22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

శ్రీ గుర్రం జాషువా

By వై, వెంకటరత్నం

“పుట్టుకతో దళితుడై,
కృషిలో కవిశేఖరుడై,
నవయుగ కవిచక్రవర్తియై
తన కవితా యాత్ర విజయ కేతనాన్ని
తెలుగు సాహితీ గగనంలో 
ఉవ్వెత్తున ఎగరేసిన విశ్వమానవుడు శ్రీ గుర్రం జాషువా”

1895 సెప్టెంబరు 2వ తేది గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. ఇక ప్రక్క దారిద్ర్యం మరోవంక కులమత పోరులో ఆయన బాల్యం, యవ్వనం గడిచింది. తండ్రి వీరయ్య క్రైస్తవ మతం స్వీకరించిన యాదవుడు. తల్లి లింగమ్మ ఆది ఆంధ్ర కులమునకు చెందిన మహిళ. వారిది చాలా బీద కుటుంబం. ఉన్నత పాఠ శాల చదువు ముగించి శిక్షణ పూర్తి చేశారు. 195-16 సం||లలో రాజమండ్రి లో మూకీ చిత్రాల కధావాచ్చకుడిగా పనిచేశారు. చింతామణి నాటక మండలిలో నాటక కర్తగా పనిచేశారు. 1919 నుండి 1929 వరకు గుంటూరు లోని లోథరస్‌ చర్చి వారి ఉపాధ్యా శిక్షణా సంస్థలో అధ్రాపకులుగా పనిచేశారు. “ఉభయ భాషా ప్రవీణ” పట్టం పుచ్చుకున్న జాషువా 1928-42 మధ్య గుంటూరు జిల్లా బోర్డ్ పాఠ శాలలో తెలుగు పండిత్ పదవి సాగించారు. 1942 -45 మధ్య బ్రిటీషు ప్రభుత్వ యాజమాన్యంలో భారత్ ప్రభుత్వం నెలకొల్పిన జాతీయ యుద్ద ప్రచారక్ సంఘంలో ప్రచారకులుగా పనిచెశారు. 1957-59 ల మధ్య మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో ప్రొడ్యూసర్‌గా ఉద్యోగం చేశారు. 1964 లో ఆంధ్ర ప్రభుత్వం జాషువా గారిని శాసన మండలికి నామినేట్ చేసింది. ఏ ఉద్యోగం చేసినా అది జీవించడానికి మాత్రమే సాధనంగా ఉపయోగించుకొన్నారు. ఆయన జన్మతహా కవి. కాని కవిగా బ్రతకడం అసాద్యమని తెలిసి బడిపంతులు అయ్యారు. జాషువా గారు అకుంటిత దీక్షతో కావ్య రచనకు ఉపక్రమించారు. ఒక జాతికి, ఒక మతానికి చెందిన కవిత్వాలు అసలు కవిత్వాలే కావు. గగన సంబావం లేని కవిత్వం నా లక్ష్యం అని అన్నారు.

జాషువా గారి రచనలన్నీ ఖండ కావ్యాలు. వాటిలో పరదేశి, గబ్బిలం, కాందిశీకుడూ, ముంతాజ్ మహల్, స్వప్న కధ, నేతాజీ, క్రీస్తు చరిత్ర, క్రొత్త లోకం ప్రసిద్ది పొందినవి. ఆయన ఆత్మకధను మూడు సంపుటాలుగా “నా కధ” అనే శీర్షికను వ్రాశారు. జాషువా కవి కర్ణున్ని తలపింప జేస్తారు. జాషువా గారు అభ్యుదయవాది. వర్గ సంఘర్షణ, ఆర్ధిక వ్యత్యాసాల నిర్మూలన దోపిడి వర్గాల పై తిరుగుబాటు జాషువా గారి కావ్యాలలో నిండుగా ఉన్నాయి. దీనుల పట్ల సంఘం అణిచివేసిన వారి పట్ల సానుభూతిలో కలం కదిలించిన కవి జాషువా. సంఘసంస్కరణ ఆయన కావ్యలక్ష్యం. ఆకలిని, శోకాన్ని నిర్మూలించాలన్నదే ఆయన ధ్యేయం. అంధ విశ్వాసాలను, మత విద్వేషాలను తీవ్రంగా నిరశించారు. చిత్త శుద్ది లేని పెత్తం దార్లను, గుత్త స్వాములను నిలదీసి ప్రశ్నించేవారు. ఆస్తి అందరిది కావాలని, కొందరికే పరిమితం కారాదని ఆయన ఆభిమతం. ఆయన కవితకు వస్తువులు మానవత్వం, హేతువాద, కరుణా రసం.

ఒకసారి ఆయన వార్దాకు గాంధీజీ దర్శనం కొరకు వెళ్ళారు. అక్కడ ఉన్న ఒక రాజకీయ నాయకుడు ఒక జర్మన్‌ పండితుడికి జాషువాను క్రైస్తవ కవిగా పరిచయం చేశారు. ఆ మాట విని కవితకు కులమతాల ముద్రలు వద్దని చెప్పారు. జాషువా గారు గోపరాజు రామచంద్రారావు (గో.రా.) గారితో వియ్యం అందుకున్నారు.

గుంటూరు లోని భూస్వామి ఏకా ఆంజనేయులు గారు జాషువా గారికి ఒక ఎకరం సుక్షేత్రమైన పంట భూమిని దానముగా ఇచ్చారు. మిత్రులు వారికి ఒక ఇల్లు కట్టి ఇచ్చారు.కనకాభిషేకాలు, గజారోహణ ఆది సత్కారాలు, గండపెండేరాలు మొదలగు సత్కారాలు అందుకున్నారు. భారత ప్రభుత్వం “పద్మభూషణ్” బిరుదుతోగౌరవించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం “కళా ప్రపూర్ణ” బిరుదునిచ్చి సత్కరించింది.

కవికోకిల, కవితా విశారద, నవయుగ, కవి చక్రవర్తి మున్నగు బిరుదులు అందుకున్న మహనీయుడు జాషువా. ఆనాటి ఆస్థాన కవి చర్ల పల్లి వెంకట శాస్త్రి గారు స్వయంగా గండపెండెరం తొడగడం జాషువాగారి జీవితంలో ఓ మరుపురాని ఘట్టం.

తనకు జీవితం ఎన్నో పాఠాలు నేర్పింది అంటూ నాకు ఇద్దరు గురువులు ఉన్నారని అన్నారు. ఒకరు పేదరికం, మరొకరు కులమతభేధం. నవ్వుతూ చలోక్తులు విసురుతూ తన మీద ఎవరైనా చలోక్తులు విసిరినా ఆయన ఎంతో ఆనందించేవారు. మహాకవి విశ్వనాధ సత్యనారాయణ జాషువాను మధుర కవిగా పిలిచేవారు. ఒకానొక మాధుర్యం ఆయన కవిత్వంలో సరస్వతీ దేవి అనుగ్రం వల్ల లభించిదని శ్రీ విశ్వనాధ పేర్కొన్నారు. జాషువా కవితా కంఠము విలక్షణమైంది. యావన్మంది ప్రజల సుఖ సంతోషాలకోసం, ఎవరు అవమానం కాకూడదన్న లక్ష్యం కోసం జాషువా కవిత ఆక్రోశించేది. జాషువా విశ్వమానవ సందేశాన్ని సమతా దృక్పధాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళే ఉద్దేశ్యంతో జాషువా ఫౌడేషన్ స్తాపించారు. సమకాలీన సరస్వతీ జగత్తులో సహన శీలిగా, శాంత మూర్తిగా ప్రఖ్యాతిగాంచిన జాషువా 1971 జులై 24 వ తేదీ పరమపదించారు. 1994 సెప్టెంబరు 24 నుండి ఒక ఏడాది కాలం జాషువా శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. జాషువా ఫౌండేషన్ వారు భారతీయ సాహిత్యంలో మానవతా విలువలు పెంపొదించే లక్ష్యంతో లక్షరూపాయలు నగదు పురస్కారాన్ని నెలకొల్పింది. ఈ నగదు పురస్కారం పొందిన వారు మళయాల కవి డా|| ఒక.ఎన్.వి.కురు. బెంగాలి కవి శ్రీ శంకర్‌ ఘోష్, హిందీ కవి కేధాల్ నాధ్ వంటి మహాకవులు ఉన్నారు.

ఈనాడు సంఘసంస్కర్తలకు జాషువా ఆదర్శ పురుషుడు. తెలుగు ప్రజల కవి. భాషా చంధస్సులో భావ కవి. వడగాల్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం అని ఆయన చెప్పారు. నిత్య జీవితంలో కాని సాహితీ జీవితంలో గాని ఎన్ని కష్టాలు ఎదురైన ధీరత్వంలో నిబ్బరంగా ఎదుర్కోవడం ఆయన విజయ సంకేతం. జాషువా కవితాభిమానులు ఆయన కవితా పటిమను ధీరోదాత్తతను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగు జాడలలో నడవడం ఆ మహనీయునికి నిజమైన కవితాంజలి.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved