19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

నవయుగ వైతాళికుడు గురజాడ

By వై, వెంకటరత్నం

ఆంధ్రులందరికీ సుపరిచితమైన కన్యాశుల్కం నాటకాన్ని రచించిన గురజాడ సమాజంలో కుల - మత వర్గాలను రూపుమాపేందుకు ఎంతో కృషి చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వైతాళికుల్లో చెప్పుకోదగిన వ్యక్తి శ్రీ గురజాడ . ఆంధ్రుల హృదయాల్లో తమ రచనలతో చెరగని ముద్రవేసి చిరస్మరణీయులైనారు. అందుకే నేటికి కూడాఆయన పేరు తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. “దేశమంటె మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్; దేశమును ప్రేమించుమన్న - మంచి అన్నది పెంచుమన్న” అని ఎలుగెత్తి చాటిన తెలుగు వైతాళికుడు. బాల్య వివాహాలు, కన్యాశుల్కం వంటి సాంఘిక దురాచారాలను రూపుమాపిన గొప్ప సంస్కర్త శ్రీ గురజాడ.

శ్రీ గురజాడ విశాఖ పట్నం జిల్లా రామవరం గ్రామంలో 1861వ సంవత్సరంలో జన్మించారు. తెలుగు భాషొద్దరణకు తెలుగు వ్యవహారిక భాష వినియోగానికి నిరంరరం కృషి చేశారు. ఆయన డిగ్రీ చదువు పూర్తి అయ్యాక విజయనగరంలో డిప్యూటి కలెక్టర్‌ ఆఫీస్‌లో గుమాస్తా గా చేరారు. ఆనాడు విజయనగర సంస్ధానాధిపతి శ్రీ ఆనంద గజపతి. ఆయన ప్రతిభా పాటవాన్ని గుర్తించి విజయనగరం కాలేజీలో ఆంగ్ల ఆధ్యాపకునిగా నియమించారు. ఆధ్యాపకునిగా ఆయన మంచి పేరు ప్రతిష్టలు పొందారు. ఆనాటి రోజుల్లో బాల్య వితంతువులు, వేశ్యలు ఆధికంగా వుండటంవల్ల, సంఘ దురాచారాలవల్ల ఎంతో మంది బాధ పడేవారు. వారి జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని నాటకాన్ని రాశారు. నాటకంలో ‘గిరీశం పాత్ర’ చిరస్మరణీయమైంది. తెలుగు సాహిత్యంలో మరచిపోలేని కొన్ని పద ప్రయోగాలు గిరీశం మాటల్లో పలికించారు. ‘గిరీశంతో మట్లాడటం ఒక ఎడ్యుకేషన్’, ‘డ్యామిట్ కధ అడ్డం తిరిగింది.’ ఇటువంటి పదాలు తెలుగు వారి జీవితంలో, నిత్య వాడకంలో ఉన్నాయి.

శ్రీ అప్పారావు గొప్ప చరిత్ర కారులుగా కూడా ప్రసిద్ది పొందారు. ప్రాచీన శాసనాలను తాళపత్ర గ్రంధాలను పరిశోధించవల్సిందిగా ఆనంద గజపతి రాజు శ్రీ గురజాడను నియమించారు. శ్రీ గురజాడ వారి గేయ కధ ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ ఇంగ్లీషులో రాసిన ‘సాంగ్స్ అండ్ బ్లూ హిల్స్’ అనే గేయాలు గురజాడ రచనల్లో ప్రసిద్ది పొందాయి. ఆయన రాసిన కధానిక నీ పేరేంటీ?, పెద్ద మసీదు, సంస్కర్త హృదయం, మాటా మంతి... ఆనాడు సామాజిక వాస్తవ పరిస్ధితులను ప్రతిబింబింప చేస్తూ సజీవంగా నేటికీ దర్శనమిస్తాయి.

శ్రీ గురజాడ అప్పారావు తరచు కలకత్తా వెళుతూ ఉండేవారు. విశ్వకవి రవీంద్ర నాథ్ ఠాగూరు వంటి రచయితలను కనుసుకొని వారి ప్రశంసలు పొందారు. గురజాడ అడుగు జాడల్లో నేటి సాహితీ వేత్తలు ఎంతో మంది నడవటానికి కృషి చేస్తున్నారు. ఆయన దేశ భక్తి, సంఘసేవ, సాహిత్య ప్రతిభ, ఆంధ్రుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవటాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి హైద్రబాద్‌లో ట్యాంక్‌బండ్ మీద నిర్మించిన శిలా విగ్రహాల్లో ఒకటి ప్రతిస్థాపించారు.

నేటికి కూడా విజయనగరంలో ఆయన నివసించిన గృహాన్ని ప్రాచీన దర్శనీయ స్థలంగా రూపొందించారు. శ్రీ గురజాడ ఆధునిక తెలుగు సాహిత్యానికి నూతన ఒరవడులు దిద్దారు. 1915 నవంబరు 30వ తేదీన ఆయన అనారోగ్యంతో మరణించారు. ఆయన మరణించినప్పటికీ ఆయన రాసిన కన్యాశుల్కం నాటక రూపంలో నేటికి కూడా ఏన్నో చోట్ల ప్రదర్శింపబడి ప్రజాదరణ పొందుతోంది. అంతే కాకుండా చలన చిత్ర రూపంలో కూడా కన్యాశుల్కం ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందింది. పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ కధ ఆకాశవాణిలో రేడియో అన్నయ్య (న్యాయపతి రాఘవరావు) సంగీత నృత్య రూపకంగా తయారు చేసి తెలుగులోకి తీసుకురావడమే కాకుండా బాలల హృదయాలను కదిలించే విధంగా చిత్రీకరించారు. గురజాడ వంటి కవులు నూటికి - కోటికి ఒక్కరు ఎప్పుడో - ఎక్కడో పుడతారు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved