22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

రోదసిలో మహాద్భుత విజయం.

By పిరాట్ల, వెంకటేశ్వరరావు

ఏప్రిల్ 28, 2008. PSLV - C9 నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. వరుసగా పది ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశ పెట్టింది.

ప్రపంచ రోదసి యాత్ర చరిత్రలో భారతీయ శాస్త్రజ్ఞులు సాధించిన ఘన విజయమిది.భారతీయులందరూసగర్వంగా తలెత్తుకున్న మహత్తరమైన రోజిది. అరవైసంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ముప్ఫైసంవత్సరాల శాస్త్రజ్ఞుల అవిశ్రాంత కృషి ఫలితమిది. ఇస్రో ఆధ్వర్యంలో అప్రతిహతంగా కొనసాగుతున్న విజయపరంపర. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా పది ఉపగ్రహాలను కొన్నిసెకనుల తేడాతో రోదసికి పంపిన ఘనత భారత్‌ది. భారత దేశం అంతర్జాతీయ రోదసి విపణిలో, ఇతర దేశాల ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడం ద్వారా ప్రపంచ వాణిజ్య పరంగా అగ్రగామిగా నిలవగలదని రుజువుచేసుకుంది. ప్రపంచానికి తన విజ్ఞాన పధాన్నిచూపగల శక్తి శాలినిగా భారత్ ఎదుగుతోంది. ఎంతటి మహోత్తరమైన ఘటన యిదీ!

స్వదేసీ టెక్నాలజీ తో స్వావలంబన

ఒక్కసారి పది ఉపగ్రహాలను ,అందునా ఎనిమిది ఇతరదేశాలకు చెందిన వానిని కక్ష్యలోకి పంపటమంటే స్వదేశీవిజ్ఞానాన్ని ప్రపంచానికి చవిచూపించటమే. పరాయి విజ్ఞానాన్ని ఆశించకుండా ఇతర దేశాలపై ఆధారపడకుండా అంతరిక్ష శాస్త్ర విజ్ఞానంలో స్వావలంబన దిశగా పురోగమించడం అంత తేలికైన విషయం కాదు.గతంలో రష్యాకూడా ఇటువంటి ప్రయోగం తలపెట్టినప్పటికీ, ఆ ఉపగ్రహాల బరువు కేవలం మూడు వందల కిలోలు మాత్రమే. నేడుమన ఇస్రో పంపిన పది ఉపగ్రహాల బరువు ఎనిమిది వందల పాతిక(825) కిలోలు. ప్రపంచములోని ఏదేశము మన దరిదాపులలో లేదు.

సారాభాయ్ వేసిన బీజం

ఆ నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రోత్సాహంతో అంతరిక్షరంగంలో అడుగు పెట్టి,అంతరిక్ష ప్రయోగాలకు ఆద్యుడైన వాడు విక్రంసారాభాయ్.మన దేశ అంతరిక్ష పరిశోధనా పితామహుడుగా జాతి ఆయనను స్మరించుకుంటున్నది. ప్రధమ భారతీయ ఉపగ్రహం ఆర్యభట్టను మన ఇస్రో 1975 లో ప్రయోగించింది. నేటి ప్రస్తుత సారధి మాధవన్‌నాయర్ ఆ నాడు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ నాయకత్వంలో 1980 నాటికి ఉపగ్రహ వాహక నౌక ఎస్.ఎల్.వి. ప్రయోగాన్ని విజయవంతం చేయడంలో పాలుపంచుకున్నారు. ఇప్పుడు నాయర్ సారధిగా మరో విజయంతో చారిత్రలో తనకు స్థానం కల్పించుకున్నారు. నేడు యీరంగంలో "చంద్రయాన్ " పేరిట చంద్రమండలానికి మనవారు వెళ్ళగలిగేంతగా మనదేశం కృషి చేస్తున్నది. 2025 నాటికి ఆ కలలు ఫలించగలవని ఆకాంక్ష.ఆనాటికిప్రపంచంలోనే యీదేశం అగ్రగామిగా నిలువగలదని మన శాస్త్రజ్ఞుల అంచనా.

ఇటీవల జరిగిన అంతర్జాతీయ ఖగోళ సదస్సు , "రోదసి విజ్ఞానాన్ని బహుళ ప్రయోజన సాధనంగా మలచడంలోవారికి వారే సాటి" అని భారతదేశ శాస్త్రజ్ఞుల ప్రతిభను కొనియాడింది. గత సంవత్సరంలో నాలుగు ఉపగ్రహాలను ఒకేసారి పంపటంలో ఇస్రో విజయం సాధించింది.

కరువవుతున్న ప్రోత్సాహం

ఇరవైఒక్క నెలల ముందు అగ్ని-3 క్షిపణి, జి.ఎస్.ఎల్.వి ప్రయోగం వైఫల్యం చెందితే,శాస్త్రజ్ఞులు తమ శక్తిసామర్ధ్యాలను సరియైన అంచనా వేసుకుని మున్ముందు ప్రయోగాలు చేయాలని పార్లమెంటరీ స్థాయీ సంఘంవారు ఉచిత సలహా పారేశారు. ఇప్పుడు దీనికి వారేమని జవాబిస్తారో?

ఈ ప్రయోగాలకు అయ్యే ఖర్చు వందలకోట్ల రూపాయలలో వుంటుంది.ఒక ప్రయోగం విఫలమైతే వందలాది శాస్త్రజ్ఞుల రాత్రింబవళ్ళ కృషితో పాటు కోట్లరూపాయలను జాతి నష్టపోగలదు. అయినప్పటికీ, మన శాస్త్రజ్ఞులు మొక్కవోని దీక్షతో మూడు దశాబ్దాల కు పైగా కష్టపడి యీ రంగంలో విజయం సాధించారు. నేడు దక్షిణ కొరియా, బెల్జియం , ఇండోనేషియా,అర్జెంటినా,కెనడా,డెన్మార్క్, జపాన్,జర్మనీ మొదలైన దేశాలకు ప్రయోగవాహక సేవలందించడంలో భారత దేశాన్ని అగ్రగామిగా నిలిపారు.

ప్రతి వైఫల్యాన్ని విమర్శించే మన నాయకులు, అన్నింటికంటే ముందు ఇస్రోకు కావల్సిన బడ్జెట్ నిధులను సమృద్ధిగా కేటాయించకపోతే మేథావులైన శాస్త్రజ్ఞులవలసలను ఆపడం ఎవరితరం గాదు. ఈ మానవ వనరులను మన దేశంలో వుండేట్లుగా కాపాడుకొనకపోతే దేశం ఎంతగానో నష్ఠపోగలదు. అట్టి నష్టాన్ని నివారించడానికి మన ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలి.

ఇంతటి మేథాశక్తిని కల్గిన మాధవన్‌నాయర్‌సర్వశక్తివంతుడు ఆ సర్వేశ్వరుడేనని నమ్మేవ్యక్తి కావటం విశేషం.అందుకు ఆదివారం తిరుపతిలో ఆదేవదేవుని దర్శనం చేసుకున్నాడు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved