22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

గుండెకింద నవ్వు

By దేవరకొండ, బాలగంగాధర తిలక్

చేతిలో కలం అలాగే నిలిచిపోయింది

చివరలేని ఆలోచన సాగిపోయింది

ఏదో రహస్యం నన్నావరించుకుంద

అపుడే నీ నవ్వు నా గుండె కింద వినబడింది.

పడుతూలేస్తూ పరుగులిడే మహాప్రజ

పిలుస్తూ బెదురుతూపోయే కన్ను గవ

కాలి సంకెలల ఘలంఘల వినబడే రొద

ఏమీ తోచక భయంతో కళ్ళు మూశాను

అప్పుడే నీ నవ్వు నా గుండె కింద వినబడింది.

ఆకు ఆకునీ రాల్చింది కడిమి చెట్టు

రేకు రేకునీ తొడిగింది మొగలు మొక్క

రెప్ప రెప్పనీ తడిపింది కన్నీటి చుక్క

యెందుకో యీ ప్రాణిప్రాణికీ వెభేదం

ఎరగని నా మనస్సు నాలోనే చెదిరింది.

అప్పుడే నీ నవ్వు నా గుండె కింద వినబడింది.

వెళ్ళిపోయే చీకటిని వదలలేక వదిలే తార

వదిలిపోయే జీవితాన్ని వీడలేక వీడిపోయే లోకం

కాలుజారి పడిన కాలపు పాడు నుయ్యిలో కనబడిన శూన్యం

కాలు కదిపిన చలువరాల సౌధంలో వినబడిన గానం

ఏమిటని ప్రశ్నిస్తే ఏమో అని పలికిన నిశ్శబ్దం

అపుడే నీ నవ్వు నా గుండె కింద వినబడింది.

ఆకాశపు వొంపులోన ఆర్ద్రం వెనుక నీ నవ్వు

పాతాళం లోతులలో ప్రతిధ్వనించి సాగింది

అంధకారపు సముద్రానికి అవతల వొడ్డున నీ రూపం

అందుకోలేని నా చూపుకి ఆశ ఆశగా సోకింది.

రా! ప్రశ్నించే నా మనస్సులో నీ చల్లని చేతితో నిమురుకో

రా! నా కను రెప్పమాటుగా నీ మెరుపు వీణ మెల్లగా మీటుకో

కమ్ముకుంది నాలో భయంతో కలసిన ధైర్యం

ప్రవహించింది నాలో తీరంలేని రజిత నదం

ఇప్పుడే ఇప్పుడే నీ నవ్వు నా గుండె కింద వినబడింది.***

-1944


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved