19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

హైదరబాద్ విమోచన కథ

సెప్టెంబరు 13, 1948 న మొదలై ఐదు రోజులు సాగిన హైదరాబాద్ పోలీసు యాక్షన్ చివరకు నిజాం సైన్యం లొంగిపోవడంతో సుఖాంతమైయ్యింది. నిజాం పోలీసులు, రజాకారుల చేతులలో నలిగిపోయిన హైదరాబాద్ సంస్థానం ప్రజలు ఎట్టకేలకు సెప్టెంబరు 17న స్వాతంత్ర్యపు గాలులు పీల్చుకున్నారు.

ప్రత్యేక తెలంగాణా కోసం ఉద్యమం మళ్ళీ ఉపందుకోవడంతో ఇప్పుడు ప్రతివారు తెలంగాణాపై ప్రత్యేక శ్రధను కనబరుస్తునారు. ఈ నేపథ్యంలో నిజాం రాష్ట్ర విమోచన దినానికి మన రాష్ట్రంలో ఎట్టకేలకు ప్రత్యేక గుర్తింపు కనిపిస్తోంది.

యావద్దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికి నిజాం పాలనలోని హైదరాబాద్ సంస్థానం ప్రజలకు ఏడాదికి పైగా ఆ ఫలాలు అందలేదు. సంస్థానం పాలకుడైన నిజాం నవాబు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ మొండి, దుందుడుకు వైఖరి వల్ల ఈ విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.

స్వాతంత్ర్యానంతరం దాదాపు అయిదువందలకు పైగా సంస్థానాలు నాటి హోంమంత్రి ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో భారతదేశంలో విలీనమైనప్పటికి హైదరబాద్ నిజాం అందుకు ససేమిరా అన్నారు. పాకిస్థాన్, భారత్ లలో కలవకుండా స్వతంత్రంగా ఉంటామంటూ విచిత్ర ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి లేఖ కూడా రాశారు. ఏ రకంగా చూసినా ఆచరణ సాధ్యం కాని ఈ ప్రతిపాదనను విరమించుకోవాలన్ని దేశ అగ్రనాయకుల సూచనలను పెడచెవిన పెట్టారు. చివరికి తగిన ఫలితం అనుభవించారు.

ఇక చర్చలతో ఫలితం లేదని భావించి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానంపై పోలీసుచర్యకు ఉపక్రమించి విజయం సాధించారు. ఎట్టకేలకు సంస్థానం భారత్ లో విలీనమైంది. 1948 సెప్టెంబరు 13న ప్రారంభమైన పోలీసు చర్య 17న నిజాం సైన్యం లొంగుబాటుతో ముగిసింది. అయిదురోజుల పాటు పోరు సాగింది. జనరల్ జయంతోనాధ్ చౌదరి నేతృత్వంలోని దాదాపు 35 వేలమంది భారత్ సైన్యం హైదరాబాద్‌ను అయిదువైపులా ముట్టడించి నిజాం సైన్యాన్ని, రజాకర్లను తేలిగ్గానే లొంగదీసుకుంది. భారత్ సైన్యం ధాటికి సుమారు 40వేల మంది నిజాం సేనలు, పదివేలమంది రజాకార్లు పలాయనం చిత్తగించారు. గండం గట్టెక్కడానికి అంతకుముందు పాకిస్థాన్ సాయం కోరిన నిజాం తన అంచనాలు తప్పడంతో చివరకు భారత్ ప్రభుత్వానికి స్నేహహస్తం చాచక తప్పింది కాదు. ఐక్యరాజ్య సమితికి తాను అంతకుముందు రాసిన లేఖను వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ నిజాంను భారత్ ప్రభుత్వం గౌరవంగానే చూసింది. ఏ లోటూ రానివ్వలేదు. ఎక్కడా అమర్యాద కనబరచలేదు. ఆయనను రాజ్ ప్రముఖ్‌గా నియమించింది. ఎన్నికలు జరిగి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టేంతవరకు నిజాం పేరుమీదనే యావత్తు పాలన సాగింది. ఫజల్ ఆలీ నేతృత్వంలోని రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిటీ సూచన మేరకు దేశంలో ఏర్పడిన తొలి భాషాయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశే కావడం విశేషం. కమిటీ సూచనల మేరకే కన్నడం మాట్లాడే ప్రాంతాలను కర్ణాటకలో కలిపారు. మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో విలీనం చేశారు.

అడ్దూ అదుపు లేని ఆగడాలు

నిజాం పోలీసులు, రజాకార్లు గ్రామాల్లో దోపిడీలు, లూఠీలకు పాల్పడాడరు. అమాయక ప్రజలను హింసించారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ప్రజా క్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. పాలకులు విందువినోదాలతో కాలక్షేపం చేశారు. నీజాం ప్రభుత్వం కన్నడ, మరాఠీ, తెలుగు భాషలను చులకన చేసింది. వాటిని ఎదగనీయకుండా అడ్డుకుంది. అన్నింటా ఉర్దూను అగ్రగామిగా చేసేందుకు ప్రయత్ణించింది. మతం ప్రాతిపదికగా ప్రజల పట్ల విచక్షణ చూపింది. ప్రభుత్వ అరాచకాలు, ఏకపక్ష విధానాలు, పక్షపాత వైఖరితో విసిగిపోయిన ప్రజలు భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని గట్టిగా అభ్యర్థించారు. సైనిక చర్యకు మద్దతు ఇచ్చారు. దీంతో తమ కష్టాలు గట్టెక్కుతాయని భావించారు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved