17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఒబామా విజయం ఖాయం

విదేశాంగ విధానంపై స్పష్టమైన అవగాహన ఉన్న జోసెఫ్ బిడెన్ ను ఒబామా తన ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఎంచుకోవడం చక్కటి నిర్ణయంగా చెపుతున్నారు. దీనికి భిన్నంగా మెక్ కెయిన్ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఎంచుకున్న సారాపాలిన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె వ్యవహారశైలి, జీవనవిధానంపై ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి. సంపన్నులకు బుష్ పన్నురాయితీలివ్వడం బాధ్యతారాహిత్యమని గతంలో విమర్శించిన మెక్‌కెయిన్ ఇప్పుడు వాటిని శాశ్వతం చేయాలనడం ఆయన అపరిపక్వతకు నిదర్శనమన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దేశ దుస్థితికి కారణమైన రిపబ్లికన్ల ఆర్ధిక విధానాలను మారుస్తానంటున్న ఒబామా మాటలను అమెరికన్లు విశ్వసిస్తున్నట్లే కనబడుతోంది. రిపబ్లికన్ల మాదిరిగా ధనికులకే గాకుండా అన్ని వర్గాల ప్రయోజనాలకు తన పాలనలో ప్రాధాన్యమిస్తానని చెప్పడం ఒబామా అనుకూలాంశాల్లో ఒకటి. ఉగ్రవాదంపై పోరాటం పేరుతో అర్ధం - పర్ధం లేకుండా కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారంటూ బుష్ పై చేస్తున్న విమర్శలు ప్రజలను ఆలోచింప చేస్తున్నాయి.

ఒబామా విధానాలతో ఊరట.

మెక్ కెయిన్ మాదిరిగా కాకుండా ఒబామా తన ఎన్నికల ప్రచారంలో ఆర్ధిక అంశాన్ని ప్రధానాస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. మధ్యతరగతి ప్రజల కష్టనష్టాలకు ఆర్ధిక సంక్షోభమే కారణమని అధ్యక్ష అభ్యర్ధుల ముఖాముఖీ (Presidential Debate) సందర్భంగా ఒబామా నొక్కి చెప్పారు. మెక్ కెయిన్ ఆ పని చేయకపోగా, మొదటి రెండు ముఖాముఖీ వాదాల సందర్భంగామధ్య తరగతి అన్న పదాన్ని సైతం ఉఛ్ఛరించడానికి ఇష్టపడలేదు. అదేసమయంలో ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దడానికి తీసుకోవలసిన చర్యలనూ ఒబామా ఉదహరించి ప్రజల మన్ననలు పొందారు. అమెరికా నుంచి పనులను అవుట్ సోర్సింగ్ కు ఇస్తున్న కంపెనీలకు పన్ను రాయితీలు ఇవ్వరాదని ఆయన తొలినుంచి వాదిస్తున్నారు. అంతేకాకుండా అమెరికాలోనే ఉద్యోగాలు సృష్టిస్తున్న కంపెనీలకు పన్ను మినహాయింపులివ్వాలని సూచిస్తున్నారు. పశ్చిమాసియా చమురు దిగుమతులపై అధికంగాఆధారపడటం భవిష్యత్తులో అనేక ఇబ్బందులను కొనితెస్తుందని దిగుమతులను తగ్గించుకుని ఇంధన భద్రత సాధించాలని ఒబామా అంటున్నారు. సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సగటు అమెరికన్ పౌరుడికి ఒబామా విధానాలు ఊరట కలిగిస్తున్నాయి.

అనుకూలం ప్రతికూలం కావచ్చు.

సర్వేల ఆధారంగా ఒబామాకు అంతా అనుకూలంగా ఉందని చెప్పడం తొందరపాటే అవుతుంది. అమెరికా ఎన్నికల వ్యవస్థ ప్రత్యేకతే అది. ప్రజా ఓటులో మెజారిటీవచ్చిన అభ్యర్ధిని తప్పనిసరిగా దేశాధ్యక్షుడిగా ప్రకటించాలన్న నియమం ఏదీ అక్కడ లేదు. 2000 నాటి అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ల అభ్యర్ధి జాన్ కెర్రి 48.4 శాతం ఓట్లు సాధించగా, జార్జి బుష్ కు 47.9 శాతం ఓట్లు లభించాయి. అయితే అధ్యక్ష పదవి మాత్రం బుష్ నే వరించింది. ఇందుకు కారణమేమిటో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.అమెరికా పౌరులు నేరుగా అభ్యర్ధికి ఓటు వేయరు. అభ్యర్ధుల్లో ఎవరో ఒకరికి మద్దతు ప్రకటించే ప్రతినిధుల్ని ఎన్నుకుంటారు. అంతిమంగా ఈ ఎలక్టోరల్ కాలేజీలోని మొత్తం 538 మంది ప్రజాప్రతినిధులే అధ్యక్షుడెవరో తేలుస్తారు. మెజారిటీ ప్రతినిధులు ఎవరి వైపు మొగ్గుచూపితే వారే అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. ఈ ప్రతినిధుల్ని హెచ్చు సంఖ్యలో గెలిపించుకొనే అభ్యర్ధే అధ్యక్షుడు అవుతారు. ఈ లెక్కన ఒబామా అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే మెజారిటీ ప్రజల ఓట్లు సాధించనవసరం లేదు. ఎలక్టోరల్ కాలేజీలో మెజారిటీ ( 538 లో 270 ) తెచ్చుకుంటే చాలు.

పేజి   12 |      

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved