19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

బయో డీజిల్ - పరిష్కారమా? సమస్యా?

ఆహారపదార్ధాలను వినియోగించి ఇథనాల్ వంటి బయో ఇంధనాలు ఉత్పత్తి చేయడం వల్ల ఆహర సంక్షోభం మరింత పెరుగుతుంది

రాను రాను చమురు నిల్వలు తరిగిపోతున్నాయ్. దానితో పెట్రోలుధర పెరిగిపోతోంది.ఇది అగ్ర రాజ్యమైన అమెరికాతో పాటు అన్నీ దేశాల వారినీ కలవర పెడుతోంది. ప్రపంచ దేశాలతో పాటు సామాన్య ప్రజలకి కూడా ఈ విషయంలోని తీవ్రత అర్ధమౌతున్నా , చమురు నిల్వలు తరుగుతుంటే ఆహార సంక్షోభం ఎందుకు వస్తోందో ఆహార పదార్ధాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో అర్ధం కాక అయోమయంలో పడుతున్నారు.

తరుగుతున్న పెట్రోలు స్థానాన్ని భర్తీ చేయడానికి పెట్రోలుకి ప్రత్యామ్నాయంగా ఇథనాల్ తయారు చేయడానికి పలుదేశాలు ఉత్సాహం చూపిస్తున్నాయి.ఇథనాల్‌ను వివిధ రకాల అహార పదార్ధలనుండి ఉత్పత్తి చేయడానికి అనేక దేశాలు సిధ్ధమౌతున్నాయి. దీనికి ముందుగా శ్రీకారం చుట్టింది అగ్రరాజ్యమైన అమెరికా.

ఆహారం నుండి పెట్రోలు

అమెరికా మొక్కజొన్నను వినియోగించి పెద్ద ఎత్తున ఇథనాల్ ఉత్పత్తి చేస్తోంది. ఆ దేశంలో పండిన మొక్కజొన్నలో 20% , అంటే సుమారు కోటీ నలభై లక్షల టన్నులను ఇథనాల్ తయారీకే అమెరికా ఉపయోగించుకోవటం గమనించవలసిన విషయం. ఇలా ఇథనాల్ తయారీ కోసం అమెరికా పెద్ద ఎత్తున మొక్క జొన్నను వినియోగిస్తుండటమే ప్రస్తుత ప్రపంచవ్యాప్త ఆహారసంక్షోభానికి కారణమైంది. దీనికి తోడు ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి దాన్ని పెట్రోల్లో 20% కలపాలని విధాన పరమైన నిర్ణయాన్ని తీసుకుంది.

చాలా కాలంగా పంచదార మొలాసిస్ నుంచి, నేరుగా చెరుకు రసం నుంచి , బ్రెజిల్ ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు మన దేశంలో కూడా కొన్ని చక్కెర కర్మాగారాలు మొలాసిస్ నుంచి ఇథనాల్‌ను తయారు చేస్తున్నాయి. ఐరోపాలోని కొన్ని దేశాలు సోయాబీన్ మొక్కజొన్నలను, మలేశియాలో పామయిల్‌ను వినియోగించి ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్నారు.

2020 నాటికి నలభై కోట్ల టన్నుల ఆహారధాన్యాలను బయోడీజిల్ ఉత్పత్తికి ఉపయోగించ వచ్చునని ఒక అంచన. ఈ ఆహార ధాన్యాల పరిమాణం ప్రపంచం మొత్తంలో పండే వరి ధాన్యానికి సమానం. ఈ పరిస్థితుల రీత్యా ఆహార పదార్ధాల లభ్యత తగ్గుతోంది.

దక్షిణ ఆఫ్రికాలోనూ, ఫిలిప్పీన్ మరికొన్ని దేశాలలో ఆహార ధాన్యాల గోడౌన్స్‌పై దాడులు జరుగుతున్నాయి. నైజీరియా కరేబియన్ దీవుల్లోని హైతీలలో పరిస్థితులు విషమిస్తున్నాయి.బంగ్లాదేశ్, ఈజిప్ట్, సిరియా, మొజాంబిక్, సెనెగల్, ఎమెన్, బొలీవియా, మెక్సికో, టర్కీ వంటి పలు దేశాలలో ఆహార పదార్ధాల కోసం ప్రజలు ఆందోళన చేపడుతున్నారు. అమెరికాలోని సూపర్ మర్కెట్లలో బియ్యం అమ్మకాలపై పరిమితులు విధించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

విమర్శలు

ఆహర పదార్ధాలను ఇథనాల్ తయారీకోసం అమెరికా వాడుతుండటంపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికిగాను, దాన్ని పెట్రోల్‌లో 20% కలపాలని విధాన పరంగా అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని, ఇథనాల్ తయారీదారులకు ఇస్తున్న పన్నురాయితీలనూ, బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకొనే ఇథనాల్ పై విధిసున్న సుంకాలనూ అమెరికా ఉపసంహరించుకుంటే ఆహార ధాన్యాల ధరలు 16% తగ్గవచ్చునని ఒక అంచన.

అభివృద్ధి చెందిన దేశాలు బయో ఇంధన తయారీ కార్యక్రమాన్ని నిలిపివేస్తే అంతర్జాతీయ మార్కెట్లలో మొక్కజొన్న ధరలు 20% , గోధుమ ధర 10% వరకు తగ్గవచ్చునని అంచన. అందుచేత ఆహారపదార్ధాలను వినియోగించి ఇథనాల్ ఉత్పత్తి చేయడం ఆపవలసిన బాధ్యత అన్ని దేశాలపైనా ఉంది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved