నేటి యువత నుండి వసూలు చేసే ధనం వాడవలసిన పరిస్థితి. అంటే సమస్యను కొంతకాలం దాటవేయ గలుగుతారే కాని ఇది సమధానం కాదన్నది సుస్పష్టం. బుష్ హయాంలో ప్రవేశ పెట్టిన ఆర్థిక విధానాలు ఈ పరిస్థితిని కల్పించాయన్నది వాస్థవమే అయినప్పటికీ, ఆ నెపంతో ఒబామా ఎంతో కాలం సంక్లిష్టమైన నిర్ణయాలు తీసుకోకుండా వుండలేరు. ఈ నిర్ణయాలు ఎలా ఉన్నా అందరికీ ఆమోదయోగ్యం మాత్రం కావన్నది తథ్యం. తన స్వంత పార్టీలోనే వ్యతిరేకత కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

గౌరవంగా సేనలు నిష్క్రమించగలవా?

ఇక ఒబామా ముందున్న రెండో ముఖ్య సమస్య ఇరాక్‌లోని తమ సేనలను గౌరవప్రదంగా ఇంటి ముఖం పట్టించడం. ఈనాడు ఇరాక్‌లో పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి చందంగా మారింది. ఇరాకీ ప్రజలు ఎక్కువకాలం అమెరికన్లు ఉండటాన్ని భరించలేరు. కానీ వారు ఇంకా స్వంతంగా భద్రత వ్యవస్థను నడుపుకునే స్థితిలోలేరు. ఇరాకీ సేనలు, పోలీసు వ్యవస్థ తమ సామర్థ్యాన్ని పెంపొందించుకునే ముందే అమెరికా సేనలు గనుక వైదొలిగితే, ఇస్లామిక్ ఛాందస వాదులు గెలిచామని ప్రకటించుకుంటారు. కాబట్టి ప్రజా వ్యతిరేకత మధ్య అమెరికా సేనలు అక్కడ ఉండక తప్పదు. ఇది ఇలావుండగా, అమెరికా ప్రజలు తమ సైనికులు అతి త్వరలో ఇల్లు చేరాలని కోరుకుంటున్నారు. సైనికులు అక్కడే కొనసాగితే అమెరికాలో ప్రజల నిరసనలు ఎక్కువవుతాయి.అధికారం చేపట్టిన 16 నెలల్లో ఇరాక్‌లో ఉన్న 1,50, 000 అమెరికా సేనలను ఇంటికి తెస్తానని ఒబామా మాట ఇచ్చారు. ఇరాక్ ప్రభుత్వం కూడా ఇందుకు సానుకూలంగానే ఉంది. అయితే సజావుగా ఈ కార్యక్రమం పూర్తి చేయడం అన్నది ఎంతో నేర్పుతో, ఇరాక్‌లోని యధార్ధ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చేయాల్సివుంటుంది. ఆఫ్ఘనిస్థాన్‌లో కూడా అమెరికా ఇరకాటమైన పరిస్థితినే ఎదుర్కుంటోంది. నేటో సహచర దేశాలు ఎంత త్వరగా బయటపడదామాని తహతహలాడుతుండటంతో ఇక్కడ సైనిక చర్యలు కుడా సింహభాగం అమెరికా ఒంటి చేత్తో నెట్టుకురావాల్సిన పరిస్థితి. తాలిబాన్లు తిరిగి బలోపేతమవుతుండగా హమీద్ కర్జాయ్ ప్రభుత్వం మెదటినుండి అంతంత మాత్రమే అయిన పట్టును క్రమేపీ కోల్పోతోంది. ఇరాక్ ఆఫ్ఘనిస్థాన్‌లలో సమస్యలను ఒబామా ఏవిధంగా ఎదుర్కొంటారో వేచి చూడాలి. భారత దేశానికి కూడా ప్రత్యక్షంగా సంబంధంలేనప్పటికీ, తన అంతర్గత భద్రత దృష్ట్యా ఈ అంశాలు ఎంతో ముఖ్యమైనవి కావడం గమనార్హం.

ఇతర దేశాలతో తమకు పనిలేదన్నట్లు ఇష్టారాజ్యంగా, ఏకపక్ష నిర్ణయాలతో అమెరికా తన స్నేహితులను దూరం చేసుకుంది. ఒబామా తెగిన వంతెనలను మళ్ళీ కలుపుతానని, ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ప్రతిష్టకు పూర్వవైభవం కలిగిస్తానని పేర్కొన్నారు. మొదటి నల్ల జాతి అధ్యక్షునిగా ఆయనను అన్ని దేశాలు ఘనంగా స్వాగతించినంత మాత్రానా అమెరికా కోసం తమ సైన్యాన్ని యుద్ధానికి పంపడం మాత్రం కల్లే. అంటే దౌత్యపరంగా అమెరికా ఎదుర్కొంటున్న పెనుసవాళ్ళను అధిగమించడం మాటల్లో చెప్పినంత సులభంకాదు.

ఒబామా త్వరలోనే కీలక నిర్ణయాలను ప్రకటిస్తారని ఆయన సహాయకులు చెపుతున్నారు. తన క్యాబినెట్‌ను ఏర్పర్చుకోవడంతో ఒబామ తన మొదటి పరిపాలన దక్షతను చూపించవలసి ఉంది. గ్లోబల్ టెర్రరిజం విస్తరిస్తుండటం, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎంతో దగ్గరిగా పెనవేసుకుపోవడం వంటి పరిస్థితులున్న ఈ గ్లోబలైజేషన్ రోజుల్లో అమెరికా లాభం అందరికీ లాభం కాకపోయినా, అమెరికా నష్టం మాత్రం అన్ని దేశాల మీద ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రజల ఆశలను ఒబామా వమ్ము చేయరని ఆశిద్దాం.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved