22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

దుర్గా బాయి దేశ ముఖ్

By వై, వెంకటరత్నం

దేశ స్వాతంత్రోద్యమంలో ఎందరో ఆంధ్ర మహిళలు పాల్గొన్నారు. వారిలో డా|| దుర్గా బాయి దేశ్‌ముఖ్‌ ప్రముఖులు. ఈమె పేరు గాని ఆమె స్థాపించిన ఆంధ్ర మహిళా సభ పేరు గాని తెలియని వారు ఆంధ్ర ప్రదేశ్‌ లో ఉండరేమో, అతి చిన్న వయసులోనే గాంధీజీ ప్రభావం ఈమెపై పడింది. బాలికగా వున్నప్పుడే జాతీయోద్యమం కోసం తన బంగారు గాజులను ఇచ్చివేసింది. ఎన్నో సందర్బాలలో గాంధీజీ ఆమె ఉదారత్వానికి పరవశించి ఒక చిరువునవ్వుతో ఆమె హృదయంపై చెరగని ముద్ర వేసి ఆమె జీవితానికి ఒక స్ఫూర్తినిచారు.

బాపూజీకి ప్రియ శిష్యులైన దుర్గా బాయి 1909 జులై 15వ తేదీన రాజమండ్రి లో జన్మించారు. దుర్గా బాయి ప్రతిభ బాల్యంలోనే వెల్లువిరిసింది. హిందీలో పాండిత్యం గడించింది. ఆమె కాకినాడలో హిందీ పాఠశాలను పెట్టి చాలా మంది మహిళలకు హిందీ భాషను నేర్పించారు. దుర్గా బాయి రంగవల్లుల్లు వేయటంలో ఆమెకు ఆమే సాటి. వీణావాదనలో దిట్ట అనిపించుకొన్నది. స్త్రీ సాంఘీక సంక్షేమ సంస్థ సహకారంతో ఆంధ్ర మహిళా సేవా కేంద్రాలను మద్రాసులోను, హైద్రాబాదులోను ఆంధ్రప్రదేశ్‌లోని 12 జిల్లల్లోనూ స్థాపించి ఎందరో మహిళలకు ఆశాదీపాలుగా వెలుగుబాట చూపించాయి. స్త్రీ వయోజన విద్యకు ఈ సంస్థ ద్వారా బాట వేసింది.

కందుకూరి వీరేశలింగం పంతులు, మహర్షి వెంకటరత్నం నాయుడు గార్ల ఉద్బోథలతో ఆమె సాంఘిక దురాచారాలను రూపు మాపడానికి స్త్రీలలో చైతన్యం కలుగ చేయడానికి ఎంతో కృషి చేసింది. వితంతువుల యెడల చూపబడుతున్న నిరాదరణ వ్యతిరేకించేది. ఎంతోమంది దిక్కులేని అనాధ స్త్రీలకు ఆర్ధికంగా తమ కాళ్ళమీద తాము నిలబడేందుకు సహాయం చేసింది.

1927 లో గాంధీజీ కోటి రూపాయల నిధి సేకరణ చేస్తూ ఆంధ్ర పర్యటన కు వచ్చారు. రాజమండ్రి సమీపంలోని సీతానగరం ఆశ్రమంలో బసచేశారు. ఆకాలంలో భోగం మేళాలు ఎక్కువగా ఉండేవి. దేవదాసీల జీవితం దుర్భరంగా ఉండేది. వారేకాక ముస్లిం మహిళలు కూడా సంప్రదాయాలకు బానిసలై బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఉండేవారు. వారికో వెలుగు చూపాలని నిశ్చయించింది. దుర్గా బాయి స్త్రీల కోసం ప్రత్యేక సభ ఏర్పాటు చేసి, ఏ సభలో గాంధీజీ గారిచే ఉపన్యాసం ఇప్పించాలనుకున్నది. కాంగ్రేస్‌ నాయకులైన బులుసు సాంబమూర్తి, కొండా వెంకటప్పయ్య గార్ల వద్దకు వెళ్ళి దుర్గాబాయి తన కోర్కెను వెళ్ళడించింది. అప్పుడు ‘అయిదువేల నిధి సమర్పిస్తే , గాంధీగారిని అయిదు నిమిషాలు మాట్లాడమని చెబుతాం ’ అని బులుసు సాంబమూర్తిగారు అన్నారు. వారం రోజుల్లో అయిదు వేల రూహాయలు వసూలు చేసి ‘అయ్యా! ఇదిగో అయిదువేలు - కార్యక్రమాలు ఏర్పాటు చేయండి’ అన్నది దుర్గాబాయి.

అయిదు నిమిషాలంటూ ఉహన్యాసం ప్రారంభించిన గాంధీజీ గంట సేపు మాట్లాడారు. బీదల కోసం డబ్బులివ్వండి’ అన్నారు. మహిళలు తమ గాజులు, ఒంటిమీద ఆభరణాలు తీసి ఇచ్చారు. దుర్గాబాయి అయిదువేల నిధి సమర్పించింది. సభలోని మహిళలిచ్చిన ఆ నగలు, నగదు పాతిక వేలు మించింది. గాంధీజీ దుర్గాబాయి ని తన కారులో కూర్చోమన్నారు. ఆయన దుర్గాబాయిని ఎంతగానో మెచ్చుకున్నారు. ఆంధ్ర పర్యటన ఆంతా దుర్గాబాయి, అనువాదకురాలుగా సాగింది. మద్రాసులో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో ఆమె నాయకురాలు. రెండేళ్ళ జైలు శిక్ష తర్వాత విడుదలయ్యారు.

పట్టుదలకు ప్రతీక దుర్గాబాయి. ప్రైవేటుగా బెనారస్‌ యూనివర్శిటీ నుండీ మెటిక్యులేషన్‌పాసై, అక్కడే ఇంతర్మీడియట్‍పాసయ్యారు. అక్కడే బి.ఏ. (ఆనర్స్‌ ) చదవడానికి వీలు కాలేదు. వాల్టేరు వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో చేరాలని, వైస్ ఛాన్స్‌లర్ డా.సి. ఆర్.రెడ్డిగారిని కలుసుకున్నారు. మహిళలకు ప్రత్యేకంగా హాస్టల్ లేనందున వీలు కాదన్నారు. పది మంది మహిళల అప్లికేషన్లు అందించి మరల అభ్యర్ధించగా డా|| రెడ్డిగారు అనిమతించారు. దుర్గాబాయి బి.ఏ. మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. మద్రాసు లా కాలేజీలో బి.ఎల్.పట్టా పుచుకున్నారు. సివిల్ మరియు క్రిమినల్ కేసులను చేపట్టి, బాగా పేరు సంపాదించారు. ఆమె మద్రాసులో ప్రాక్టీసు చేస్తూ, ఆమె ఆంధ్ర మహిళా సభ భవన నిర్మాణానికి పూనుకున్నారు. కస్తూరిబానిధికి వేలాది రూపాయలు వసూలు చేసి గాంధీజీకి ఇచ్చారు.

ఆమె ప్రతిభా సమర్ధ్యాలను గుర్తించిన నాయకులు ఆమెను రాజ్యాంగ సభ సభ్యులుగా ఎన్నుకున్నారు. డాక్టర్ అంబేద్కర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, బి.ఎన్.రావు వంటి ఉద్దండులతో కనిసి ప్రాధమిక హక్కులు, స్త్రీలకు ఆస్తి హక్కు మున్నగు అంశాలను రాజ్యాంగంలో చేర్పించారు.

1950 తర్వాత ఆమె సాంఘిక సేవారంగంలో ప్రవేశించారు. ప్రధాని జవహర్‌లాల్ నెహ్రుగారు గారు పాతికవేల రూపాయల చెక్కు ఇచ్చి రాయల సీమలో క్షామ నివారణ పథకాల పర్యవేక్షణకు పంపారు.1952 లో దుర్గాబాయి ని ప్లానింగ్ కమీషన్ మెంబరుగా ప్రభుత్వం నియమించింది. 1953లో సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్ గా వుంటూ పదేళ్ళూ పని చేశారు. ఆ సమయం లోనే మహా మేధావి, కేంద్ర, ఆర్ధిక శాఖ మంత్రి డాక్టర్ చింతామణి దేశ్‌ముఖ్ గారిని పెళ్ళాడారు.

కేంద్ర సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఆమె అవిశ్రాంతంగా కృషి చెశారు. 1957 లో డా||దేశ్‌ముఖ్‌ ఆర్ధిక శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి యూనివర్శిటీ గ్రాంట్‌ కమీషన్ చైర్మన్ గా నెలకు ఒక రూపాయి వేతనంలో మూడేళ్ళు పనిచేశారు. 1967 లో దేశ్‌ముఖ్ దంపతులు డిల్లీ వదలి హైదరాబాదులో స్థిరపడినారు. తమ ఇంటికి ‘రచన’ అని పేరు పెట్టుకున్నారు.

ఆంధ్ర మహిళా సభ కార్యక్రమాలు మూడు పూవులు ఆరుకాయలుగా విస్తరించాయి. నర్శింగ్ హోమ్, ఆర్ధోపెడిక్ సెంటర్, శిశు విహార్, నర్స్‌స్ హాస్టల్ మరెన్నో వైద్యశాల భవనాలు ఏమె సేకరించిన విరాళాలతో వెలిశాయి. దాదాపు 23 సంస్థలకు ఆమె మూలకారకురాలు.

దేశ ముఖ్ దంపతులు తమ ఆస్తిపాస్తులన్నింటినీ సేవా సంస్థల స్థాపనకు విరాళంగా ఇచ్చారు. 26 ఏళ్ళ దాంపత్య జీవితం సేవామయంగా సాగింది. నిరంతర శ్రమ, కార్య దీక్ష పట్టుదల నిజాయితీ అన్నీ మూర్తీభవించిన మహిళా మణి దుర్గాబాయి.

1971లో ఆమె వయోజన విద్యావ్యాప్తికి చేసిన కృషికి భారత ప్రభుత్వం ‘నెహ్రు నిటరసీ’ అవార్డు ఇచ్చి సత్కరించింది. 1975 జనవరి 26 న ఆమెను ‘పద్మ విభూషణ’తో ప్రభుత్వం సత్కరించింది. లాయరుగా జమిందారుల కేసులన్నీ కోర్టులో వాదించి గెలిచి వారి నుంచి తీసుకున్న ఫీజుల మొత్తమును ఆంధ్ర మహిళా సభకు ఈచ్చిన త్యాగమూర్తి శ్రీమతి దుర్గాబాయి.

స్వతంత్ర పత్రికలో ఖాసా సుబ్బారావుగారు ఆమె గురించి “దుర్గాబాయి విసుగు విరామం లేని మనిషి, తన సహచరులను కూడా తనలాగే విరామ మెరుగని సేవాతత్పరులుగా ఆవేశ పూరితులుగా చేయగల నాయకురాలామె. జీవితంలో ఓటమి వుంటుందేమో అన్న భయం ఆమెకు లేదు.... సహారా ఎడారి లో కూడా ఆమెకు చేయడానికి ఏదో సేవా కార్యక్రమం కనిపిస్తుంది.” ఆని రాశారు.

ఈమె ఆంధ్ర మహిళ అను పత్రికను నిర్వహించింది. తరువాత దానిని విజయదుర్గా అనే పేరుతో ఆంగ్లముతో, తెలుగు లో ప్రచురింపబడింది ఆమె ‘దిస్టోన్ - దట్‌ స్పీక్స్’ అనే పుస్తకంలో ఆంధ్ర మహిళా సభ చరిత్ర యావత్తు పొందుపరచింది. ప్రేమ్‌చంద్ కధలను తెలుగులోకి అనువదించింది. ‘చింతామణి మరియు నేను’ అనే ఆత్మ కధను రచించింది. ఆమె రచించిన “భారతంలో సాంఘీక సంక్షేమం” అమూల్య గ్రంధముగా ఎందరో నేటికి భావిస్తారు. దేశ భక్తురాలిగా, స్వాతంత్ర్యసమర యోధు రాలిగా ,సంఘసంస్కర్తగా, సంఘ సేవకురాలిగా, రచయిత్రిగా, బహుముఖ ప్రఙ్ఞావంతురాలిగా గుర్తింపు పొందిన వ్యక్తి, ఎన్నో జీవితాలకు వెలుగు చూపిన వ్యక్తి 1981 మే 9 వ తేదీన పరమపదించారు. నేటి మహిళలకు ఈమె గొప్ప స్ఫూర్తినిచ్చే ఆదర్శ మహిణగా చరిత్ర లో నిలిచిపోయింది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved