22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

మదర్ థెరిసా

By వై, వెంకటరత్నం

అమ్మ అందరికి వుంటుంది. ఆకలి వున్నప్పడు అన్నం పెట్టేది. అనారోగ్యంతో వున్నపుడు సేవ చేసేది, ఏడుస్తుంటే ఓదార్చేది అమ్మ. నాకు దేవుడు లేడు అని చేప్పేవారుంటారేమో గాని నాకు అమ్మ లేదని చేప్పేవారుండరు. ఒక్కరికి ఒక అమ్మే ఉంటుంది. అయితే యావత్ప్రంచానికీ అమ్మగా ఎందరో దీనులకు సేవ చేస్తున్న తల్లి, విశ్వమాత మదర్ థెరీసా.. "మాతృదేవోభవ"అని, తల్లి దైవంతో సమానమని, తల్లిని పూజించవలెనని చెబుతారు. మాతృమూర్తి లాంటి మదర్ థెరీసా దారిద్ర్యంలో మగ్గుతున్న వారిని దరిచేర్చి కాపాడుతుంది. అన్నార్తులకు అన్నం పెడుతుంది. రోగపీడితులకు మందులిచ్చి రక్షిస్తుంది, మరణ శయ్యపై వున్న వారికి "నువ్వు దైవ సన్నిధికి వెళుతున్నావు. దిగులు పడకు, బాధపడకు, ప్రశాంతంగా వుండు"అని ధైర్యం చెబుతుంది. "మాకు తోడుగా నీడగా నేనున్నాను"అని నిండుగా నవ్వుతూ పలుకుతుంది.

ఆకలి గొన్న వాడికి అన్నం పెడదాము, బట్టలు లేని భగవంతునికి బట్టలిద్దాము, ఆర్తితో పిలిచే భగవానునికి సేవ చేద్దాం అంటూ దుఃఖ పీఢితులు, రోగ బాధితులు, అన్నం కోసం అలమటించే వారిలో దైవాన్ని చూడగలిగిన మహనీయురాలు మదర్ థెరీసా.

1910 ఆగష్టు 27వ తేదీన యుగోస్లేవియాలో స్కోప్జేలో అల్బేనియన్ దంపతులైన నికోలస్ బొజాక్ష్యు, డ్రనఫైల్ బెర్నైలకు థెరీసా జన్మించింది. వారు రోమన్ కేథలిక్ మతస్ధులు. థెరిసా తల్లి దండ్రులకు ముగ్గురు సంతానం. థెరీసా అసలు పేరు ఆగ్నెస్ గోన్క్సా బొజాక్ష్యు. అనగా పుష్పపు మొగ్గ అని అర్ధం. తండ్రి దైవభక్తి, ధర్మబుద్ధి కలవాడు. తల్లి దేవుని పట్ల ఎంతో విశ్వాసం గలది. తన పిల్లలను దైవసేవా తత్పరులు, ఎంతో భక్తి ప్రపత్తులు గలవారిగా తీర్చిదిద్దింది.

తొమ్మిదేళ్ళ వయస్సులో ఆగ్నెస్ తండ్రి మరణించాడు. తల్లి కష్టపడి పిల్లలను చదివించింది. ఆగ్నెస్ సేవాగుణం చిన్న వయస్సులోనే అందరిని ఆశ్చర్యపరచింది. ఒకరోజు పాఠశాలకు ఆలస్యంగా ఎందుకు వచ్చావని ఉపాధ్యాయుడు ప్రశ్నించినపుడు, ఒక ముసలి వాడు జ్వరంతో స్పృహ తప్పి రోడ్డు మీద పడిపోతే ఆయనను ఆసుపత్రిలో చేర్పించి వస్తున్నానని ఆగ్నెస్ ఇచ్చిన సమాధానానికి ఉపాధ్యాయిని మనసు ఆనందంతో నిండి పోయింది.

థెరీసా తన బాల్య జీవితం గురించి రెండు విషయాలు ఎల్లప్పుడు గుర్తు చేసుకుంటారు. ఒక రోజు ఆగ్నెస్ తన స్నేహితులతో అనవసర సంభాషణలతో కాలం వ్యర్ధం చేస్తున్నప్పుడు తల్లి విద్యుద్దీపాన్ని ఆర్పివేసింది. కారణమేమని అడిగిన థెరిసాకు అనవసర సంభాషణలకు కరెంటు వృధా చెయ్యకూడదని ఆమె సమాధానమిచ్చింది. మరోసారి కుమార్తెను ఒక బుట్టనిండా ఆపిల్ పళ్ళు తీసుకురమ్మని చెప్పి వాటిలో ఒక చెడిపోయిన యాపిల్ పండు వుంచమని చెప్పింది. కొద్ది రోజుల తరువాత వాటిని చూడమని ఆగ్నెస్ ను ఆదేశించింది. ఆ బుట్టలో పళ్ళన్ని పాడవడంచూసిన ఆగ్నెస్ నిశ్చేష్టురాలైంది. ఒక చెడ్డ వారిని బట్టి ఎందరో మంచివారు కూడా పాడవుతారనే పాఠం ఆగ్నెస్ ఎన్నడు మరువలేదు.

యుగోస్లేవియాకు చెందిన "జెసూట్" భారతదేశానికి మత ప్రచారం కోసం వచ్చి కలకత్తా నగరంలో నిరుపేదలకు సేవలు చేస్తున్న విషయం ఆగ్నెస్ దృష్టికి వచ్చింది. వారిలాగే తన జీవితాన్ని కూడా మానవసేవకు సమర్పించాలని, నన్ గా మారాలని నిర్ణయించుకుంది ఆగ్నెస్. 18 ఏళ్ల వయసులో 1928 సెప్టెంబరులో ఐర్లండులోని డబ్లిన్ లారెట్ బీ (ఆగ్నెస్ ఆఫ్ సిస్టర్స్ ఆఫ్ లొరెటో) సేవా కేంద్రంలో చేరింది.

భారత దేశంలో సేవ చేయాలన్న దృక్పధం కల్గి వున్న ఆగెస్ 1929 సంవత్సరం జనవరి లోకలకత్తా చేరుకుంది. 1931 మార్చి 24 వ తేదీన లొరెటా సిస్టర్ గా ఆమె ప్రమాణ స్వీకారం చేసింది. విథేయత తో, పేదరికంలో పవిత్రంగా జీవించడానికి ప్రమాణం చేసింధి. ఆ తరువాత ఒక ఫ్రెంచినన్, థెరిసా, మార్టిన్ సేవలతో ప్రేరణ పొంది "థెరిసా" గా మారారు. ఎన్నో కఠిన నియమాలతో, క్రమ శిక్షణ కల్గిన జీవన మార్గంలో ప్రయాణానికి థెరిసా ఎన్నడు భయపడలేదు. ఆమెకు ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తిలో కలకత్తాలోని సెంట్ మేరి ఉన్నత పాఠశాలలో కొన్నేళ్ళు భూగోళ శాస్త్రాన్ని వోధించి ఆ తరువాత అదే పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా పని చేశారు. 1946 సెప్టెంబరు 10వ తేదీన డార్జిలింగు రైలులో వెళుతుండగా "దేవుని పిలుపు" ఆమెకు వినవచ్చింది. దుర్గంధంతో నిండిపోయిన మురికివాడల్లోని దీనాతి దీనులైన పేద ప్రజలకు సేవ చేయాలన్నదే ఆ పిలుపు. ఈ పిలుపు లో దేవుని ఆదేశం వున్నది. దేవుడి తన నుంచి ఇంకా ఏదో సేవను కోరుచున్నాడు. నిరుపేదలైన ప్రజలకు సేవ చేయడం ద్వారా వారిలో దేవుని చూచి ప్రేమించాలి అని థెరిసా తలచారు. ఆ ప్రకారమే మురికివాడలలో మ్రగ్గుతూ పేదరికంలో నున్న ప్రజలకు సేవ చేయాలని థెరిసా తలచారు. కాన్వెంటు వదిలి కలకత్తా మురికివాడలో సేవ చేయడానికి మదర్ సుపీరియర్ నుండి, లొరేటా ఆర్డరు నుండి, రోమ్ నుండి థెరిసాకు అనుసతి లభించింది.

1950 అకోబరు 7వ తేదీ మానవజాతికే మంచిరోజు. దేవుని పిలుపునందుకున్నదే తడవుగా కరుణామయి థెరిసా, దీనాతి ప్రజలకు సేవ చేస్తూ, కలకత్తా వాసులకు , యావత్ ప్రపంచానికీ "అమ్మ" కాగలిగారు. విశ్వమాతగా పేరొంది కోట్లాది ప్రజల హృదయాల్లో సుస్ధిర స్తానాన్ని పొందారు.

ఇదంతా ఒక్క రోజులో సాధించిన విజయం కాదు. అంచెలంచెలుగా ఒక్కోక్క మెట్టు ఎక్కుతూ, తన సేవా పరిధిని పెంచుకుంటూ మున్ముందుకు ప్రయాణం సాగించింది. 1948 డిసెంబరు 21వ తేదీన కలకత్తాలోని మోతిజ్ హిల్ మురికివాడలలో ఒక పాఠశాలను స్ధాపించింది. మురికివాడలలో పిల్లలందరూ పాఠశాలకు రావడం మొదలు పెట్టారు. మొదట్లో కుర్చీలుగాని,బెంచీలు గాని బల్లలు గాని ఆ పాఠశాలలో లేవు. నేలమీదే వ్రాసేవారు. ప్రధమంగా వారితో కలిసి పని చేందుకు సుభాషిణి దాస్ ను నియమించారు. ఆమె సిస్టర్ ఆగ్నెస్ గా పేరొంది ధెరిసాకు కుడిభుజంగా నిలిచింది. 1950 లో మిషనరీస్ ఆఫ్ చారిటీని కలకత్తాలో స్ధాపించారు. మైకేల్ గోమ్స్ అనే వ్యక్తి ఆమెకు కావలసిన వసతి సమకూర్చారు.

1952 లో కలకత్తా లో ఒక వీధిలో భోరున వర్షం కురుస్తున్న రోజున నేలపైబడి మృత్యవుతో పోరాడుతున్న ఒక స్త్రీని థెరిసా చూశారు. వెంటనే ఆమెను చేతులతో ఆమెను ఎత్తుకుని సమీపంలోని ఇంటి వరండాలోకి చేర్చారు. ఆ స్త్రీ థెరిసా చేతులలోనే ప్రాణాలను విడిచింది. అయితే చనిపోయే ముందు ఆ స్త్రీ పెదాలపై ఒక చిరునవ్వు మెదిలింది. ఆఖరి క్షణాల్లో తనను రక్షించే ఒక వ్యక్తి వున్నారని తృప్తితో చనిపోయింది. ఈ సంఘటన "నిర్మల్ హృదయ" ఏర్పాటుకు థెరిసాకు ఎంతో ప్రేరణను కల్గించింది. మృత్యువు కి చేరువవుతున్న వారికి ఆశ్రయం ఇవ్వడం కోసం కలకత్తాలో ఒక ఇల్లు ఇమ్మని అధికారులను కోరారు. వారు కాళీమాత ఆలయం దరిలో "కాళీబారీ" లోని ఇంటిని ఇచ్చారు. ఆ ఇంటికే "నిర్మల హృదయ్ "అని పేరు పెట్టి దానినొక దేవాలయంగా చూసుకున్నారు.

ప్రపంచంచే వెలివేయబడి వదిలి వేయబడిన అనాధలకు, ఆర్తులకు నిర్మల్ హృదయ్ లోని సిస్టర్స్ ఆశ్రయమిచ్చి ఆదరిస్తారు. విడిచి పెట్టబడిన దిక్కులేని పిల్లల కోసం థెరిసా నిర్మల శిశుభవన్ ను స్ధాపించారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆగ్రాలో బాలల శరణాలయాన్ని స్ధాపించినప్పుడు రూ. 50 వేలు అవసరమయ్యాయి. అదే సమయంలో మెగసేసే అవార్డుకు మదర్ థెరిసాను ఎంపిక చేసినట్లుగా థెరిసాకు ఫోన్ లో సమాచారం అందింది. ఈ వార్తవిన్న ఆమె దేవుడు ఈ శరణాలయాన్ని కట్టాలని కోరుచున్నారని చెప్పారు.

మదర్ థెరిసాకు ప్రేమే దైవం. సేవను నమ్ముతుంది. దేవుని పట్ల భక్తి, పేదలకు సేవ చేయడం ద్వారా చేతలతో చూపిస్తుంది. మదర్ హౌస్ లోని ఒక నల్లబల్లపై ప్రతిరోజు చేసే ప్రార్ధన ఇలా ఉంది.

	నిశ్శబ్దత ఫలం ప్రార్ధన
	ప్రార్ధన ఫలం విశ్వాసం
	విశ్వాస ఫలం ప్రేమ
	ప్రేమ ఫలం సేవ

కుష్టు రోగుల కోసం మదర్ థెరిసా ప్రేమదాస్ అనే ఆశ్రమాన్ని కలకత్తాకు సమీపంలో స్ధాపించారు. కలకత్తాకు 200 కి.మీ.ల దూరంలో 30 ఎకరాల్లో కుష్టు రోగుల కోసం శాంతి నగర్ ను నిర్మించారు. నాలుగు వందల యాభై పైగా విద్యాసంస్ధలలో 400 సంచార ఆసుపత్రులను, 100 పోషకాహార కేంద్రాలను నడుపుతున్నారు. అనాధలకు, వికలాంగులకు, మృత్యముఖంలో వున్నవారికి, మత్తు మందులకు బానిసలైన వారికి, కుష్టువ్యాధి గ్రస్తులకు, ఎయిడ్స్ రోగులకు ఆశ్రయం కలిగిస్తున్నారు.

ప్రపంచమంతా మదర్ సేవలను గుర్తించింది. 1962 ఏప్రిల్ లో ప్రభుత్వం మదర్ కు పద్మశ్రీ బిరుదునిచ్చి సత్కరించింది. అదే సంవత్సరం ఆగష్టు నెలలో ఫిలిఫైన్స్ ప్రభుత్వం రామస్ మెగసేసే అవార్డునిచ్చి సత్కరించింది. 1970 సెప్టెంబరు లో ఆమె నిస్వార్ధ సేవను గుర్తించి "గుడ్ సెమేరిటన్"అవార్డును అమెరికా అందచేసి పేదవారిని గౌరవించినట్లు భావించింది. 1971 జనవరిలో పోప్ జాన్ 23వ శాంతి బహుమతులు పోప్ జాన్ అందజేశారు. 1972 లో జవహర్ లాల్ నెహు అవార్డు ఫర్ ఇంటరేషనల్ అండర్ స్టాండింగ్ 1973 మతంలో అభివృద్ధిని సాధించినందులకు గాను టెంపుల్ టన్ అవార్డును ఇంగ్లండ్ కు చెందిన ఫిలిప్ రాకుమారుడు ప్రధానం చేశారు. 1974 లో మ్యాటర్ ఎట్ మెజిస్ర్టా అవార్డును అమెరికాలో ప్రధానం చేశారు. 1970వ సంవత్సరంలో సమాజ సేవకు అత్యంత ప్రతిష్టాకరమైన "నోబుల్ శాంతి బహుమతి"కి థెరిసాకు ప్రకటించారు. మన దేశం అందించే అత్యున్యత పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవరెడ్డి మదర్ కు అందచేశారు. ఐక్యరాజ్య సమితి విభాగమైన ప్రపంచ ఆహార సంస్ధ, ఆకలినిపారద్రోలడానికి పని చేసిన వారికిచ్చే "సెరెస్ మెడల్" ను థెరిసాకు ప్రధానం చేశారు. 1983 నవంబరు 23ల బ్రిటీష్ రాణి రెండవ ఎలిజబత్ మదర్ కు "ఆర్డర్ ఆఫ్ మెరిట్" అవార్డును ప్రధానం చేశారు. "భారత్ కి సుపుత్రి" అవార్డును కూడా ఆమె అందుకున్నారు. ఆమె జీవితాంతం అహర్నిశలు పేదల కోసం దుఃఖార్తుల కోసం విద్యార్ధి సేవ చేసి ప్రపంచమందలి ప్రజలంతా ఆమెను మానవతా మూర్తిగా దైవాంశ సంభూతురాలిగా అభివర్ణించారు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved