22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ధీశాలి, ఉక్కుమహిళ మన ఇందిర

By జి, శివ కుమార్

Indira Gandhi ఇందిరాగాంధీ... భారత రాజకీయ చరిత్రలో ఆమే ఒక విశిష్ట నేత. సంచలనాలకు, సాహసానికి మారుపేరు. వివాదాలకు కేంద్రబిందువు. ఎత్తులు, పైఎత్తులు వేయడంలో అందెవేసిన చేయి. వ్యూహరచనలో దిట్ట. ప్రత్యర్థులకు ఎప్పుడూ అందనంత దూరంలో ఉండే అగ్రనేత. అదను చూసి శత్రువులను దెబ్బతీయడంలో ఆరితేరిన యోధురాలు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న నాయకురాలు ఇందిరాగాంధీ. చరిత్రలో ఏ ప్రధానీ ఆమెలా వివాదాస్పదం కాలేదు. ప్రజాగ్రహానికీ గురికాలేదు. అమె ఓ విలక్షణ నాయకురాలు. దశాబ్దాల రాజకీయ జీవితంలో అన్నీ సంచలన ఘట్టాలే. అన్నీ ప్రత్యేకతలే.

అన్నీ ప్రత్యేకతలే..

చిన్నవయస్సులోనే 1959 ఫిబ్రవరి 2న ప్రతిష్టాత్మకమైన ఎఐసీసీ అధ్యక్ష పదవిని చేపట్టారు. ఎగువసభైన రాజ్యసభ సభ్యురాలుగా ఉంటూ ప్రధాని పదవిని చేపట్టిన తొలి నేత ఆమే. అతిచిన్న వయసులోనే అత్యంత కీలకమైన ప్రధాని పగ్గాలు చేపట్టారు. పార్లమెంటరీ పార్టీలో ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ప్రధాని పదవిని కైవసం చేసుకున్న ఏకైక నేత ఇందిరాగాంధీ. ఆమెకు ముందు, తరువాత కూడా ప్రధాని పదవికి విపరీతమైన పోటీ ఏర్పడినప్పటికీ పార్లమెంటరీ పార్టీలో ఎన్నిక దాకా పరిస్థితి ఎప్పుడూ రాలేదు. కాంగ్రెస్ పార్టీలో ప్రధాని పదవి కోసం జరిగిన హోరహోరీ పోరులో ఆమె మురార్జీదేశాయ్‌తో పోటీపడి విజయం సాధించారు. 1966 జనవరి 16న జరిగిన ఈ ఎన్నికలో 350 ఓట్లు తెచ్చుకుని పార్టీపై తన పట్టును నిరూపించుకున్నారు. కేవలం 189 ఓట్లు తెచ్చుకున్న మెరార్జీకి ఓటమిని అంగీకరించక తప్పలేదు. భారతదేశ తొలిమహిళా ప్రధానిగా కూడా ఇందిరాగాంధీ రికార్డు సృష్టించారు. ప్రపంచంలో తొలి మహిళా ప్రధాని శ్రీలంకకు చెందిన సిరిమావొ బండారు నాయకే కాగా ఇందిర రెండోవారు.

సాహసి

సత్తా ఉన్నప్పటికి ఏ ప్రధానీ అణు పరీక్షలకు సాహసించలేదు. అమెరికా ఆగ్రహానికి గురువతామన్న భయం, అంతర్జాతీయంగా ఎక్కడ చెడ్డపేరు వస్తుందన్న ఆందోళనతో ప్రతి ప్రధానీ అణుపరీక్షకు ఆమడదూరంలో ఉన్నవారే. 1972 సెప్టెంబరు 7న రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఎడారిలో అణు పరీక్షలను నిర్వహించడం ద్వారా భారత సత్తాను చాటి ఇందిరాగాంధీ అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్య పరిచింది. అప్పటికీ అంతర్జాతీయంగా భారత్ బలహీనంగా ఉంది. అగ్రరాజ్యాలు అణుపరీక్షలను వ్యతిరేకించినప్పటికి ఇందిర లెక్కచేయలేదు.

దేశంలోకి అదేపనిగా వస్తున్న బంగ్లాదేశ్ శరణార్థుల సమస్యను పరిష్కరించేందుకు పాకిస్థాన్‌తో యుద్ధం చేయక తప్పదని ఇందిర భావించారు. 1970వ దశకం ప్రథమార్థంలో బంగ్లాదేశ్ విముక్తికోసం పాక్‌తో యుద్ధం చేసి విజయం సాధించారు. ఈ సందర్భంగా అత్యంత ధైర్యంగా వ్యవహరించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. తద్వారా బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దోహదపడ్డారు. ఈ విజయాన్ని విపక్షం సహా జాతి యావత్తూ హర్షించింది. విజయదుర్గ, కనకదుర్గ, విజయేందిర అంటూ అభినందించింది. ఇందిరాగాంధీ వంటి మగాడు తమ క్యాబినెట్‌లో ఉంటే బాగుండేదని 1976లో అప్పటి అమెరికా విదేశాంగమంత్రి హెన్రీ కిసింజర్ వ్యాఖ్యానించారంటే ఆమె ధైర్యసాహసాలు ఏపాటివో స్పష్టమవుతుంది. నాటి ఆఫ్ఘానిస్థాన్ ప్రధాని మహమ్మద్ దౌడ్‌తో భేటీ సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

సామ్యవాది...

పేదప్రజల అభ్యున్నతికి పాటుపడాలని ఇందిరాగాంధీ నిరంతరం తపించేవారు. అభివృద్ధి ఫలాలు కింది స్థాయికి చేరకపోతే దేశ స్వాతంత్ర్యానికి అర్థం లేదని ఆమె భావించేవారు. ప్రభుత్వ ప్రతి నిర్ణయానికి పేదప్రజల సమస్యలే ప్రాతిపతిదక కావాలని ఆమే తలపోసేవారు. అందులో భాగంగానే "గరీబీ హటావో", భూసంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు వంటి సాహసోపేతమైన సామ్యవాద నిర్ణయాలను తీసుకున్నారు. నాడు ముందుచూపుతో ఆమె తీసుకున్న నిర్ణయాలు దేశప్రగతికి ఎంతగానో దోహదపడ్డాయి.

పేజి   1 |   2 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved