17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

బుద్ధిహీనులు

By ప్రయాగ, రామకృష్ణ

ఒక అడవిలో ఒకానొకప్పుడు ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన ఆత్మనిష్ఠ, సాధుతత్వ్తం, సజ్జన స్వభావం ప్రభావాన అక్కడ ఉన్న జంతువులన్నీ పరస్పర వైరాన్ని మరచి కలసిమెలసి ఉండేవి. ఆశ్రమ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా అవి మహర్షి దగ్గరకు వెళ్ళి ఆయన చుట్టూరా తిరిగి బుద్ధిగా ఆయన ముందు కాసేపు కూర్చుని వాటిదోవన అవి పోతుండేవి. ఇలా ఉండగా, ఒకసారి గ్రామాల్లో తిరిగే ఒక శునకం ఆశ్రమప్రాంతానికి వచ్చింది. వచ్చి అక్కడే ఉండిపోయింది. అది కూడా మహర్షి మీద అవ్యాజమైన అభిమానం పెంచుకుంది. ఇలా ఉండగా ఒకనాడు మంచి ఆకలిమీద ఉన్న చిరుతపులి ఒకటి ఆశ్రమప్రాంతానికి వచ్చి శునకాన్ని చూసి లొట్టలేసింది. అది చూసి శునకం భయపడి పరుగెత్తుకుంటూ వచ్చి మహర్షిని శరణువేడింది. గజగజ వణికిపోతున్న కుక్కను మహర్షి అభయమిచ్చి దానిని కూడా చిరుతపులిగా మార్చేశాడు. ఈ అనూహ్య సంఘటనతో మొదటి చిరుత తోక ముడిచింది. దాంతో చిరుతరూపంలో ఉన్న గ్రామసింహానికి ఎక్కడలేని ధైర్యం వచ్చి అడవంతా యథేచ్ఛగా తిరగడం ప్రారంభించింది. ఆ తరువా తకొన్నాళ్ళకు మళ్ళీ ఇలాగే జరిగింది. అడవిలోకి కొత్తగా వచ్చిన ఒక పెద్దపులి చిరుతరూపంలో ఉన్న శునకాన్ని భయపెట్టింది. అది గోలుగోలున ఏడుస్తూ మహర్షి దగ్గరకు వెళ్ళింది. మహర్షి దానిని కూడా వ్యాఘ్రంగా మార్చాడు. పెద్దపులిగా మారిపోవడంతో కుక్కకు అప్పటి వరకూ ఉన్న సాత్విక స్వభావం, విశ్వాసం అన్నీ క్రమంగా సన్నగిల్లాయి. మాంసాహారానికి అలవాటుపడింది. కానీ తన సహజ లక్షణాల్లో ఒకటైన భయం మాత్రం కుక్కలో తొలగలేదు. ఇంకెప్పుడో ఒకసారి మదపుటేనుగును చూసి, మరోసారి సింహాన్ని చూసి భయపడితే మహర్షి కుక్కను కూడా ఏనుగుగా, సింహంగా మార్చేశాడు. అయితే, కుక్క ఎప్పుడైతే సింహంగా మారిందో అప్పటి నుండి అది భయంకరమైన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ అడవిలోని జంతువుల్ని ఆశ్రమప్రాంతానికి రాకుండా చేసింది.

ఇలా కొంతకాలం గడిచాక ఎనిమిది కాళ్ళు, నెత్తిమీద కళ్ళూ ఉండి, సింహ- గజాలు కలగలిసిన రూపంతో ఉన్న అతిభయంకరమైన శరభమృగం అడవినంతా చికాకుపరుస్తూ అక్కడకు వచ్చింది. మళ్ళీ కథ మామూలే. మహర్షి దయవల్ల కుక్క శరభంగా మారిపోయింది. దాన్ని చూసి మొదటి శరభం సత్తువకొద్దీ పరుగెత్తింది. శరభరూపంలో ఉన్న కుక్క అది చూసి విరగబడి నవ్వింది. ఇంకా దానికి పట్టపగ్గాలు లేకుండాపోయాయి. దాని ప్రవర్తన పూర్తిగా మారింది. ప్రతి జంతువునూ హింసించేది. ప్రతి చిన్నప్రాణినీ భయపెట్టేది. అవి దీనంగా ఏడుస్తూ విలవిలలాడుతుంటే శరభరూపంలో ఉన్న కుక్క రాక్షసానందం అనుభవించేది. అలా ఉండగా, ఒకరోజు దానికో అనుమానం కలిగింది. "ఈ మహర్షి ఇన్నాళ్ళూ నారూపాన్ని నేను కోరినట్టు మార్చాడు. అయితే, నాలాగే ఈయనను శరణుకోరి బతుకుతున్న జంతువులు అనేకం ఈ అడవిలో ఉన్నాయి. వాటికి కూడా నాలాగే ఎప్పుడో అప్పుడు ఏ ఆపదో ముంచుకొచ్చి ఈయనను శరణుకోరితే వాటిని కూడా మహర్షి పులిగానో, సింహంగానో, అంతకంటే ఇంకా ఏదైనా పెద్ద జంతువుగానో మార్చవచ్చు. అప్పుడు నా గతేమిటి!?" అనుకుంది.

పేజి   1 |   2 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved