19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

కొత్త పొత్తుల కలకలం

By , బాల గంగాధర్ తిలక్

రాష్ట్రచర్రితలో ఇప్పటిదాకా రెండు పార్టీలు లేదా రెండు కూటముల వ్యవస్థే నడిచింది. తాజాగా ప్రజారాజ్యం రాకతో మూడోకూటమి తెరపైకి వచ్చింది. వచ్చే ఎన్నికలకు సంబంధించి తాజా పరిణామం ఇదే. సైద్ధాంతిక సారూప్యం ఉన్న వామపక్షాల మధ్య అంతర్గతంగా తెలంగాణ, తెరాసాతో మైత్రి

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం అస్పష్టంగా ఉంది. మరో ఆరేడు నెలల్లో జరగన్ను అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమయ్యే క్రమంలో భాగంగా పొత్తుల కోసం విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశాలు కనబడటం లేదు. కాంగ్రెస్ను ఢీకొనేందుకు అన్ని విపక్షాలతో మహాకూటమి నిర్మించాలన్న యత్నాలు బెడిసికొట్టినట్లు తాజా పరిణామాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, కొత్తగా పురుడు పోసుకున్న ప్రజారాజ్యం ఆధ్వర్యంలో బలమైన కూటములు ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే తెలుగుదేశం, ప్రజారాజ్యంతో ఏయే పార్టీలు కలిసి వస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. తాజా అంచనాల ప్రకారం తెలుగుదేశం-సీపిఎం-తెరాస, ప్రజారాజ్యం-సీపీఐ-నవతెలంగాణా ప్రజాపార్టీ, కాంగ్రెస్-మజ్లిస్ లు కూటమిగా ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది. మతతత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీతో పొత్తుకు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి లేనందున ఆ పార్టీ ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనడం అనివార్యం. ఇక అధికార కాంగ్రెస్ పాత మిత్రపక్షమైన మజ్లిస్ పార్టీతో ముందుకు సాగనుంది. పైకి మేకపోతు గాంభీర్యం కనబరుస్తున్నా గత ఎన్నికల్లో తనతో కలసి నడచిన తెరాస, సీపీఎం, సీపీఐలు ఇప్పుడు దూరమవడం కాంగ్రెస్ కు ఇబ్బందికరమే. రాష్ట్రచర్రితలో ఇప్పటిదాకా రెండు పార్టీలు లేదా రెండు కూటముల వ్యవస్థే నడిచింది. తాజాగా ప్రజారాజ్యం రాకతో మూడోకూటమి తెరపైకి వచ్చింది. వచ్చే ఎన్నికలకు సంబంధించి తాజా పరిణామం ఇదే.

ప్రధాన వామపక్షం సీపీఎం తెలుగుదేశంతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగేందుకు ఆసక్తితో ఉంది. కాగా,సీపీఐ వ్యతిరేకిస్తోంది.2004లో ప్రజలు గద్దే దింపిన తరువాత కూడా విధానాల పరంగాతెలుగుదేశం వైఖరిలో పెద్దగా మార్పులు రానందున ఆ పార్టీతోపొత్తు ఎలాపెట్టుకుంటామని దాని వాదన. అదే సమయంలో కొత్త పార్టీ ప్రజారాజ్యం పట్ల సానుకూల ధోరణితో వ్యవహరిస్తోంది. సీపీఎం పెద్దన్న పాత్ర పోషిస్తోందన్నది సీపీఐ ఆవేదన.ఈ అభిప్రాయం జాతీయ, రాష్ట్రస్థాయిల్లో కూడా ఉండటం గమనార్హం . సీపీఐ అభ్యంతరాలు తెలుగుదేశంకు చికాకు కలిగిస్తున్నాయి. అయితే సీపీఐ కేంద్ర నాయకులతో తమకున్న సాన్నిహిత్యం ఉపయోగించుకుని రాష్ట్ర నాయకులను తమ దారికి తెచ్చుకోగలనన్న నమ్మకంతో తెలుగుదేశం ఉంది.

తెలంగాణ పార్టీల్లో పెద్దదైన తెరాస పొత్తులకు సంబంధించి నాలుగురోడ్ల కూడలిలో నిలబడి ఉంది. పైకి మాత్రం ప్రత్యేక తెలంగాణా సాధనకు కలసి వచ్చే అన్నీ పార్టీలను కలుపుకుపోతాం అని చెబుతున్నప్పటికీ, ప్రజారాజ్యం కన్నా తెలుగుదేశంతో పొత్తుకే మొగ్గు చూపుతోంది. కిందిస్థాయిలో కార్యకర్తలు తెలుగుదేశంతో పొత్తును వ్యతిరేకిస్తున్నప్పటికీ పట్టించుకొనే స్థితిలో లేదు. మరోవైపు తెలంగాణానే ప్రాతిపదికగా ఏర్పడిన దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలోని నవ తెలంగాణ ప్రజాపార్టీ పట్ల తెరాస విముఖుత వ్యక్తం చేస్తోంది.వ్యక్తిగతంగా కేసీఆర్, దేవేంద్రగౌడ్‌ల మధ్య విభేదాలే దీనికి కారణం.ఇటీవల గౌడ్ తెలంగాణ జిల్లాల్లో జరిపిన ఆత్మ గౌరవయాత్రకు లభించిన స్పందన అంతంత మాత్రమే కావడంతో పొత్తు తప్పేటట్టు లేదు. ప్రజారాజ్యంతో కలసి పనిచేయడమే గౌడ్ ముందున్న ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.

పొత్తులకు సంబంధించి స్పష్టత రావాలంటే కొద్దిరోజులు వేచిచూడాల్సిందే. అంతిమంగా పార్టీల మధ్య పొత్తుకు విధానాలు, సిద్ధాంతాలు, ప్రాతిపదిక కాకపోవడం విచారకరం. శత్రువు శత్రువు మిత్రుడు అన్న సామెతే పొత్తులకు ప్రాతిపదిక. స్వప్రయోజనాలు, అసెంబ్లీలో తమ బలాన్ని పెంచుకోవడం, పక్కవారిని ఉపయోగించుకుని నాలుగు సీట్లను ఎక్కువ తెచ్చుకోవడంపైనే అన్ని పార్టీలు దృష్టి సారించడం ఆవేదన కలిగించే పరిణామం.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved